
కోపెన్‌హాగెన్(డెన్‌మార్క్): స్వీడన్ ప్రధాని పీఠంపై మహిళా నేత మాగ్డలీనా ఆండర్సన్ వారం రోజుల వ్యవధిలోనే మళ్లీ ఆసీనులయ్యారు. కూటమి ప్రభుత్వంలోని పార్టీ మద్దతు ఉపసంహరిం చడంతో గత వారం పదవికి రాజీనామా చేసిన ఆమె సోమవారం మళ్లీ ప్రధానిగా ఎన్నికయ్యారు. 349 సీట్లు ఉన్న స్వీడన్ పార్లమెంట్‌లో ప్రధాని పదవికి జరిగిన ఓటింగ్‌లో ఈమెకు మద్దతుగా 101 ఓట్లు పడ్డాయి. 75 మంది గైర్హాజరయ్యారు. స్వీడన్ రాజ్యాంగం ప్రకారం ప్రధానిగా ఎన్నుకోబడే వ్యక్తిని ఓటింగ్‌లో 175కు మించి సభ్యులు వ్యతిరేకించకూడదు. అంటే వ్యతిరేకంగా 175 ఓట్లు పడితే ఆ ప్రభుత్వం కొలువుతీరదు.
అదృష్టవశాత్తు ఆండర్సన్‌కు వ్యతిరేకంగా 173 ఓట్లే పడ్డాయి. దీంతో మైనారిటీలో ఉన్నా సరే సోషల్ డెమొక్రటిక్ పార్టీ సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటైంది. గత వారం గ్రీన్ పార్టీతో సోషల్ డెమొక్రటిక్ పార్టీ సంకీర్ణ ప్రభుత్వాన్నిఏర్పాటుచేసింది. దేశ తొలి మహిళా ప్రధానిగా ఆండర్సన్ బాధ్యతలు చేపట్టి చరిత్ర సృష్టించారు. అంతకుముందే ఆర్థికమంత్రిగా ఉన్న ఆమె అదే హోదాలో బడ్జెట్‌ను వెంటనే ప్రవేశపెట్టారు. ఆ బడ్జెట్ ప్రతిపాదనలు విపక్ష స్వీడన్ డెమొక్రాట్స్ పార్టీ విధానాలకు అనుకూలంగా ఉన్నాయంటూ కూటమి ప్రభుత్వం నుంచి గ్రీన్ పార్టీ వైదొలగింది. దీంతో ఆరోజు కేవలం ప్రధాని అయిన ఏడు గంటలకే ఆండర్సన్ రాజీనామా చేయాల్సి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment