కొలంబో: అప్పుల ఊబిలో చిక్కుకుని తీవ్ర ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న శ్రీలంకలో పరిస్థితి రోజురోజుకు దయనీయంగా మారుతోంది. ప్రభుత్వ ఖజానా ఎప్పుడో ఖాళీ కావడంతో కనీసం ఎన్నికలు నిర్వహించేందుకు కూడా నిధులు లేని పరిస్థితి ఏర్పడింది. దీంతో మార్చి 9న నిర్వహించాల్సిన స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మార్చి 3న కొత్త తేదీలను వెల్లడించే అవకాశం ఉంది.
శ్రీలంక విదేశీ మారక నిల్వలు 500 మిలియన్ డాలర్లకు పడిపోయాయి. ఆర్థికి పరిస్థితి అద్వాన్నంగా మారడంతో ఈ దేశానికి అప్పులు ఇవ్వకుండా ఐఎంఎఫ్, పారిస్ క్లబ్ ఆంక్షలు విధించాయి. దీంతో మిత్ర దేశం చైనా కూడా సాయం చేసేందుకు ముందుకు వచ్చే సూచనలు కన్పించడం లేదు. దీంతో తమపై ఐఎంఎఫ్ ఆంక్షలు ఎత్తివేసేలా చూసి అమెరికా, జపాన్ తమను ఆదుకుంటాయేమోనని లంక గంపెడు ఆశలు పెట్టుకుంది.
ఐఎంఎఫ్ ప్రతిపాదించిన విధంగా 10 సంవత్సరాల రుణ మారటోరియంతో ఆర్థిక సహాయం కోసం చైనా వైపు శ్రీలంక చూస్తున్నప్పటికీ అలా జరిగే సూచనలు కన్పించడం లేదు. అసలు సమస్య ఏంటంటే ఒకవేళ శ్రీలంకకు చైనా సాయం చేయాల్సి వస్తే ఇతర దేశాలకు కూడా ఆర్థిక సాయాన్ని అందించవలసి ఉంటుంది. ఆఫ్రికాలో బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్ (బీఆర్‌ఐ)తో పాటు, తమ చిరకాల మిత్ర దేశం పాకిస్తాన్‌కు కూడా చైనా ఆర్థిక సాయం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ కారణంగానే పాకిస్తాన్‌కు 700 మిలియన్ డాలర్ల రుణాన్ని రీఫైనాన్స్ చేసింది తప్ప కొత్తగా రుణాలు ఇవ్వలేదు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ ప్రకారం ఆ దేశ విదేశీ మారకపు నిల్వలు 3.2 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇది మూడు వారాల దిగుమతికి మాత్రమే సరిపోతుంది. ఇప్పుడు పాకిస్తాన్, శ్రీలంకలో పరిస్థితులు దాదాపు ఒకే విధంగా ఉన్నాయి. ఓ వైపు ఆర్థిక సంక్షోభం, మరోవైపు రాజకీయ అనిశ్చితితో రెండు దేశాలు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ప్రజలు తినడానికి తిండి కూడా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
చదవండి: 'పుతిన్‌కు నెక్ట్స్ బర్త్‌డే లేదు.. ఏడాది కూడా బతకడు..!'
Comments
Please login to add a commentAdd a comment