Russia-Ukraine War News Day 7 Live Updates in Telugu - Sakshi
Sakshi News home page

ఉక్రెయిన్‌ ఆక్రమణ:చిట్టచివరి అస్త్రాన్ని ప్రయోగించేందుకు సిద్ధంగా రష్యా

Published Wed, Mar 2 2022 7:37 AM | Last Updated on Wed, Mar 2 2022 7:22 PM

Russia Ukraine War News Live Updates Telugu Day 7 - Sakshi

Ukraine-Russia War LIVE Updates In Telugu: ఉక్రెయిన్‌ ఆక్రమణలో భాగంగా రష్యా దూకుడు పెంచింది. మంగళవారం నుంచి దాడుల్ని ముమ్మరం చేసిన రష్యా బలగాలు.. పౌరులున్నారని కూడా చూడకుండా క్షిపణి, బాంబులు, బుల్లెట్లతో విరుచుకుపడుతున్నాయి. గత 24 గంటల్లో ఉక్రెయిన్‌ సైన్యం కంటే.. సాధారణ పౌరుల మరణాలే ఎక్కువగా నమోదు అయినట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా.. 

పుతిన్‌కు ప్రధాని మోదీ ఫోన్.. డెడ్‌లైన్‌ విధించిన రష్యా 
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. ఈ సందర్భంగా భారతీయులు సురక్షితంగా బయటకొచ్చేందుకు సేఫ్ ప్యాసేజ్ (సురక్షిత మార్గం) కల్పించాలని కోరారు. ఇందుకు రష్యా ఖార్కివ్ నుంచి భారతీయులు వెళ్లేందుకు 6 గంటల పాటు వెసులుబాటు కల్పించింది. ఉక్రెయిన్ కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటల (భారత కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 9.30 గంటలు) వరకు డెడ్‌లైన్ విధించింది.

తక్షణమే కార్కీవ్‌ వీడండి: ఇండియన్‌ ఎంబసీ
ఖార్వివ్‌పై భీకర్‌ దాడులు జరిగే అవకాశం ఉన్నందున భారతీయులు తక్షణమే ఆ ప్రాంతాన్ని వీడాలని ఇండియన్‌ ఎంబసీ సూచించింది. ఉక్రెయిన్‌ కాలమానం ప్రకారం సా.6 గంటలలోపు ఖార్కివ్‌ను వీడాలని తెలిపింది.

రష్యాకు సపోర్ట్‌.. బెలారస్‌కు బిగ్‌ షాక్‌
 రష్యా ఉక్రెయిన్‌పై జరుపుతున్న దాడులకు ప్రత్యక్షంగా బెలారస్‌ సహకారం అందించిన విషయం తెలిసిందే. బెలారస్‌ నుంచే రష్యా బలగాలు ఉక్రెయిన్‌లోకి చోరబడ్డాయి. ఈ నేపథ్యంలో బెలారస్‌ ఊహించని షాక్‌​ తలిగింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడిలో సహాయక పాత్ర పోషించిన కారణంగా బెలారస్‌పై యూరోపియన్‌ యూనియన్‌ ఆంక్షలు విధేంచేందుకు సిద్ధమైంది. ఆంక్షల ఆమోదానికి ఈయూ దౌత్యవేత్తలు అంగీకరించినట్టు ఫ్రెంచ్‌ ప్రెసెడెన్సీ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఇప్పటికే అమెరికా సైతం బెలారస్‌లో తమ రాయబార కార్యాలయం కార్యకలాపాలను సస్పెండ్‌ చేసింది.

ఉక్రెయిన్‌లో మరో భారతీయ విద్యార్థి మృతి
ఉక్రెయిన్‌లో మరో భారతీయ విద్యార్థి మృతి అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. 21 ఏళ్ల చందన్ జిందాల్ ఉక్రెయిన్‌లోని విన్నిట్సియాలో నాలుగేళ్లుగా చదువుతున్నాడు. అతను పంజాబ్‌లోని బుర్నాలాకు చెందినవాడు.

భారత్‌ విద్యార్థి మృతిపై స్పందించిన రష్యా

ఖార్కివ్‌లో భారత విద్యార్థి నవీన్‌ మరణానికి సంతాపం తెలిపారు. ఈ ఘటనపై రష్యా స్పందించడంతో పాటు దర్యాప్తు కూడా చేస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం ఉక్రెయిన్‌లోని పరిస్థితుల నేపథ్యంలో భారతీయులందరికీ భద్రత కల్పించనున్నట్టు పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితిలో ఉక్రెయిన్‌-రష్యా సంక్షోభంపై భారత్‌ తీసుకున్న తటస్థ వైఖరిని భారత్‌లో రష్యా రాయబారి డెనిస్‌ అలిపోవ్‌ ప్రశంసించారు. 

రష్యా చర్చలకు సిద్ధంగా ఉంది.. ఉక్రెయిన్‌ మాత్రం.. 
 ఉక్రెయిన్‌తో రెండవ రౌండ్ చర్చలకు మాస్కో సిద్ధంగా ఉందని, అయితే యుఎస్ ఆదేశాల మేరకు ఉక్రెయిన్ కాలయాపన చేస్తోందని రష్యా విదేశాంగ మంత్రి సెగీ లావ్‌రోవ్ చెప్పారు.

► రక్తపు ముద్దలు.. పారబోసినట్లుగా శవాలు 
రష్యా దాడులతో వల్లకాడుగా మారిపోయాయి ఉక్రెయిన్‌ ప్రధాన పట్టణాలు. ఎటు చూసినా శవాలు పారబోసినట్లుగా కనిపిస్తున్నాయి. నివాస భవనాలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు రష్యా మిస్సైల్స్‌, బాంబుల దాటికి ధ్వంసం అయిపోయాయి. అండర్‌ గ్రౌండ్‌లలో జనాలు ప్రాణాలు అరచేత పట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. రష్యా మారణహోమం ఆపితేనే.. చర్చలకు మార్గం సుగమం అవుతుందని పలు దేశాలు అభిప్రాయపడుతున్నాయి.

► భారత్‌ కీలక ప్రకటన
రష్యాపై ఆంక్షల నేపథ్యంలో భారత్‌ కీలక ప్రకటన చేసింది. పరిస్థితి క్లిష్టంగా ఉన్నప్పటికీ.. రష్యాతో సంబంధాలు మాత్రం కొనసాగుతాయని భారత నావికా దళం వైస్‌ చీఫ్‌ ఎయిర్‌ మార్షల్‌ సందీప్‌ వెల్లడించారు. అమెరికా ఆంక్షలతో తమపై ఎలాంటి ప్రభావం పడబోదని, భౌతిక-రాజకీయంగా పరిస్థితులు ప్రస్తుతం వేరుగా ఉన్నాయని, కానీ, రష్యాతో సత్సంబంధాలు మాత్రం కొనసాగుతాయని ఢిల్లీలో మీడియా సమావేశంలో ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే ఓటింగ్‌కు దూరంగా ఉంటూ ఆంక్షల విషయంలో ఎలాంటి అడుగు వేయబోమని పరోక్షంగా భారత్‌.. పాశ్చాత్య దేశాలకు సంకేతాలు పంపింది.

► రష్యాను చావు దెబ్బతీస్తున్నాం

గత ఆరు రోజుల్లో ఆరువేల మంది రష్యా సైనికులను మట్టుబెట్టినట్లు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రకటన చేశాడు. ఈ విషయంలో దీటుగా ఎదుర్కొంటున్న ఉక్రెయిన్‌ సైన్య పోరాట పటిమను ఆయన కొనియాడాడు. కొన్నిచోట్ల రష్యాను చావుదెబ్బ తీశామని, రష్యా మాత్రం లెక్కలు దాస్తోందని ప్రకటించుకున్నాడాయన. యుద్ధానికి విరామం ఇస్తేనే చర్చలు సజావుగా సాగుతాయని రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు సూచిస్తున్నాడు జెలెన్‌స్కీ.

► ఖార్కీవ్‌పై రష్యా పంజా.. 

ఒకవైపు రాజధాని కీవ్‌ నగరంతో పాటు ఖార్కీవ్‌పైనా రష్యా బలగాలు విరుచుకుపడుతున్నాయి. తాజాగా జరిగిన దాడుల్లో 21 మంది మృతి చెందినట్లు, 112 మంది గాయపడినట్లు ఖార్కీవ్‌ గవర్నర్‌ ప్రకటించారు.

► రష్యాకు మద్ధతుగా బలగాలను పంపే సన్నాహాల్లో బెలారస్‌!. ఆరోపణలకు దిగిన ఉక్రెయిన్‌ రక్షణ మంత్రిత్వ శాఖ

► అణ్వాయుధాల్ని సిద్ధం చేయాలని రష్యా అధ్యక్షుడు పుతిన్‌.. ఆ దేశ సైన్యానికి ఆదేశం.  ఇందులో భాగంగానే బేరెంట్స్‌ సముద్ర జల్లాలోకి అణు సబ్‌మెరైన్‌ మిస్సైల్స్‌ను తరలిస్తున్నారు. నార్తర్న్‌ ఫ్లీట్‌ ప్రకటన ప్రకారం.. మాక్‌ డ్రిల్స్‌లో ఇవి పాల్గొంటాయని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. తాము అణు యుద్ధానికి దిగబోమని, అమెరికా బలగాలను ఉక్రెయిన్‌కు తరలించబోమని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రకటించిన కాసేపటికే రష్యా ఈ చర్యలకు దిగింది. దీంతో సర్వత్రా ఆందోళన నెలకొంది.

► ఖార్కీవ్‌ గగనతలంలోకి ప్రవేశించిన రష్యా దళాలు. తీవ్ర ఉద్రిక్తత. 

► ఉక్రెయిన్‌ సంక్షోభంపై 6, 7వ తేదీల్లో అంతర్జాతీయ న్యాయస్థానంలో విచారణ. 

► మారియాపోల్‌ సహా అన్ని నగరాల్లో హోరాహోరీ పోరు. గుట్టలుగా సైనికుల శవాలు?.

► సైబీరియాలో సైనిక డ్రిల్స్‌కు పుతిన్‌ ఆదేశం.  బారెంట్స్‌ సముద్రంలోకి  ప్రవేశించిన క్షిపణి లాంఛర్లు

► తూర్పు ఉక్రెయిన్‌ పట్టణం సుమీలో చిక్కుకున్న 500 మంది విద్యార్థులు. రష్యా సరిహద్దులకు వంద కిలోమీటర్లలోనే ఈ ప్రాంతం. భయంలో విద్యార్థులు.. ఆందోళనలో తల్లిదండడ్రులు.

► తరలింపులో అవాంతరాలు.  రష్యా క్షిపణి దాడుల్లో పలు రైల్వే ట్రాకులు ధ్వంసం. ల్యాండ్‌ మైన్లు ఉన్న ప్రాంతం నుంచి ప్రయాణం కష్టమయ్యే అవకాశం.

► ఆపరేషన్‌ బుకారెస్ట్‌ నుంచి ఢిల్లీ చేరుకున్న ప్రత్యేక విమానం.

 కీవ్‌ ఆపరేషన్‌ పూర్తి కావడంతో.. ఖార్కీవ్‌ నుంచి భారతీయుల తరలింపునకు ప్రయత్నాలు ముమ్మరం.

► ఉక్రెయిన్‌కు ప్రపంచ బ్యాంక్‌ భారీ ఆర్థిక సాయం. సుమారు 3 బిలియన్‌ డాలర్ల సాయం ప్రకటన.

► ఉక్రెయిన్ పై రష్యా దాడులు దుర్మార్గమని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ అభిప్రాయపడ్డాడు. రష్యా నియంతాధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ను ఏకాకిని చేయాలని ప్రపంచ దేశాలకు ఆయన పిలుపునిచ్చారు.

అమెరికా గగనతలంలో రష్యా విమానాలను నిషేధిస్తున్నట్లు అమెరికా ప్రెసిడెంట్‌ జో బైడెన్‌ బుధవారం ఉదయం ప్రకటించారు. భారత కాలమానం ప్రకారం.. ఈ ఉదయం ప్రసంగించిన ఆయన.. ఉక్రెయిన్‌ను అమెరికా అన్ని విధాలుగా అండగా ఉంటుందని, ఉక్రెయిన్ లోని ప్రతి అంగుళాన్ని కాపాడతామని బైడెన్ హామీ ఇచ్చారు.

ఆపరేషన్‌ గంగలో భాగంగా ఉక్రెయిన్‌ నుంచి భారతీయుల తరలింపు వేగంగా కొనసాగుతోంది. 

కీవ్‌పై భీకర దాడులకు రష్యా ప్రణాళికలు!. ఏ తరహా దాడులనేది అంచనా వేయలేకపోతున్నా ఉక్రెయిన్‌ రక్షణ శాఖ. ఏ క్షణమైనా విరుచుకుపడే అవకాశం. జనాలను బయటకు రావొద్దని. బంకర్లలోనే ఉండాలని. వీలైతే సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని ఆదేశించిన ప్రభుత్వం.

కీవ్‌వైపు దూసుకొస్తున్న రష్యా యుద్ధ ట్యాంకర్లు

బెలారస్‌కు షాక్‌?

ఉక్రెయిన్‌ వార్‌లో రష్యాకు మద్ధతు ప్రకటించిన బెలారస్‌పైనా ఆంక్షలకు పాశ్చాత్య దేశాలు సిద్ధం అవుతున్నాయి.

► కీవ్‌పై పట్టుకోసం.. 

కీవ్‌ నగరంపై పట్టుకోసం రష్యా బలగాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో నగరంలోని ప్రధాన టీవీ టవర్‌ను వైమానిక దాడుల్లో పేల్చేశాయి. రష్యా బలగాల దాడుల్లో ఐదుగురు మృతి చెందినట్లు ఉక్రెయిన్‌ అధికారులు తెలిపారు. 


కీవ్‌లో భారతీయులు ఖాళీ!

కీవ్‌ నగరంలో ప్రస్తుతం భారతీయులు ఎవరూ లేరని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. కీవ్‌లో ఉన్న భారతీయులంతా సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారని, మరికొందరి తరలింపును అక్కడి భారత ఎంబసీ చేపట్టినట్లు భారత విదేశాగం శాఖ కార్యదర్శి హర్షవర్ధన్‌ శ్రింగ్లా ప్రకటించారు. అంతేకాదు ఉక్రెయిన్‌కు మానవతా కోణంలో భారత్‌ సాయం అందిస్తున్నట్లు ప్రకటించారాయన.

► రష్యాతో పోరాటమే తప్ప.. వెన్నుచూపే ప్రసక్తే లేదని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీ మరోసారి ఉద్ఘాటించాడు. మాతృభూమి, స్వేచ్ఛ కోసం పోరాడుతున్నట్లు చెప్తున్నాడు. 

► రష్యా 56 రాకెట్లు, 113 క్షిపణులు ప్రయోగించింది. 14 మంది చిన్నారులు సహా 352 మంది పౌరులు చనిపోయినట్లు ఉక్రెయిన్‌ ప్రకటించుకుంది.

► ఐరాస భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వాన్ని రష్యా కోల్పోయే అవకాశం. ప్రతిపాదన చేసిన బ్రిటన్‌.

ఒకవైపు యుద్ధం. మరోవైపు చర్చలు. తొలి దఫా చర్చలు విఫలం కావడంతో.. ఈరోజు(బుధవారం) మరోసారి రష్యా-ఉక్రెయిన్‌ ప్రతినిధుల మధ్య చర్చలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బెలారస్‌ వేదికగా! జరగబోయే ఈ చర్చలపై పశ్చిమ దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. 

ప్రత్యేక విధానం ద్వారా ఈయూలో చేర్చాలంటూ ఉక్రెయిన్‌ విజ్ఞప్తి చేస్తుండగా.. ఇప్పటికే ఈయూ ఉక్రెయిన్‌ దరఖాస్తుకు ఆమోదం తెలిపింది. మరోవైపు నాటో కూటమికి దూరంగా ఉండాలని రష్యా, ఉక్రెయిన్‌ను డిమాండ్‌ చేస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement