న్యూయార్క్: ప్రముఖ ఆర్టిస్ట్ మౌరిజియో క్యాటల్లాన్ రూపొందించిన కొత్త బంగారు టాయిలెట్ త్వరలో వేలానికి రానుంది. ఆయన గతంలో రూపొందించిన బంగారు టాయిలెట్‌ను దుండగులు అపహరించుకుపోయారు. అలాంటిదే మరో బంగారు టాయిలెట్‌ను క్యాటల్లాన్ రూపొందించటంతో దానిని ఈ నెల 18న ప్రముఖ వేలం సంస్థ సౌత్‌బే వేలం వేయనుంది.
క్యాటల్లాన్ మొదట రూపొందించిన బంగారు టాయిలెట్ దాదాపు 100 కిలోల 18 క్యారెట్ల బంగారంతో తయారైంది. దాని పేరు అమెరికా. అది గొప్ప ఆర్ట్‌లలో ఒకటిగా గుర్తింపు పొందింది. దానిని మొదట 2016లో న్యూయార్క్‌లోని గుగ్గెన్‌హీమ్ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచినప్పుడు దాదాపు లక్ష మంది సందర్శించారు.
దానిని కొనుగోలు చేసేందుకు నాటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఆసక్తి చూపించారు. అయితే, దానిని బ్రిటన్‌లోని బ్లెన్‌హీమ్ ప్యాలెస్‌లో ప్రదర్శనకు ఉంచగా, 2019లో దొంగలు నాలుగు నిమిషాల్లోనే దోచుకెళ్లారు. ఎంత గాలించినా అది మళ్లీ కనిపించలేదు.
దానిని దొంగలు కరిగించి బంగారాన్ని అమ్మేసి ఉంటారని భావిస్తున్నారు. అలాంటిదే మరో టాయిలెట్‌ను క్యాటల్లాన్ తయారు చేయటంతో ఈ నెలలో వేలం వేస్తున్నారు. దీనికి భారీ ధర పలుకొచ్చని భావిస్తున్నారు. క్యాటల్లాన్ బనానా ఆర్టిస్ట్‌గా కూడా ప్రసిద్ధి చెందారు. ఓ గోడపై టేపుతో అరటి పండును అతికించి ప్రదర్శనకు ఉంచటం ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యింది.


