కొలంబో: కనీవినీ ఎరగని ఆర్థిక సంక్షోభం, దేశవ్యాప్త నిరసనలతో సతమతమవుతున్న శ్రీలంకలో సోమవారం పాత ప్రధాని మహింద రాజపక్స సారథ్యంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. మొత్తం 17 మందితో అధ్యక్షుడు గొటబయ రాజపక్స కొత్త కేబినెట్‌ను ఏర్పాటు చేశారు. సోదరుడు మహింద (72) మినహా కేబినెట్లో తమ కుటుంబీకులెవరూ లేకుండా జాగ్రత్త పడ్డారు. గత మంత్రివర్గంలో సభ్యులైన మరో సోదరుడు చమల్, మహింద కుమారుడు నమల్, అల్లుడు శశీంద్ర తదితరులను పక్కన పెట్టారు.
ఈ సందర్భంగా అధ్యక్షుడు, ప్రధాని విడివిడిగా జాతినుద్దేశించి మాట్లాడారు. సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకుని వ్యవస్థలో సమూల మార్పు తీసుకొస్తామని గొటబయ ధీమా వెలిబుచ్చారు. స్వచ్ఛమైన, సమర్థమైన పాలన అందించేందుకు సహకరించాల్సిందిగా మహింద కోరారు. మరోవైపు అధ్యక్షుడు రాజీనామా చేయాలంటూ దేశవ్యాప్తంగా నిరసనల హోరు కొనసాగుతూనే ఉంది. సోమవారం నుంచి వారంపాటు నేషనల్ స్టాక్ ఎక్సే్చంజీ కార్యకలాపాలను కూడా సస్పెండ్ చేశారు. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు సోమవారం నుంచి మరింత పెరిగాయి. సంక్షోభం నేపథ్యంలో మార్చి నుంచి శ్రీలంక రూపాయి విలువ 60 శాతానికి పైగా పడిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment