నేషనల్ అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ సహకారం, ముందస్తు ఎన్నికల ప్రకటనతో అవిశ్వాసం నుంచి తప్పించుకున్న పాక్ ప్రధాని(డీ-నొటిఫై పీఎం) ఇమ్రాన్ ఖాన్‌కు ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించలేమని పాకిస్థాన్ ఎన్నికల కమీషన్ తేల్చేసింది.
మూడు నెలల్లోగా ముందస్తు ఎన్నికలంటూ ఇమ్రాన్ ఖాన్ ప్రకటించుకున్న విషయం తెలిసిందే. అయితే.. ఇంత తక్కువ టైంలో ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని పాక్ ఎన్నికల సంఘం వెల్లడించింది. ఎన్నికల కోసం కనీసం ఆరు నెలల గడువైనా అవసరమని ఈసీ అభిప్రాయపడింది. ఈ మేరకు సార్వత్రిక ఎన్నికలకు సన్నాహకానికి ఆరు నెలల సమయం పడుతుందని ఈసీపీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
నియోజకవర్గాల తాజా డీలిమిటేషన్, ముఖ్యంగా ఖైబర్ పఖ్తున్‌ఖ్వాలో 26వ సవరణ ప్రకారం సీట్ల సంఖ్యను పెంచడం, జిల్లా, నియోజకవర్గాల వారీగా ఓటర్ల జాబితాను అనుగుణంగా తీసుకురావడం ప్రధాన సవాళ్లని ఆయన పేర్కొన్నట్లు డాన్ ఒక కథనం ప్రచురించింది. పాక్ మాజీ ప్రధాన న్యాయమూర్తి గుల్జార్ అహ్మద్ పేరును ఆపద్ధర్మ ప్రధాని పదవికి ఇమ్రాన్‌ఖాన్ నామినేట్ చేసిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం పాక్ రాజకీయ బంతి.. కోర్టులో ఉంది.
ప్రపంచం నవ్వుతోంది
ఇదిలా ఉండగా.. తాజా పరిణామాలపై ప్రతిపక్షాలు, ఇమ్రాన్ ఖాన్‌ను హేళన చేస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచం మొత్తం పాక్‌ను చూసి నవ్వుతోందని ప్రతిపక్ష పీఎంఎల్-ఎన్ నేత అహ్షన్ ఇక్బాల్ పేర్కొన్నారు. చివరి బంతి దాకా పోరాడతానన్న వ్యక్తి వికెట్లు పీకేసుకుని పారిపోయాడు అంటూ ఇమ్రాన్ ఖాన్‌ను ఉద్దేశించి ఎద్దేవా చేశాడు. ఇక నుంచి ఇమ్రాన్ ఖాన్ అవినీతి కథలు ఒక్కొక్కటిగా బయటికి వస్తాయని అంటున్నాడు . ఈ విషయంలో న్యాయస్థానాలు గనుక జోక్యం చేసుకోకపోతే.. రాజ్యాంగానికే అర్థం ఉండదని, భవిష్యత్తు మొత్తం నియంతలదే రాజ్యమవుతుందని ప్రతిపక్షాలు అభిప్రాయపడుతున్నాయి.
అమెరికా పగ బట్టింది
పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. మాస్కోలో పర్యటించినందుకే అమెరికా పగబట్టిందని రష్యా సంచలన ఆరోపణలకు దిగింది. పాక్ తాజా రాజకీయ పరిణామాలపై స్పందించిన రష్యా.. ఈమేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఉక్రెయిన్ సంక్షోభ సమయంలో.. రష్యా పర్యటనను ఆయన (ఇమ్రాన్ ఖాన్) వాయిదా వేసుకోలేదు. అందుకే అమెరికా అతన్ని శిక్షించాలని నిర్ణయించుకుంది అంటూ రష్యా విదేశాంగ శాఖ పేరిట ఒక ప్రకటన విడుదల అయ్యింది.
ఇదిలా ఉండగా.. అవిశ్వాస తీర్మానానికి కొద్ది గంటల ముందు పాక్ ప్రధాని హోదాలో ఇమ్రాన్ ఖాన్ అమెరికాపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. పాక్ ప్రతిపక్షాలతో కలిసి.. ఆ విదేశీ శక్తులు కుట్ర పన్ని తనను గద్దె దించే ప్రయత్నం చేస్తున్నాయంటూ ఆరోపించాడు కూడా. ఫిబ్రవరిలో ఉక్రెయిన్ యుద్ధ పరిస్థితుల నడుమే ఖాన్, మాస్కోలో పర్యటించాడు. ఆ సమయంలో ‘వాట్ ఏ టైమింగ్..’ అంటూ పాక్ పీఎం తన ఎగ్జయిట్‌మెంట్ కనబరిచిన వీడియో ఒకటి బయటకు వచ్చింది కూడా.
Comments
Please login to add a commentAdd a comment