బ్రిటన్: మహిళలు విడాకులు అనంతరం ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా భరణాన్ని చెల్లించాలని చట్టం చెబుతుంది. భరణం అంటే బతకడానికి సరిపడేంత సొమ్మును ఇచ్చిన కేసుని చూసి ఉంటాం. కాని యూకే లోని ఓ మహిళకు భరణం కింద ఏకంగా 453 మిలియన్ పౌండ్లు (సుమారు రూ.750 కోట్లు) వచ్చాయి. అయితే, ఇందులో ఓ ట్విస్ట్ కూడా ఉండటం మరో విశేషం. భరణం అంటే మాములుగా తన నుంచి విడిపోయిన భార్యకు భర్త చెల్లిస్తాడు. కానీ ఈ కేసులో ఆ మహిళ కొడుకు ఈ భరణాన్ని చెల్లించాలని లండన్ కోర్టు తీర్పునిచ్చింది.
వివరాల్లోకి వెళితే.. రష్యాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఫర్ఖద్ అఖ్మదోవ్, తాతియానా అఖ్మదోవ్ దంపతులు. వారికి ఇద్దరు కుమారులు సంతానం. దంపతుల మధ్య మనస్పర్థలు రావడంతో కొన్నేళ్ల క్రితమే విడాకులు తీసుకొని దూరంగా బతుకుతున్నారు. అప్పుడు వీరు లండన్‌లో నివసించేవారు. తల్లి వద్ద చిన్న కుమారుడు, తండ్రి వద్ద పెద్ద కుమారుడు ఉన్నారు. ఇక 2016లో వీరు విడాకులు తీసుకున్న సమయంలో తాతియానాకు 453 మిలియన్ పౌండ్లు (రూ.750 కోట్లు) భరణంగా ఇవ్వాలని లండన్ కోర్టు ఫర్ఖద్‌ను ఆదేశించింది. కానీ అతను 5 మిలియన్ పౌండ్లు మాత్రమే చెల్లించి రష్యాకు వెళ్లిపోయాడు. తాతియానాకు భరణం కింద రావాల్సిన మిగతా సొమ్మును ఇవ్వకుండా ఆమె పెద్ద కుమారుడు తెమూర్ అడ్డుపడుతూ వచ్చాడు.
డబ్బుల ఇచ్చే ఆలోచన లేదు కాబట్టే ఇలా చేస్తున్నట్లు ఆమెకు అర్థమైంది. దీంతో తనకు రావాల్సిన మిగిలిన భరణం కోసం తాతియానా మరోసారి లండన్ కోర్టు మెట్లెక్కింది. తన తండ్రికి తెమూర్ తరపున వత్తాసు పలుకుతూ తనకు రావాల్సిన సొమ్ము రాకుండా చేస్తున్నాడని పెద్ద కుమారుడిపై దావా వేసింది. ఇందుకు సమాధానంగా ఆమె కొడుకు .. తాను చాలా నష్టాల్లో ఉన్నానని, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో చదివేటప్పుడు ట్రేడింగ్‌లో డబ్బు పెట్టి నష్టపోయానని డబ్బులు ఇవ్వడంలో ఆలస్యం అవుతోందని కోర్టులో తెలిపాడు. కానీ తెమూర్ వ్యాఖ్యలతో లండన్ కోర్టు విభేదించింది. తాతియానాకు తక్షణమే రూ.750 కోట్లు భరణంగా చెల్లించాలని తీర్పునిచ్చింది.
( చదవండి: షాకింగ్: తెలిసిన వాడని ఫోటో పంపితే.. దాన్ని మార్ఫ్ చేసి )
Comments
Please login to add a commentAdd a comment