ఆర్థిక సంక్షోభంతో పరిస్థితులు చేజారిపోయిన వేళ.. శ్రీలంకలో నిరసనలు మిన్నంటాయి. ఆహార.. మందలు కొరత, నిత్యావసరాల ధరలు పైపైకి చేరుకుంటున్నాయి. మరోవైపు ప్రభుత్వం అవినీతి విధానాల వల్లే ఇదంతా అంటూ ఆరోపిస్తూ.. దిగిపోవాలంటూ ప్రజా నిరసన పెల్లుబిక్కుతోంది. ఈ తరుణంలో ప్రధాని మహీంద రాజపక్స ఒక వీడియో విడుదల చేశాడు. ఆర్థిక సంక్షోభంతో పాటు తాజా పరిస్థితులపైనా దేశ పౌరులకు వివరణ ఇచ్చుకున్నాడు.
శ్రీ లంక ప్రధాని మహీంద రాజపక్స.. సోమవారం జాతిని ఉద్దేశించి ఒక వీడియో విడుదల చేశాడు. రాజీనామా డిమాండ్ బలంగా వినిపిస్తున్న వేళ.. ప్రభుత్వ వ్యతిరేక నిరసనలను చల్లార్చే దిశగా ఆయన ప్రసంగం సాగింది. లంక తీవ్ర సంక్షోభానికి కారణాలేంటో చెప్పిన మహీంద రాజపక్స.. ప్రదర్శలను తక్షణమే విరమించాలని నిరసనకారుల్ని విజ్ఞప్తి చేశాడు.
‘‘కొవిడ్‌తో లంక ఆర్థిక స్థితి కుప్పకూలింది. క్షీణించిన విదేశీ నిల్వలు కారణంగానే.. ఆర్థిక సంక్షోభంలోకి దేశం కూరుకుపోయింది. మహమ్మారిని ఎదుర్కొన్న వెంటనే మన దేశం ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడం మొదలైంది. దేశ ఆర్థిక వ్యవస్థ క్షీణిస్తున్నదని తెలిసినప్పటికీ.. లాక్‌డౌన్ విధించాల్సి వచ్చింది. అందుకే మన విదేశీ నిల్వలు క్షీణించాయి. అంతేగానీ.. ప్రభుత్వ విధానాలు, మా పాలన అందుకు కారణాలు కావు. మా పాలనలో అసలు అవినీతికి చోటే లేదు కూడా. గత ప్రభుత్వాలు కూడా దేశాన్ని అప్పుల్లోకి నెట్టాయి. కరోనా పరిస్థితులు ఆ అప్పుల్ని మరింత ఊబిలోకి లంకను నెట్టేశాయని చెప్పుకొచ్చారు మహీందా. ప్రజల కష్టాలు చూసి చాలా బాధపడుతున్నా. శ్రీ లంక ప్రజల్ని క్షమాపణ కోరుతున్నా అంటూ వీడియో సందేశంలో పేర్కొన్నాడు మహీంద.
‘‘ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించేందుకు ప్రభుత్వం 24 గంటలూ మా ప్రభుత్వం పని చేస్తోంది. మీరు(నిరనసకారుల్ని ఉద్దేశిస్తూ..) వీధుల్లో గడిపే ప్రతి నిమిషమూ దేశానికి డాలర్ ప్రవాహాన్ని దూరం చేస్తుంది. ఈ సమయంలో రాజకీయాలు వద్దన్నా.. ఎవరూ వినడం లేదు. దేశం పతనం కాకుండా రక్షించుకునేందుకు ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రావాలన్నా ఎవరూ స్పందించలేదు. మీరైనా సహనంతో మాకు సహకరించండి. అతికొద్దిరోజుల్లోనే సమస్యను పరిష్కరిస్తాం’’ అని పేర్కొన్నాడు.
స్నేహపూర్వక దేశాల నుండి సహాయం తీసుకునేటప్పుడు తాను దేశ సార్వభౌమత్వాన్ని త్యాగం చేయనని పేర్కొన్న రాజపక్సే.. ద్వీపం దేశం చాలా నిర్ణయాత్మక దశలో ఉందని అన్నారు. పనిలో పనిగా.. రైతులకు ఎరువుల సబ్సిడీని పునరుద్ధరిస్తానని శ్రీలంక ప్రధాని కీలక ప్రకటన చేశారు.
Comments
Please login to add a commentAdd a comment