
శాంతిని, నాటో సభ్యత్వాన్ని కోరుకుంటున్నాం
కూటమి రక్షణ కింద ఉక్రెయిన్ భద్రంగా ఉండాలన్నదే మా ఉద్దేశం
జెలెన్‌స్కీ సంచలన ప్రకటన
కీవ్: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సంచలన ప్రకటన చేశారు. ఉక్రెయిన్‌ను ‘నాటో’ కూటమిలో చేర్చుకుంటే అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవడానికి తాను సిద్ధమేనని తేల్చిచెప్పారు. ఉక్రెయిన్‌లో శాంతిని, నాటో సభ్యత్వాన్ని కోరుకుంటున్నామని ఉద్ఘాటించారు. ఆదివారం రాజధాని కీవ్‌లో ప్రభుత్వ అధికారుల సమావేశంలో జెలెన్‌స్కీ మాట్లాడారు. ఉక్రెయిన్‌పై రష్యా సైన్యం దండయాత్ర ప్రారంభించి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ సమావేశం నిర్వహించారు.
భేటీ అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. నాటో సైనిక కూటమి రక్షణ కింద ఉక్రెయిన్ భద్రంగా ఉండాలన్నదే తన ఉద్దేశమని వివరించారు. నాటో ఛత్రఛాయలో ఉక్రెయిన్‌లో శాశ్వతంగా శాంతియుత పరిస్థితులు నెలకొంటాయని భావిస్తున్నట్లు తెలిపారు. శాంతి కోసం పదవి నుంచి దిగిపోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదన్నారు.
‘‘ఉక్రెయిన్‌లో శాంతిని సాధించడానికి నేను అధ్యక్ష పదవిని వదుకోవాల్సిన అవసరం తప్పనిసరిగా ఉందంటే, అందుకు సిద్ధంగా ఉన్నాను’’ అని స్పష్టంచేశారు. అధ్యక్షుడిగా పదేళ్లు అధికారంలో ఉండాలన్నది తన కల కాదని వ్యాఖ్యానించారు. ‘జెలెన్‌స్కీ ఒక నియంత’ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఆరోపణలపైనా స్పందించారు. ట్రంప్ వ్యాఖ్యలను అభినందనగా భావించడం లేదని తేలిగ్గా కొట్టిపారేశారు. సోమవారం యూరోపియన్ నేతలతో జరిగే సమావేశం ‘టర్నింగ్ పాయింట్’ అవుతుందని భావిస్తున్నట్లు తెలిపారు. తమకు ఇప్పుడు సహకారం అవసరమని అన్నారు.
తమ స్వాతంత్య్రాన్ని, గౌరవాన్ని కోల్పోయే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉక్రెయిన్–రష్యా యుద్ధాన్ని సాధ్యమైనంత త్వరగా ముగించాలన్న లక్ష్యంతో ఉన్నారు. ఉక్రెయిన్‌లో ఎన్నికలు నిర్వహించాలని ట్రంప్‌తోపాటు రష్యా అధినేత పుతిన్ అంటున్నారు. ప్రస్తుతం యుద్ధం జరుగుతుండడంతో ఉక్రెయిన్‌లో మార్షల్ లా విధించారు. ఎన్నికలపై నిషేధం అమల్లో ఉంది. ఈ నేపథ్యంలో పదవి నుంచి తప్పుకోవడానికి అభ్యంతరం లేదని జెలెన్‌స్కీ స్వయంగా ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యంగా అమెరికా నుంచి వస్తున్న ఒత్తిళ్లతో ఆయన ఈ ప్రకటన చేసినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment