బెల్‌గ్రేడ్: సెర్బియాకు చెందిన పాంటా పెట్రోవిక్(70) మనుషుల ప్రవర్తనతో విసిగిపోయాడు. ముఖ్యంగా జనాల్లో పెరిగిపోతున్న అవినీతిని చూసి తట్టుకోలేకపోయాడు. చుట్టూ జరుగుతున్న దారుణాలను చూసి ఎంతో బాధపడ్డాడు. వారిలో మార్పు తేవడానికి ప్రయత్నించాడు. కుదరలేదు.. తానే మారిపోయాడు. మనుషులకు దూరంగా అడవిలోకి వెళ్లి.. ఓ గుహలో జీవించసాగాడు. గత 20 ఏళ్ల నుంచి పాంటా ఇలా గుహలోనే జీవిస్తున్నాడు.
ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం పాంటా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాడు. ‘‘జనావాసాలకు దూరంగా ఉంటున్నావ్ కదా.. నీకేందుకు భయం’’ అంటే.. ‘‘అసలే అది కరోనా వైరస్.. ఎవరిని వదిలిపెట్టదు.. ఇక్కడకు రాగలదు.. నా గుహలోకి కూడా ప్రవేశిస్తుంది. అందుకే ముందు జాగ్రత్తగా టీకా తీసుకున్నాను. అదనపు డోస్‌తో కలిపి మూడు టీకాలు తప్పకుండా తీసుకుంటాను. మీరు కూడా వ్యాక్సిన్ వేయించుకోండి’’ అని కోరాడు పాంటా. గతేడాదే తనకు వైరస్ గురించి తెలిసిందన్నాడు.
ఇక ఇలా మనుషులకు దూరంగా.. గుహలో జీవించడం గురించి పాంటా మాట్లాడుతూ.. ‘‘నగరంలో ప్రశాంతంగా.. స్వేచ్ఛగా బతకలేకపోయాను. ఎవరో ఒకరితో అనుక్షణం గొడవపడాల్సి వస్తుంది. కానీ ఇక్కడ అలాంటి గొడవలు ఏం ఉండవు. ప్రశాంతంగా జీవించగలుగుతున్నాను’’ అని తెలిపాడు. ఈ గుహలోకి రావడానికి ముందు దినసరి కూలీగా పని చేసేవాడు. గుహ జీవితం ప్రాంరభించడానికి ముందు తన ఆస్తులను చుట్టుపక్కలవారికి దానం చేశాడు పాంటా.
ఇక ఆహారం కోసం పాంటా అడవిలో అన్వేషిస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు సమీపంలోని చెరువులో చేపలు పట్టడం చేస్తుంటాడు. ఎక్కువగా పుట్టగొడుగులను తింటుంటాడు. ఇక గుహలో పడుకోవడానికి రెండు బెంచీలు, ఓ టాయిలెట్ ఏర్పాటు చేసుకున్నాడు. ‘‘దొరికింది తింటూ.. అడవిలో సంచరిస్తూ.. స్వేచ్ఛగా జీవిస్తున్నాను.. ఇది నాకు ఎంతో తృప్తినిస్తుంది’’ అంటున్నాడు పాంటా.
Comments
Please login to add a commentAdd a comment