మారియుపోల్‌లో ధ్వంసమైన నివాస భవంతిని చూస్తున్న స్థానికురాలు
మాస్కో/కీవ్: ఉక్రెయిన్‌లోని కీలక రేవు నగరం మారియుపోల్‌పై రష్యా సైన్యం దాదాపుగా పట్టు బిగించింది. అక్కడ మిగిలిఉన్న కొద్దిపాటి ఉక్రెయిన్ సైనికులు మధ్యాహ్నంలోగా ఆయుధాలు వదిలేసి లొంగిపోవాలని రష్యా రక్షణ శాఖ అధికార ప్రతినిధి కల్నల్ జనరల్ మిఖాయిల్ మిజింట్‌సెవ్ ఆదివారం హెచ్చరించారు. లొంగిపోతే ప్రాణాలకు గ్యారంటీ ఇస్తామన్నారు. అంటే ఆయుధాలు వీడి లొంగిపోతే ప్రాణభిక్ష పెడతామని పరోక్షంగా సూచించారు. అజోవ్‌స్టల్ స్టీల్ ఫ్యాక్టరీలో తలదాచుకున్న ఉక్రెయిన్ సైనికులంతా లొంగిపోవాలన్నారు. ఉక్రెయిన్‌కు రష్యా ఇలాంటి ఆఫర్ ఇవ్వడం ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇంకా తమకు ఎదురు తిరగాలని చూస్తే చావు తప్పదని ఉక్రెయిన్ సైన్యానికి రష్యా రక్షణ శాఖ ప్రతినిధి మేజర్ జనరల్ ఇగోర్ కొనాషెంకోవ్ అల్టిమేటం జారీ చేశారు.
మిగిలింది స్టీల్ ఫ్యాక్టరీనే
మారియూపోల్‌ను పూర్తిగా స్వాధీనం చేసుకుంటే రష్యాకు అది అతిపెద్ద విజయం అవుతుందనడంలో సందేహం లేదు. దీనిపై రష్యా మొదటి నుంచే కన్నేసింది. ఈ నగరాన్ని జేజిక్కించుకుంటే క్రిమియాకు రష్యా నుంచి భూమార్గం ఏర్పడుతుంది. తద్వారా పారిశ్రామిక ప్రాంతమైన డోన్బాస్‌లో పాగా వేయడం సులభతరం అవుతుంది. ప్రస్తుతం ఉక్రెయిన్‌లో 11 చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగిన అజోవ్‌స్టల్ స్టీల్ ఫ్యాక్టరీ ఒక్కటే ఉక్రెయిన్ దళాల ఆధీనంలో ఉంది. ఈ ఫ్యాక్టరీలో 2,500 మంది ఉక్రెయిన్ జవాన్లు ఉన్నట్లు సమాచారం. రష్యా నియంత్రణలోకి వచ్చిన మారియుపోల్‌లో ఇప్పటివరకు 21,000 మంది మృతిచెందినట్లు అంచనా. ఈ నగరంలో గతంలో 4.50 లక్షల జనాభా ఉండగా, ప్రస్తుతం కేవలం లక్ష మంది ఉన్నారు. యుద్ధం ప్రారంభమయ్యాక చాలామంది వలసబాట పట్టారు.
ఖర్కీవ్‌లో ఐదుగురు బలి
ఉక్రెయిన్ సైన్యాన్ని చావుదెబ్బ కొట్టడమే లక్ష్యంగా రష్యా వైమానిక దాడులు ఉధృతం చేస్తోంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ సమీపంలోని బ్రొవరీ ఆయుధాగారాన్ని నేలమట్టం చేశామని రష్యా రక్షణ శాఖ ప్రతినిధి మేజర్ జనరల్ ఇగోర్ కొనాషెంకోవ్ ఆదివారం చెప్పారు. క్షిపణులతో దాడి చేశామని తెలిపారు. అలాగే సీవీరోడోంటెస్క్ సమీపంలో ఉక్రెయిన్‌కు చెందిన ఎయిర్ డిఫెన్స్ రాడార్లను ధ్వంసం చేశామన్నారు. అలాగే కొన్ని ఆయుధ డిపోలపైనా దాడులు చేసినట్లు పేర్కొన్నారు. డోన్బాస్ సమీపంలోని జొలోట్ పట్టణంపై రష్యా దాడుల్లో ఇద్దరు పౌరులు మరణించారు. రెండో అతిపెద్ద నగరం ఖర్కీవ్‌లో ఆదివారం రష్యా బాంబు దాడుల్లో ఐదుగురు పౌరులు మరణించారు, 13 మంది గాయపడ్డారు.
లొంగిపోయే ఉద్దేశం లేదు: ఉక్రెయిన్ ప్రధాని
రష్యా హెచ్చరికలను ఉక్రెయిన్ ప్రధానమంత్రి డెనిస్ షమీహల్ కొట్టిపారేశారు. ఈ యుద్ధంలో ఆఖరిఘట్టం దాకా పోరాడుతామని స్పస్టంచేశారు. విజయం సాధించేదాకా తమ పోరాటం ఆగదన్నారు. సాధ్యమైనంత వరకు దౌత్య మార్గాల ద్వారానే ఈ సంక్షోభానికి ముగింపు పలకాలని భావిస్తున్నట్లు చెప్పారు. అంతేతప్ప రష్యాకు లొంగిపోయే ఉద్దేశం ఎంతమాత్రం లేదన్నారు. మారియుపోల్ నగరం తమకు రక్షణ కవచంగా ఉపయోగపడుతోందని ఉక్రెయిన్ రక్షణశాఖ ఉపమంత్రి హన్నా మాల్యార్ చెప్పారు.
మతిలేని యుద్ధాన్ని ఆపండి: పోప్ ఫ్రాన్సిస్
ఉక్రెయిన్‌లో రష్యా సాగిస్తున్న బీభత్సకాండపై పోప్ ఫ్రాన్సిస్ ఆందోళన వ్యక్తంచేశారు. మతిలేని యుద్ధాన్ని వెంటనే ఆపాలని రష్యాకు సూచించారు. ఈస్టర్ సండే సందర్భంగా వాటికన్ సిటీలో పోప్ సందేశమిచ్చారు. శాంతికి చొరవచూపాలని రష్యాకు హితవు పలికారు. దయచేసి యుద్ధంలో ఎవరూ భాగస్వాములు కావొద్దని పిలుపునిచ్చారు. ఉక్రెయిన్‌లో త్వరగా శాంతి నెలకొనాలని పోప్ ఆకాంక్షించారు.
► నల్లసముద్రంలోని తమ రేవుల్లోకి రష్యా నౌకల ప్రవేశాన్ని బల్గేరియా నిషేధించింది.
► తమకు 50 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం అందించాలని ఉక్రెయిన్ అధ్యక్షుని ఆర్థిక సలహాదారు జీ7 దేశాలను కోరారు.
చర్చలకు విఘాతం: జెలెన్‌స్కీ
మారియుపోల్‌ను గుప్పిటపెట్టే ప్రయ త్నాలు చర్చలకు విఘాతం కలిగిస్తాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అన్నారు. అక్కడి పౌరులను సైన్యం పొట్టనపెట్టుకుంటోందని మండిపడ్డారు. అమరవీరుల స్మారకం నిర్మిస్తామన్నారు. రష్యా అణుదాడులకు ప్రపంచం సిద్ధంగా ఉండాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment