జెరూసలేం: పెగసస్ స్పైవేర్ వివాదస్పదం కావడంతో ఆ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించిన ఇజ్రాయెల్‌కు చెందిన కంపెనీ ఎన్‌ఎస్‌ఒ గ్రూపు దానిని పూర్తిగా సమర్థించింది. ఇలాంటి నిఘా సాఫ్ట్‌వేర్‌లు ఇంటెలిజెన్స్, పోలీసుల చేతుల్లో ఉండడం వల్ల ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది హాయిగా నిద్రపోతున్నారని, రాత్రి వేళల్లో నిర్భయంగా రోడ్లపై తిరుగుతున్నారని పేర్కొంది. ఒక్కసారి ప్రభుత్వ సంస్థలకి ఆ టెక్నాలజీని విక్రయించిన తర్వాత దానిని తాము ఆపరేట్ చేయబోమని, అంతేకాదు తమ క్లయింట్లు సేకరించిన డేటాతో తమకు యాక్సెస్ కూడా ఉండదని ఆ సంస్థ స్పష్టం చేసింది. భారత్ సహా ప్రపంచంలోని వివిధ దేశాల ప్రభుత్వాలు పెగసస్ ద్వారా రాజకీయ నేతలు, మానవ హక్కుల కార్యకర్తలు, జర్నలిస్టులు, న్యాయమూర్తుల ఫోన్లను ట్యాప్ చేసి నిఘా పెట్టారని మీడియాలో కథనాలు వచ్చి ఈ మొత్తం వ్యవహారం వివాదాస్పదం కావడంతో ఎన్‌ఎస్‌ఒ గ్రూపు స్పందించింది.
‘‘ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది హాయిగా రాత్రిళ్లు నిద్రపోతున్నారంటే, పూర్తి స్థాయి రక్షణ కవచం మధ్య రాత్రిళ్లు రోడ్లపై తిరుగుతున్నారంటే పెగసస్ వంటి సాంకేతిక పరిజ్ఞానానికి ధన్యవాదాలు తెలుపుకోవాలి. నేరాలు–ఘోరాలు, ఉగ్రవాద కార్యకలాపాలు వంటివి నిరోధించడంలో భద్రతా వ్యవస్థకి ఇలాంటి సాఫ్ట్‌వేర్‌లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి’’ అని ఆ కంపెనీ అధికారి ప్రతినిధి పేర్కొన్నారు. ప్రపంచం మరింత సురక్షితంగా, ఉగ్రవాదం బెడద లేకుండా భద్రంగా ఉండడానికే తాము పెగసస్ వంటి స్పైవేర్‌లు రూపొందిస్తున్నామని చెప్పారు. ఎందరో ఉగ్రవాదుల కుట్రల్ని భగ్నం చేయడానికి ఉపయోగపడిన ఈ సాఫ్ట్‌వేర్‌ని దుర్వినియోగం చేయడం సరైన పని కాదని ఆ సంస్థ పేర్కొంది.
పౌర సమాజంపై నిఘా ఆందోళనకరం: అమెరికా
పౌరసమాజంపైనా, ప్రభుత్వాన్ని విమర్శించే వారిపైన పెగసస్ వంటి నిఘా సాఫ్ట్‌వేర్‌లు ప్రయోగించడం అత్యంత ఆందోళన కలిగించే అంశమని అమెరికా అభిప్రాయపడింది. మానవ హక్కుల కార్యకర్తలు, జర్నలిస్టులు, విపక్ష నేతలు, సమాజంలోని ఇతరుల వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించింది. భారత్‌లో మొత్తం 300 ఫోన్ నంబర్లని ట్యాప్ చేయడానికి పెగసస్‌ని వాడారని, వీరిలో జర్నలిస్టులు, విపక్ష నాయకులు, సిట్టింగ్ న్యాయమూర్తులు, పారిశ్రామికవేత్తలు, సామాజిక కార్యకర్తలు ఉన్నట్టుగా అంతర్జాతీయ మీడియా ప్రసారం చేసిన కథనాలపై అమెరికా సౌత్ అండ్ సెంట్రల్ ఆసియన్ అఫైర్స్ తాత్కాలిక సహాయమంత్రి డీన్ థాంప్సన్ స్పందించారు. ఇదంతా భారత ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీయడమేనని వ్యాఖ్యానించారు.
ప్రపంచమే హాయిగా నిద్రపోతోంది
Published Sun, Jul 25 2021 3:29 AM | Last Updated on Sun, Jul 25 2021 10:55 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment