లివీవ్‌లో ఆయిల్ స్టోరేజీ వద్ద మంటలు ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది
లివీవ్: పోలండ్‌కు అతి సమీపంలో ఉండే ఉక్రెయిన్ నగరం లివీవ్‌పై రష్యా రెండు రోజులుగా బాంబులు, క్షిపణులతో విరుచుకుపడుతోంది. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పోలండ్ పర్యటనలో భాగంగా శనివారం ఇక్కడికి సమీపంలోని శరణార్థుల శిబిరాన్ని సందర్శిస్తున్న సమయంలోనే లివీవ్‌పై భారీగా క్షిపణి దాడులు జరిగాయి. తద్వారా అమెరికాకు రష్యా ఓ హెచ్చకరిక సంకేతం పంపిందని భావిస్తున్నారు.
లివీవ్‌లోని అక్కడి రక్షణ శాఖ ఇంధన ప్లాంటును క్రూయిజ్ మిసైళ్లతో ధ్వంసం చేసినట్టు రష్యా రక్షణ శాఖ అధికార ప్రతినిధి ఇగోర్ కొనషెంకోవ్ ఆదివారం ప్రకటించారు. కీవ్‌లోనూ మరో ఇంధన డిపోను యుద్ధ నౌక నుంచి ప్రయోగించిన మిసైల్ ద్వారా ధ్వంసం చేశామన్నారు. నగర శివార్లలోని పారిశ్రామిక ప్రాంతంపైనా రెండు రాకెట్లు పడ్డాయి. అక్కడ గంటల తరబడి దట్టమైన పొగ రేగుతూ కన్పించింది. కీవ్‌లో వెయ్యేళ్ల చరిత్ర ఉన్న యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడమైన సెయింట్ సోఫియా కేథడ్రల్ దాడుల్లో ఏ క్షణమైన నేలమట్టమయ్యేలా కన్పిస్తోంది. కీవ్‌కు ఉత్తరంగా ఉన్న స్లావ్యుచ్ నగరాన్ని రష్యా సైన్యం ఆక్రమించిందని కీవ్ ప్రాంత గవర్నర్ ప్రకటించారు.
కీవ్‌లో కర్ఫ్యూను సోమవారం దాకా పొడిగించారు. పొట్ట చేతపట్టుకుని వలస పోతున్న ఉక్రేనియన్లకు ఇంతకాలంగా లివీవ్ మజిలీగా ఉపయోగపడుతూ వస్తోంది. దేశంలోని పలు ప్రాంతాలకు నిత్యావసరాలు ఇక్కడి నుంచే సరఫరా అవుతూ వచ్చాయి. లివీవ్‌పైనా రష్యా దాడులను ఉధృతం చేయడం ఉక్రెయిన్‌లో మరింత సంక్షోభానికి కారణమయ్యేలా కన్పిస్తోంది. ఖర్కీవ్‌లోని అణు పరిశోధన సంస్థపైనా మరోసారి బాంబుల వర్షం కురిసింది. మరోవైపు రష్యాలో చేరడంపై రెఫరెండం నిర్వహిస్తామని లుహాన్స్‌క్ వేర్పాటువాద నేతలు చెప్తున్నారు. రష్యా–ఉక్రెయిన్ మరో దఫా చర్చలు సోమవారం జరగనున్నాయి.
జెట్లు, ట్యాంకులివ్వండి: జెలెన్‌స్కీ
యూరప్, పశ్చిమ దేశాలు కాస్త తెగువ చూపి తమకు సకాలంలో యుద్ధ విమానాలు, యుద్ధట్యాంకులు ఇస్తే రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్ పరిస్థితి మరోలా ఉండేదని అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ అన్నారు. ఈ విషయంలో అవి కనీసం ఒక్క శాతం ధైర్యం చూపినా బాగుండేదని వాపోయారు. యూరోపియన్ యూనియన్‌ను, నాటోను రష్యా నడుపుతోందా అంటూ మండిపడ్డారు. ‘‘మీరు పంపుతున్న షాట్ గన్లు, మెషీన్ గన్లతో రష్యా క్షిపణులను అడ్డుకోవడం అసాధ్యం. ఇప్పటికైనా యుద్ధ విమానాలు, ట్యాంకులు ఇవ్వండి. లేదంటే పోలండ్, స్లొవేకియా తదితర బాల్టిక్ దేశాలపైనా రష్యా దాడి చేయడం ఖాయం’’ అని జెలెన్‌స్కీ అన్నారు.
యుద్ధం ద్వారా రష్యన్లపై ఉక్రెయిన్ ప్రజల్లో పుతిన్ తీవ్ర విద్వేషం నింపుతున్నారని దుయ్యబట్టారు. డోన్బాస్ ప్రాంతంలోని ఉక్రెయిన్ సైన్యాన్ని చుట్టుముట్టేందుకు రష్యా ప్రయత్నిస్తోందని ఇంగ్లండ్ రక్షణ శాఖ వర్గాలంటున్నాయి. ఖర్కీవ్, మారియుపోల్ నగరాల నుంచి రష్యా పటాలాలు ఇందుకోసం ఇప్పటికే బయల్దేరినట్టు చెప్పింది. అదే సమయంలో ఉక్రెయిన్ నగరాలపై దాడిని కూడా రష్యా తీవ్రస్థాయిలో కొనసాగిస్తోందని వివరించింది. తమ దేశాన్ని ఆక్రమించడం అసాధ్యమని తేలిపోవడంతో కనీసం రెండు ముక్కలైనా చేయాలని రష్యా చూస్తోందని మిలిటరీ ఇంటలిజెన్స్ చీఫ్ బుడనోవ్ ఆరోపించారు. రష్యా సైన్యాలకు చుక్కలు చూపిస్తామన్నారు. ఆటవిక యుద్ధం ఇకనైనా ముగియాలని పోప్ ఫ్రాన్సిస్ మరోసారి ప్రార్థనలు చేశారు.
బైడెన్ ఉద్దేశం వేరు: అమెరికా
వ్లాదిమిర్ పుతిన్ అధికారంలో కొనసాగరాదన్న అమెరికా అధ్యక్షుడు బైడెన్ వ్యాఖ్యలకు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ వివరణ ఇచ్చారు. పుతిన్‌ను గద్దె దించేందుకు అమెరికా ప్రయత్నించడం లేదన్నారు. పొరుగు దేశాలపై యుద్ధానికి దిగకుండా పుతిన్‌ను కట్టడి చేయాలన్నదే బైడెన్ వ్యాఖ్యల ఉద్దేశమన్నారు. రష్యాలో గానీ, ఇంకే దేశంలో గానీ నాయకత్వ మార్పులకు అమెరికా ఎన్నటికీ పూనుకోదన్నారు. బైడెన్ వ్యాఖ్యలను సమర్థించబోనని ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ అన్నారు.
‘‘నేనలాంటి పదజాలం ఉపయోగించను. సంక్షోభానికి తెర దించేందుకు పుతిన్‌తో చర్చలు కొనసాగిస్తా’’ అని చెప్పారు. మరోవైపు, రష్యా తమపై సైబర్ దాడికి దిగొచ్చని ఫిన్లండ్ అధ్యక్షుడు సాలీ నినిస్టో అన్నారు. ఫిన్లండ్ నాటో సభ్యత్వం కోసం ప్రయత్నిస్తోంది. రష్యాతో 1,340 కిలోమీటర్ల మేర సరిహద్దును కూడా పంచుకుంటోంది. మరోవైపు పుతిన్ సన్నిహితుడైన రష్యా కుబేరుడు ఎవగెనీ ష్విల్డర్‌కు చెందిన రెండు జెట్ విమానాలను ఇంగ్లండ్ జప్తు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment