స్నేక్ ఐల్యాండ్ ఉత్తర ప్రాంతంలో ధ్వంసమైన దృశ్యం
కీవ్/లండన్: తూర్పు ఉక్రెయిన్‌లోని డోన్బాస్‌లో రష్యా సైన్యంగురువారం క్షిపణుల మోత మోగించింది. లీసిచాన్‌స్క్‌లో భీకర స్థాయిలో వైమానిక దాడులు సాగించింది. అలాగే లుహాన్‌స్క్‌లో 95 శాతం, డోంటెస్క్‌లో 50 శాతం భూభాగాన్ని రష్యా సైన్యం, రష్యా అనుకూల వేర్పాటువాద శక్తులు ఇప్పటికే ఆక్రమించాయి. లీసిచాన్‌స్క్‌లోకి ప్రవేశించేందుకు రష్యా సేనలు ప్రయత్నించగా ఉక్రెయిన్ జవాన్లు సమర్థంగా తిప్పికొట్టారని లుహాన్‌స్క్ గవర్నర్ సెర్హియి హైడై చెప్పారు. లీసిచాన్‌స్క్ చుట్టూ రష్యా సైన్యం మోహరించించి ఉందని వెల్లడించారు. క్రెమెన్‌చుక్‌లోని భారీ షాపింగ్ మాల్‌లో రష్యా వైమానిక దాడుల్లో చనిపోయిన 18 మంది మృతదేహాలకు గురువారం అంత్యక్రియలు నిర్వహించారు. షాపింగ్ మాల్‌లో అదృశ్యమైన 20 మంది ఆచూకీ ఇంకా తెలియరాలేదు.
స్నేక్ ఐలాండ్ నుంచి రష్యా వెనక్కి
ఉక్రెయిన్‌లో రష్యా సైన్యం వ్యూహాత్మకంగా ముందుకు కదులుతోంది. నల్ల సముద్రంలోని స్నేక్ ఐలాండ్ నుంచి రష్యా సేనలు ఖాళీ చేస్తున్నాయి. తూర్పు ఉక్రెయిన్‌లోని లుహాన్‌స్క్‌పై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాయి. కీలక పారిశ్రామిక ప్రాంతం డోన్బాస్‌ను హస్తగతం చేసుకోవడమే లక్ష్యంగా దాడులను ఉధృతం చేస్తున్నాయి. సరైన వ్యూహంతోనే స్నేక్ ఐలాండ్ నుంచి వెనక్కి మళ్లినట్లు రష్యా రక్షణ శాఖ ప్రకటించగా, తమ దాడులను తట్టుకోలేకే రష్యా సేనలు పారిపోయాయమని ఉక్రెయిన్ అధికార వర్గాలు తెలిపాయి.
ఉక్రెయిన్ నుంచి ఆహార ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేయడానికి వీలుగా ఐక్యరాజ్యసమితి ప్రత్యేక కారిడార్ ఏర్పాటు చేస్తోందని, ఆ ప్రయత్నాలకు ఆటంకం కలగకుండా ఉండడానికే స్నేక్ ఐలాండ్ నుంచి తమ సేనలను వెనక్కి రప్పించామని రష్యా రక్షణ శాఖ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ ఇగోర్ కొనాషెంకోవ్ వెల్లడించారు. ఉక్రెయిన్‌లోని ఓడరేవులను రష్యా దిగ్బంధించిందని పశ్చిమ దేశాలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.
డోన్బాస్ విముక్తి పోరాటం: పుతిన్
ఉక్రెయిన్ విషయంలో తమ లక్ష్యాల్లో ఎలాంటి మార్పు లేదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తేల్చిచెప్పారు. ఆయన గురువారం తుర్క్‌మెనిస్తాన్‌లో పర్యటించారు. డోన్బాస్ విముక్తి కోసం, అక్కడి ప్రజల రక్షణ కోసం పోరాడుతున్నామని చెప్పారు. రష్యా భద్రతకు హామీనిచ్చే పరిస్థితులను సృష్టించుకోవాలన్నదే తమ ఉద్దేశమని వివరించారు. కీవ్‌ను స్వాధీనం చేసుకోవడంలో రష్యా విఫలమైందంటూ వస్తున్న విమర్శలను పుతిన్ ఖండించారు. ప్రణాళిక ప్రకారమే తమ సైన్యం పోరాటం కొనసాగిస్తోందని పేర్కొన్నారు. తుర్క్‌మెనిస్తాన్‌లోని అష్గాబాట్‌లో కాస్పియన్ సీ లిటోరల్ స్టేట్స్ శిఖరాగ్ర సదస్సులో పుతిన్ పాల్గొన్నారు.
ఉక్రెయిన్‌కు అదనపు సైనిక సాయం
ఉక్రెయిన్‌కు మరో బిలియన్ పౌండ్ల విలువైన సైనిక సాయం అందజేస్తామని బ్రిటిష్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ ప్రకటించారు. స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లో గురువారం నాటో నేతల శిఖరాగ్ర సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సాయం కింద అత్యాధునిక ఆయుధాలు ఇస్తామన్నారు. పౌరుల ప్రాణాలను బలిగొంటున్న రక్కసి పుతిన్ అని దుయ్యబట్టారు. యూరప్ భద్రత, శాంతికి రష్యా పెనుముప్పుగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment