
కొలంబో: శ్రీలంకలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ఆందోళనకారులు చేసిన నిరసనల నడమ లంక మాజీ అధ్యక్షుడు గోటబయ రాజపక్స దేశం విడిచి పారిపోయిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆయన మాల్దీవులు అక్కడ నుంచి సింగపూర్‌కు పరారయ్యారు. ఐతే గోటబయకు సింగపూర్ ఆశ్రయం ఇచ్చిందంటూ వార్తలు గుప్పుమనడంతో వాటన్నింటిని సింగపూర్ అధికారులు ఖండించారు. లంక మాజీ అధ్యక్షుడు ఆశ్రయం కోరనూలేదూ, తాము ఆశ్రయం ఇవ్వనూలేదని తెగేసి చెప్పింది.
అది గోటబయ వ్యక్తి గత పర్యటన అని నొక్కి చెప్పింది. ఈ క్రమంలో సింగపూర్ ఇమిగ్రేషన్ అధికారులు మీడియా సమావేశంలో తాజాగా గోటబయకు స్వల్పకాలిక సందర్శన పాస్ మంజూరు చేసినట్లు పేర్కొంది. సింగపూర్‌పర్యటన నిమిత్తం వచ్చే పర్యాటకులకు ఇక్కడ బస చేసేందుకు సాధారణంగా 30 రోజుల వ్యవధితో కూడిని ఎస్టీవీపీ జారీ చేయబడుతుందని తెలిపారు. ఒకవేళ పొడిగించుకోవాలనుకుంటే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే వెసులబాటు కూడా ఉంది. గతవారం ఆశ్రయం ఇవ్వలేదన్న సింగపూర్ ఇప్పుడు మాటమార్చి పర్యటన పాస్ మంజూరు చేశామని చెప్పడం గమనార్హం.