ఆకతాయిల చేతుల్లో గాయపడ్డ యువకుడు
సాక్షి, అంబర్‌పేట(హైదరాబాద్): ఆకతాయిలు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. గల్లీ ఘర్షణలు ఎక్కువవుతున్నాయి. అంబర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని పలు బస్తీల్లో ఆకతాయిల ఆగడాలు మితిమీరుతున్నాయి. కాస్త చీకటి పడగానే గల్లీల్లో తిష్టవేసి వారు చేసే ఆగడాలకు స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ప్రేమ్‌నగర్, ఆజాద్‌నగర్, మహ్మద్‌నగర్, న్యూ పటేల్‌నగర్, గోల్నాకలోని లంకా బస్తీలు, దుర్గానగర్ తదితర ప్రాంతాల్లో ఆకతాయిల ఆగడాలు హద్దులు దాటుతున్నాయి. దీంతో మహిళలు, యువతులు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు.
ఫిర్యాదులకు కనిపించని స్పందన..
► ఆకతాయిల ఆగడాలపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పెద్దగా పట్టించుకోవడం లేదు. ఫిర్యాదు చేసినప్పుడే తూతూ మంత్రంగా ఘటనా స్థలాన్ని సందర్శించి పోతున్నారు. మితిమీరిన ఆగడాలతో స్థానికులు ఫిర్యాదు చేయడానికి సైతం ధైర్యం చేయడం లేదు.
నేరుగా ఫిర్యాదులు చేస్తేనే పట్టించుకుంటామని పోలీసులు తేల్చి చెబున్నారు. ఇప్పటికైనా పోలీసులు ప్రత్యేక పెట్రోలింగ్ నిర్వహించి ఆకతాయిల ఆగడాలను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు.
మత్తులో యువత హంగామా..
► యువకులు డ్రగ్స్, మద్యం మత్తులో ఘర్షణ పడుతున్నారు. ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూ స్థానికంగా భయానక వాతావరణం సృష్టిస్తున్నారు. వీరి మధ్యలో అడ్డుపడితే వారిపై సైతం దాడులు చేస్తున్నారు. ఇలాంటి ఫిర్యాదులు వచ్చినా పోలీసులు పెద్దగా స్పందిస్తున్న దాఖలాలు లేవు.
వారిలో వారు కొట్టుకుంటున్నారులే అనే చందంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. సాయంత్రం అయిందంటే బయటకు వెళ్లే పరిస్థితి లేదని, పోలీసులు తక్షణమే స్పందించి ఆకతాయిలపై చర్యలు తీసుకోవాలని స్థానిక మహిళలు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment