Taiwan 2024 Presidential Elections: తైవాన్‌లో త్రిముఖం! | Taiwan Presidential Election: Triangle war in Taiwan presidential elections 2024 | Sakshi
Sakshi News home page

Taiwan 2024 Presidential Elections: తైవాన్‌లో త్రిముఖం!

Published Fri, Jan 12 2024 5:18 AM | Last Updated on Fri, Jan 12 2024 11:03 AM

Taiwan Presidential Election: Triangle war in Taiwan presidential elections 2024 - Sakshi

అగ్రరాజ్యం అమెరికా, డ్రాగన్‌ దేశం చైనా మధ్య ఆధిపత్య పోరాటానికి కేంద్ర బిందువుగా మారిన తైవాన్‌లో అధ్యక్ష ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 13వ తేదీన ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటర్లు సిద్ధమయ్యారు. ద్వీప దేశమైన తైవాన్‌లో జరుగుతున్న ఈ ఎన్నికలు ప్రపంచమంతటా ఆసక్తి కలిగిస్తున్నాయి. తైవాన్‌కు ప్రధాన ప్రత్యరి్థగా మారిన చైనాతో తదుపరి సంబంధాలు ఎలా ఉండబోతున్నాయన్నది ఈ ఎన్నికలు నిర్దేశించబోతున్నాయి.

తైవాన్‌లో ఉద్యోగులు, కారి్మకుల వేతనాలు తగ్గిపోవడం, ఇళ్ల ధరలు భారీగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఈసారి అధ్యక్ష ఎన్నికల్లో త్రిముఖ పోరు కనిపిస్తోంది. చైనా దూకుడును కట్టడి చేయగల సత్తా ఉన్న నాయకుడికే ఈ ఎన్నికల్లో ప్రజలు పట్టం కట్టే అవకాశం ఉందని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. అధికార డెమొక్రటిక్‌ ప్రోగ్రెసివ్‌ పార్టి(డీపీపీ) ప్రస్తుత ఉపాధ్యక్షుడు విలియం లాయ్‌ చింగ్‌–టి, మాజీ ప్రతిపక్ష కౌమిన్‌టాంగ్‌(కేఎంటీ) పార్టీ నుంచి మాజీ పోలీసు చీఫ్, న్యూ తైపీ నగర మాజీ మేయర్‌ హొ యు–హీ, తైవాన్‌ పీపుల్స్‌ పార్టీ(టీపీపీ) నుంచి కొ వెన్‌–జి ఈ ఎన్నికల బరిలో నిలిచారు. వారి బలాబలాలు, విజయావకాశాలు ఎలా ఉన్నాయో చూద్దాం..                        

 చైనా పెత్తనాన్ని ప్రశి్నస్తున్న విలియం లాయ్‌ చింగ్‌–టి  
64 ఏళ్ల విలియం లాయ్‌ చింగ్‌–టి మృదు స్వభావిగా పేరుగాంచారు. తైవాన్‌కు స్వయం పాలన హోదాను నిలబెట్టడానికి చాలా ఏళ్లుగా పోరాటం సాగిస్తున్నారు. చైనా పెత్తనాన్ని గట్టిగా వ్యతిరేకిస్తూ ప్రజల్లో మంచి గుర్తింపు సంపాదించారు. తైవాన్‌ స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న యోధుడిగా తనను తాను అభివరి్ణంచుకుంటున్నారు. విలియం లాయ్‌ చింగ్‌–టి అమెరికాలోని హార్వర్డ్‌ యూనివర్సిటీలో వైద్య విద్య అభ్యసించారు. స్వదేశంలో కొన్నాళ్లు డాక్టర్‌గా పనిచేశారు.

1990వ దశకంలో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తొలుత తైనాన్‌ సిటీ నుంచి చట్టసభకు ఎన్నికయ్యారు. 2010లో తైనాన్‌ మేయర్‌గా విజయం సాధించారు. ప్రస్తుతం ఉపాధ్యక్షుడిగా సేవలందిస్తున్నారు. డెమొక్రటిక్‌ ప్రోగ్రెసివ్‌ పార్టీ నుంచి అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి దిగారు. చైనాతో సత్సంబంధాలను తాను కోరుకుంటున్నానని ఎన్నికల ప్రచారంలో చెబుతున్నారు. శత్రువులుగా కాదు, మిత్రులుగా ఉందామని చైనాకు సూచిస్తున్నారు.

తైవాన్‌ తరహాలో చైనాలోనూ ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ వంటివి వరి్థల్లాలని తాను ఆశిస్తున్నట్లు వెల్లడించారు. అయితే, చైనా మాత్రం విలియం లాయ్‌ చింగ్‌–టి పట్ల విముఖత వ్యక్తం చేస్తోంది. ఆయన ఒక పేచీకోరు అని నిందలు వేస్తోంది. తరచుగా లేని పోని సమస్యలు సృష్టిస్తుంటాడని విమర్శిస్తోంది. డెమొక్రటిక్‌ ప్రోగ్రెసివ్‌ పార్టీ నుంచి ఉపాధ్యక్ష పదవికి హెసియావో బి–కిమ్‌ పోటీపడుతున్నారు. ఆమె జపాన్‌లో జన్మించారు. అమెఅమెరికాలో పెరిగారు. కరడుగట్టిన స్వాతంత్య్ర ఉద్యమకారిణిగా ఆమెకు పేరుంది.  

చైనాకు అనుకూలం! హొ యు–హీ  
కౌమిన్‌టాంగ్‌(కేఎంటీ) పార్టీ నేత, 66 ఏళ్ల హొ యు–హీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. చిన్నప్పుడు తన కుటుంబ వృత్తి అయిన పందుల పెంపకం చేపట్టారు. పంది మాంసం విక్రయించారు. విద్యాభ్యాసం అనంతరం పోలీసు అధికారిగా పనిచేశారు. పందులను పట్టుకోవడానికి చిన్నప్పుడు నేర్చుకున్న నైపుణ్యం పోలీసు అధికారిగా ఉన్నప్పుడు చాలాసార్లు పనికొచి్చందని ఆయన ఒక సందర్భంలో చెప్పారు.

చాలా హై–ప్రొఫైల్‌ కేసులను సమర్థవంతంగా ఛేదించారు. హంతకులను అరెస్టు చేశారు. పదవీ విరమణ తర్వాత 2010లో రాజకీయాల్లో చేరారు. 2018లో ‘న్యూ తైపీ’ నగర మేయర్‌గా ఎన్నికయ్యారు. 2022లో మరోసారి మేయర్‌గా విజయం సాధించారు. పోలీసు అధికారిగా, మేయర్‌గా ఆయన పనితీరు ప్రజల నుంచి ప్రశంసలు అందుకుంది. అందుకే అధ్యక్ష ఎన్నికల్లో తమ అభ్యరి్థగా హొ యు–హీని కౌమిన్‌టాంగ్‌ పార్టీ ఎంపిక చేసింది. ఎనిమిదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న ఆ పార్టీ ఈసారి గెలుపు కోసం శ్రమిస్తోంది.

ఎన్నికల ప్రచారంలో హొ యు–హీ చైనా గురించి పెద్దగా ప్రస్తావించడం లేదు. చైనా అనుకూలవాది అంటూ ఆయనపై కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. ‘స్వతంత్ర తైవాన్‌’కు హొ యు–హీ వ్యతిరేకి అని ఆరోపిస్తున్నారు. తైవాన్, చైనా మధ్య సంబంధాలు రిపబ్లిక్‌ ఆఫ్‌ చైనా రాజ్యాంగంపై ఆధారపడి ఉంటాయని,         ఇందులో గందరగోళం ఏమీ లేదని ఆయన తేలి్చచెబుతున్నారు. కౌమిన్‌టాంగ్‌ పార్టీ నుంచి ఉపాధ్యక్ష పదవికి జా షా–కాంగ్‌ పోటీ పడుతున్నారు. చైనా, తైవాన్‌ పునరేకీకరణ జరగాలని జా షా–కాంగ్‌ వాదిస్తుంటారు.  

యువత ఆదరణ చూరగొంటున్న కొ వెన్‌–జి
తైవాన్‌ పీపుల్స్‌ పార్టి(టీపీపీ) నుంచి 64 సంవత్సరాల కొ వెన్‌–జి రేసులో నిలిచారు. ఆయన వైద్యుడిగా పనిచేస్తూ పదేళ్ల క్రితం రాజకీయాల్లోకి వచ్చారు. 2014లో జరిగిన ‘సన్‌ఫ్లవర్‌ ఉద్యమం’లో పాల్గొన్నారు. అప్పట్లో చైనాకు వ్యతిరేకంగా విద్యార్థులు పెద్ద ఎత్తున ఉద్యమించారు. ఆ తర్వాత కొ వెన్‌–జి 2015లో తైపీ మేయర్‌గా ఎన్నికయ్యారు. ఎనిమిదేళ్లపాటు అదే పదవిలో సేవలందించారు.

మేయర్‌గా చైనాతో సంబంధాలు పెంచుకోవడానికి ప్రాధాన్యం ఇచ్చారు. 2019లో తైవాన్‌ పీపుల్స్‌ పార్టీని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం చైనాతో సంబంధాల విషయంలో ఎలాంటి వైఖరిని వ్యక్తం చేయకుండా గుంభనంగా వ్యవహరిస్తున్నారు. చైనాకు అనుకూలమో, వ్యతిరేకమో చెప్పకుండా దాట వేస్తున్నారు. ప్రధానంగా యువతలో ఆయన పట్ల ఆదరణ కనిపిస్తోంది.

డీపీపీ, కేఎంటీ పార్టీలకు తామే ప్రత్యామ్నాయం అని కొ వెన్‌–జి పేర్కొంటున్నారు. 2020 ఎన్నికల్లో 113 స్థానాలకు గాను టీపీపీ కేవలం ఐదు సీట్లు గెలుచుకుంది. తైవాన్‌ పార్లమెంట్‌లో మూడో అతిపెద్ద పార్టిగా మారింది. ఇక టీపీపీ నుంచి ఉపాధ్యక్ష రేసులో సిట్టింగ్‌ ఎంపీ, సంపన్న వ్యాపారవేత్త సింథియా వు నిలిచారు. తైవాన్‌లో ప్రఖ్యాతిగాంచిన వ్యాపార సంస్థ ‘షిన్‌ కాంగ్‌ గ్రూప్‌’ ఆమె కుటుంబానికి చెందినదే.

  – సాక్షి, నేషనల్‌ డెస్క్‌   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement