మాస్కో: యుద్ధ మేఘాలు క్రమంగా చెదిరిపోతున్నాయి. రష్యా–ఉక్రెయిన్ ఉద్రిక్తతలు కాస్త నెమ్మదిస్తున్న సూచనలు కన్పిస్తున్నాయి. తాము యుద్ధం కోరుకోవడం లేదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పష్టం చేశారు. ఈ వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు చర్చలకు సిద్ధమని ప్రకటించారు. క్షిపణులు, సైన్యాల మోహరింపును పరస్పరం తగ్గించుకోవడంతో పాటు విశ్వాస కల్పన చర్యలపై అమెరికా, నాటోతో మాట్లాడతామని స్పష్టం చేశారు. మంగళవారం జర్మనీ చాన్స్‌లర్ ఒలాఫ్ స్కొల్జ్‌తో భేటీ అనంతరం ఈ మేరకు ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
‘‘ఉక్రెయిన్‌ను, మాజీ సోవియట్ దేశాలను నాటోలో చేర్చుకోవద్దన్న మా ప్రధాన డిమాండ్‌కు అమెరికా, నాటో అంగీకరించలేదు. ఉక్రెయిన్ నాటోలో చేరడం రష్యా భద్రతకు పెద్ద ముప్పు. దీనిపై, యూరప్‌లో, మా సరిహద్దుల సమీపంలో మోహరించిన నాటో సైన్యాన్ని, మధ్య శ్రేణి క్షిపణులను తగ్గించడం, సైనిక మోహరింపుల్లో, కవాతుల్లో పారదర్శకత పాటించడంతో సహా అన్ని అంశాలపైనా చర్చించేందుకు మేం సిద్ధం’’ అని చెప్పారు. అయితే తమ ప్రధాన డిమాండ్లను నెరవేర్చాల్సిన అవసరం ఉందన్నారు. ఉక్రెయిన్ సరిహద్దుల నుంచి సైన్యాన్ని వెనక్కు మళ్లిస్తున్నట్టు కూడా రష్యా అంతకుముందు సంకేతాలిచ్చింది.
సరిహద్దుల్లో భారీ విన్యాసాల్లో పాల్గొంటున్న తమ సైన్యంలో కొన్ని యూనిట్లు త్వరలో బేస్‌లకు మళ్లుతాయని ఆ దేశ రక్షణ శాఖ పేర్కొంది. యుద్ధ ట్యాంకులు, సాయుధ వాహనాలను ట్రైన్లపైకి ఎక్కిస్తున్న ఫొటోలను విడుదల చేసింది. అయితే ఎంత సైన్యం ఎక్కడి నుంచి వెనక్కు మళ్లుతోంది వంటి వివరాలపై మాత్రం పెదవి విప్పలేదు. ఇదంతా రొటీన్ ప్రణాళికలో భాగమే తప్ప తమవైపు నుంచి కవ్వింపు చర్యలేమీ లేవని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్ అన్నారు. కొందరు సమాచార ఉగ్రవాదానికి పాల్పడుతున్నారని అమెరికా, యూరప్ దేశాలకు చురకలు వేశారు. ‘‘వాళ్ల గోబెల్స్ ప్రచారం విఫలమైన రోజుగా 2022 ఫిబ్రవరి 15 చరిత్రలో నిలిచిపోతుంది. ఒక్క తూటా కూడా పేలకుండానే వాళ్లు ఓడిపోయి, నవ్వులపాలయ్యారు’’ అని రష్యా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఎద్దేవా చేశారు.
భిన్నాభిప్రాయాలు
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి దిగబోదనేందుకు పుతిన్ తాజా వ్యాఖ్యలు, తాజా చర్యలు సంకేతమని కొందరు భావిస్తుండగా అమెరికా, యూరప్ దేశాలు మాత్రం ఆచితూచి స్పందిస్తున్నాయి. ఏ క్షణమైనా ఉక్రెయిన్‌పై రష్యా దాడికి దిగవచ్చనే అనుమానిస్తున్నాయి. అదే జరిగితే తీవ్ర ఆంక్షలు తప్పవని అమెరికాతో పాటు ఇంగ్లండ్, నార్వే కూడా మంగళవారం మరోసారి రష్యాను కఠినంగా హెచ్చరించాయి. ‘‘ఉక్రెయిన్ సరిహద్దుల వెంబడి రష్యా యుద్ధ సన్నాహాలు భారీగా కొనసాగుతూనే ఉన్నాయి. పదాతి దళాలు కొద్ది రోజులుగా ప్రధాన కమాండ్ నుంచి చిన్న చిన్న యూనిట్లుగా విడిపోయి ముందుకు కదులుతూ వ్యూహాత్మక స్థానాలకు చేరుకుంటున్నాయి’’ అని యూఎస్ రక్షణ శాఖ వర్గాలు చెబుతున్నాయి.
ఇలాంటి ప్రకటనలతో తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడం రష్యాకు అలవాటేనని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ద్మిత్రో కులేబా అన్నారు. 1.5 లక్షల పై చిలుకు రష్యా సైన్యం ఉక్రెయిన్ సరిహద్దుల వద్ద మూడు వైపుల నుంచీ మోహరించిన విషయం తెలిసిందే. మరోవైపు ఉక్రెయిన్ ప్రభుత్వ సంస్థలు, బ్యాంకుల వెబ్‌సైట్లపై మంగళవారం సైబర్ దాడులు జరిగాయి. వీటి దెబ్బకు రక్షణ, విదేశాంగ, సాంస్కృతిక శాఖలతో పాటు రెండు అతి పెద్ద ప్రభుత్వ బ్యాంకులకు చెందిన కనీసం 10 సైట్లు ఆగిపోయాయని అధికార వర్గాలు తెలిపాయి. ఇది రష్యా పనేనని ఉక్రెయిన్ సమాచార శాఖ ఆరోపించింది.
చర్చలే చర్చలు
రష్యా నుంచి సానుకూల సంకేతాల నేపథ్యంలో సంక్షోభ నివారణకు ప్రయత్నాలు మంగళవారం మరింత వేగం పుంజుకున్నాయి. సోమవారం ఉక్రెయిన్ ప్రెసిడెంట్‌తో చర్చించిన స్కొల్జ్ మంగళవారం పుతిన్‌తో భేటీ అయ్యారు. సంక్షోభ నివారణకు మరిన్ని చర్చలు జరపాలని పుతిన్‌కు ఆయన విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్ సోమవారం సూచించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో రష్యాను గట్టిగా వ్యతిరేకించే పోలండ్ విదేశాంగ మంత్రి మాస్కోలో లవ్రోవ్‌తో సమావేశమయ్యారు. ఇటలీ విదేశాంగ మంత్రి కూడా ఉక్రెయిన్ విదేశాంగ మంత్రితో భేటీ అయ్యారు. రష్యా యుద్ధానికి దిగకపోతే నాటో సభ్యత్వ డిమాండ్‌ను ఉక్రెయిన్ వదులుకునే అవకాశం లేకపోలేదని ఇంగ్లండ్‌లో ఆ దేశ రాయబారి వాదిం ప్రిస్టైకో అన్నారు.
ఉక్రెయిన్‌లో అలజడి
యుద్ధ వార్తల నేపథ్యంలో ఉక్రెయిన్‌లో అలజడి నెలకొంది. రాజధాని కీవ్‌లో ప్రజలు నిత్యావసరాలను నిల్వ చేసుకుంటున్నారు. సమీపంలో బాంబ్ షెల్టర్లు ఎక్కడున్నాయో సూచిస్తూ అపార్ట్‌మెంట్ల బయట బోర్డులు వెలుస్తున్నాయి. ఇలాంటి యుద్ధాలు మనకిదేమీ తొలిసారి కాదని పౌరులనుద్దేశించి అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ అన్నారు. జాతీయ జెండా చేబూని జాతీయగీతం పాడుతూ బుధవారాన్ని జాతీయ సమైక్యత దినంగా పాటించాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో భారత పౌరులు తాత్కాలికంగా దేశం వీడాలని కీవ్‌లోని భారత రాయబార కార్యాలయం సూచించింది. ఉక్రెయిన్లో ఉన్న భారతీయుల సంఖ్యపై కచ్చితమైన వివరాల్లేవు. 2020 లెక్కల ప్రకారం 18,000 మంది దాకా భారత స్టూడెంట్లు అక్కడ చదువుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment