ప్రొద్దుటూరు క్రైం : ఎందుకో తెలియదు.. యువకులందరూ ఒక్కసారిగా గుమికూడుతారు.. ఏ కారణం లేకుం డానే ఒకరిపై మరొకరు దాడులకు తెగపడతారు.. నడి రోడ్డుపై వీరు చేసే బీభత్సం అంతా ఇంతా కాదు.. యువకులు వీధిన పడి తన్నుకునే దృశ్యాలు సినిమా షూటింగ్‌ను తలపించేలా ఉంటాయి. ఈ సంఘటనలు తరచూ ఒకే ప్రాంతంలో జరుగుతుం డటంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. గత కొన్ని రోజులుగా ప్రొద్దుటూరులోని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఒక గ్యాంగ్ పేరు అందరి నోళ్లలో నానుతోంది. ఆ స్టేషన్ పరిధిలో ఎక్కడ ఏ సంఘటన జరిగినా అందులో ఆ గ్యాంగ్ హస్తం ఉందనే పుకార్లు వినిపిస్తుంటాయి. కొన్ని రోజుల నుంచి కేహెచ్‌ఎం స్ట్రీట్, హైదర్‌ఖాన్ వీధి, రామేశ్వరంపేట, రామేశ్వరం రోడ్డులలో బ్యాచ్‌లు హల్ చల్ చేస్తున్నాయి. వారంలో ఒక రోజైనా ఈ ప్రాంతంలో యువకులు రోడ్డున పడి తన్నుకునే సంఘటనలు జరుగుతున్నట్లు స్థానికులు అంటున్నారు. ఈ ప్రాంతంలో ఉన్న 30–40 మంది యువకులు తరచూ జరిగే గొడవలకు కారణమవుతున్నారు.
నిఘా నీడలో కేహెచ్‌ఎం స్ట్రీట్
కొన్ని రోజుల నుంచి ఖాదర్‌హుసేన్ మసీదు వీధి పోలీసు నిఘా నీడలో ఉంది. ఇటీవల ఈ వీధిలో ఇరు వర్గాలకు చెందిన యువకులు బాహాబాహీ తలపడ్డారు. పలు మార్లు తలపడటానికి మాటు వేయడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఇరువర్గాల వారిని చెదరగొట్టారు. రోజూ సమస్యాత్మకంగా ఉండటంతో పోలీసులు ఇటీవల నాలుగైదు రోజుల పాటు 144 సెక్షన్ అమలు చేశారు. అధికార పార్టీ నాయకులు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నట్లు ఆ ప్రాంత వాసులు చెబుతున్నారు. ఈ వ్యవహారం పోలీసులకు తలనొప్పిగా మారడంతో ఇటీవల వీధిలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.
మకాం మార్చిన యువకులు
కొన్ని రోజుల వరకూ ఖాదర్‌హుసేన్ మసీదు వీధిలో తిష్టవేసిన గ్యాంగ్‌స్టర్స్ ఇప్పుడు రూట్ మార్చారు. ఈ వీధిలో సీసీ కెమెరాలు ఉండటంతో వారి స్థావరాన్ని రామేశ్వరంపేట ప్రాథమిక పాఠశాల సమీపంలోకి మార్చినట్లు తెలుస్తోంది. కొందరు యువకులు అర్ధరాత్రి వరకూ ఇక్కడ మద్యం సేవిస్తూ, దారిలో వెళ్లే వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. రౌడీల భరతం పడతామని జిల్లా ఎస్పీ అట్టాడ బాబూజీ చెబుతున్నా ప్రొద్దుటూరులో మాత్రం బ్యాచ్‌ల సంస్కృతి మళ్లీ పురుడుపోసుకుంటోంది. కొన్ని గ్యాంగ్‌లకు రాజకీయ అండ ఉండటంతో పోలీసులు ఉపేక్షిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కౌన్సెలింగ్ పేరుతో ఇటీవల అమాయకులైన కొందరు విద్యార్థులను చితక బాదిన పోలీసులు అసలైన రౌడీలను మాత్రం పట్టుకోలేక పోతున్నారనే విమర్శలు ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి.
గ్యాంగ్‌లతో భయాందోళనలు
♦ సంక్రాంతి పండుగ ముందు రోజు రాత్రి ఇద్దరు యువకులు సుందరాచార్యుల వీధిలో నడిరోడ్డుపై తన్నుకున్నారు. ఈ క్రమంలోనే తన వద్ద ఉన్న పిడి బాకుతో మరో యువకుడి వీపు భాగంలో పొడవడంతో తీవ్ర గాయాలయ్యాయి. పెద్ద ఎత్తున జనం గుమి కూడడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. మైనర్లు కత్తులు దగ్గర పెట్టుకొని తిరగడంపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ సంఘటనపై నాలుగు రోజుల వరకు పోలీసులు కేసు నమోదు చేయలేదు.
♦ కొన్ని రోజుల క్రితం ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒక వ్యక్తి ఆటో మాట్లాడుకొని సుందరాచార్యుల వీధిలోని తన దుకాణం వద్ద దిగాడు. ముందుగా మాట్లాడుకున్న దానికంటే రూ.10 తక్కువ ఇవ్వడంతో ఆటో డ్రైవర్ అందుకు ఒప్పుకోలేదు. దీంతో అతను ఆటో అతన్ని చితక బాదడంతో ముఖంపై గాయం అయింది. ఆ ప్రాంతానికి చెందిన అధికార పార్టీ నాయకుడి సోదరుడికి చెందిన దుకాణంలో ఉత్తరప్రదేశ్ వ్యక్తి మాస్టర్‌గా పని చేస్తున్నాడు.
♦ అర్ధరాత్రి సమయంలో కొందరు యువకులు తప్ప తాగి తమ ఇళ్ల వద్ద హల్‌చల్ చేస్తున్నారని ఈశ్వరరెడ్డినగర్‌కు చెందిన మహిళలు ఇటీవల వన్‌టౌన్ సీఐకి ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment