
స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 5 గంటలు. వెలుగు రేఖలు పుడమిని పలుకరించే సమయం ఆసన్నమైంది. జనమంతా అప్పుడే నిద్ర నుంచి మేల్కొంటున్నారు. ఇంతలోనే రష్యా సైన్యం దండయాత్ర ప్రారంభించింది. ప్రభాత కిరణాలకు బదులు ఆకాశం నుంచి నిప్పుల వాన మొదలయ్యింది. గ్రీన్‌విచ్ మీన్ టైమ్(జీఎంటీ) ప్రకారం.. ఉదయం 3 గంటలకు రష్యా అధ్యక్షుడు పుతిన్ నుంచి యుద్ధ ప్రకటన వెలువడింది. ఆ తర్వాత వరుసగా పలు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఎప్పుడేం జరిగిందంటే...
ఉదయం 03: ఉక్రెయిన్‌లోని డాన్‌బాస్‌పై దాడి ప్రారంభించినట్లు పుతిన్ ప్రకటన. ఆయుధాలు వదిలేసి ఇళ్లకు తిరిగి వెళ్లాలని ఉక్రెయిన్ సైన్యానికి సూచన. జోక్యం చేసుకొనేందుకు ప్రయత్నిస్తే ఎన్నడూ చూడని తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఇతర దేశాలకు హెచ్చరిక.
ఉదయం 3.35: ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రను తీవ్రంగా ఖండించిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. ముందస్తు హెచ్చరిక లేకుండా దాడికి దిగడం అన్యాయమని వెల్లడి. ఈ అవాంఛనీయ పరిణామాలకు రష్యా బాధ్యత వహించాలని స్పష్టీకరణ. రష్యా దుందుడుకు చర్యను ఖండించిన ‘నాటో’ సెక్రెటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్. రష్యా సైనిక బలగాలను, ఆయుధాలను ఉక్రెయిన్ నుంచి వెనక్కి మళ్లించాలని పుతిన్‌కు ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటేరస్ వినతి. ఉక్రెయిన్ అధ్యక్షుడు జేలెన్‌స్కీతో ఫోన్‌లో మాట్లాడిన జో బైడెన్. ఉక్రెయిన్ ప్రజలకు అండగా ఉంటామని హామీ.
ఉదయం 3.46: తూర్పు ఉక్రెయిన్‌లోని మారియూపోల్‌లో తీవ్రస్థాయిలో వినిపించిన పేలుళ్ల శబ్దాలు.
ఉదయం 04.00: కీవ్ ఎయిర్‌పోర్టు నుంచి ప్రయాణికులను, సిబ్బంది ఖాళీ చేసినట్లు ఉక్రెయిన్ మౌలిక సదుపాయాల శాఖ ప్రకటన.
ఉదయం 4.15: రాజధాని కీవ్‌తోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో వినిపించిన బాంబు పేలుళ్ల శబ్దాలు. కీవ్‌లో ఏడుసార్లు భీకర శబ్దాలు వినిపించినట్లు అల్ జజీరా ప్రతినిధి ఆండ్రూ సైమన్స్ వెల్లడి. రష్యా అనుకూల తిరుగుబాటుదారుల అధీనంలో ఉన్న డొనెట్క్స్, ఖార్వివ్‌లోనూ పేలుళ్ల శబ్దాలు.
ఉదయం 4.30: తమ దేశంపై రష్యా పూర్తిస్థాయి యుద్ధం ఆరంభించిందని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా స్పష్టీకరణ. కీలక నగరాలపై క్షిపణి దాడులు చేస్తోందని వెల్లడి.
ఉదయం 4.30: ఉక్రెయిన్ కంప్యూటర్లపై సైబర్ దాడులు చేసిన రష్యా
ఉదయం 4.41: పేలుళ్ల దృష్టా ప్రజలంతా ఇళ్లల్లోనే ఉండాలని కీవ్ నగర మేయర్ సూచన.
ఉదయం 4.45: డాన్‌బాస్‌లో రష్యా సైనిక చర్యలకు ప్రతిస్పందనగా తమ గగనతలాన్ని మూసివేసినట్లు ప్రకటించిన ఉక్రెయిన్.
ఉదయం 05: కీవ్‌లోని జుంటా ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని ఉక్రెయిన్‌కు వ్యతిరేకంగా రష్యా మిలటరీ ఆపరేషన్ చేపట్టినట్లు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసర భేటీలో తెలియజేసిన ఐరాసలోని రష్యా రాయబారి. ఉక్రెయిన్ ప్రజలకు తాము ఎంతమాత్రం వ్యతిరేకం కాదని ఉద్ఘాటన. లుహాన్స్క్ ప్రావిన్స్‌లో ఉక్రెయిన్ నియంత్రణలో ఉన్న ష్కాస్టియా పట్టణంపై దాడి చేసినట్లు రష్యా అనుకూల వేర్పాటువాదుల ప్రకటన. అలాగే డొనెట్క్స్‌లోని లైన్ ఆఫ్ కాంటాక్టు వద్ద ఉక్రెయిన్ దళాలపై విరుచుకుపడ్డామని వెల్లడి.
ఉదయం 5.25: అత్యంత కచ్చితత్వంతో కూడిన ఆయుధాలతో ఉక్రెయిన్ సైనిక మౌలిక సదుపాయాలను, వైమానిక స్థావరాలను నిర్వీర్యం చేశామని రష్యా రక్షణ శాఖ ప్రకటన.
ఉదయం 5.30: ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఉన్న దేశీయ విమానాశ్రయాల నుంచి విమానాల రాకపోకలను రద్దు చేసిన రష్యా.
ఉదయం 5.45: తమ దేశ తూర్పు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున క్షిపణి దాడులు జరుగుతున్నాయని ఉక్రెయిన్ ఆందోళన.
ఉదయం 06.00: రష్యాతోపాటు బెలారస్ భూభాగం నుంచి సైతం రష్యా సైన్యం దాడులు చేస్తోందని ఉక్రెయిన్ బోర్డర్ గార్డ్ సర్వీస్ వెల్లడి. రష్యా సంయమనం పాటించాలని చైనా విజ్ఞప్తి.
ఉదయం 6.05: ఉక్రెయిన్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన అధ్యక్షుడు వ్లాదిమిర్ జేలెన్‌స్కీ. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచన. దేశవ్యాప్తంగా మార్షల్ లా విధిస్తున్నట్లు ప్రకటన.
ఉదయం 6.20: ఉక్రెయిన్ వైమానిక స్థావరాలపై దాడులు చేశామని, గగనతల రక్షణ వ్యవస్థలను బలహీనపర్చామని రష్యా రక్షణ శాఖ ప్రకటన. తమ యుద్ధ విమానాన్ని ఉక్రెయిన్ నేలకూల్చినట్లు వస్తున్న వార్తలను ఖండించిన రష్యా.
ఉదయం 6.48: లుహాన్స్క్ ప్రావిన్స్‌లోని ష్కాస్టియా, స్టానిస్టియా పట్టణాలను స్వాధీనం చేసుకున్నామని తేల్చిచెప్పిన రష్యా అనుకూల వేర్పాటువాదులు.
ఉదయం 07: లుహాన్స్క్‌లో ఐదు రష్యా యుద్ధ విమానాలను, ఒక హెలికాప్టర్‌ను నేలకూల్చామ ని ఉక్రెయిన్ సైన్యం ప్రకటన.
ఉదయం 7.15: క్రిమియా నుంచి రష్యా ఆయుధాలను, సైనిక సామగ్రిని తమ భూభాగంలోకి చేరవేస్తోందని ఉక్రెయిన్ వెల్లడి. పశ్చిమ ఉక్రెయిన్‌లోని లెవివ్ ప్రాంతంపై గురిపెట్టిన రష్యా సైన్యం. రష్యా దాడుల్లో తమ దేశంలో కనీసం 8 మంది మరణించారని, మరో 9 మంది గాయపడ్డారని ఉక్రెయిన్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి సలహాదారు వెల్లడి. చెర్నీహివ్, ఖార్కివ్, లుహాన్స్క్ నుంచి సరిహద్దులు దాటి ఉక్రెయిన్‌లోకి ప్రవేశిస్తున్న రష్యా సైన్యం.
ఉదయం 7.46: తీరు మార్చుకోకపోతే రష్యాపై కఠిన ఆంక్షలు విధిస్తామని ఈయూ హెచ్చరిక
ఉదయం 8.22: ఉక్రెయిన్‌పై దాడులు ఆపాలని పుతిన్‌కు ఐక్యరాజ్యసమితి విజ్ఞప్తి
ఉదయం 9.10: తమ సైనిక సాయం అందజేయాలని ప్రపంచ దేశాలకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జేలెన్‌స్కీ వినతి
ఉదయం 9.51: రష్యాతో దౌత్యపరమైన సంబం ధాలు తెంచుకుంటున్నట్లు జేలెన్‌స్కీ ప్రకటన
ఉదయం 10.02: రష్యా దాడుల్లో తమ దేశంలో ఇప్పటిదాకా 40 మంది మరణించినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడి సలహాదారు వెల్లడి
Comments
Please login to add a commentAdd a comment