
వాషింగ్టన్: సాంకేతిక లోపం కారణంగా విమానంలో ఒక్కసారిగా తక్కువ ఎత్తుకు దిగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. పీడన సమస్యను అధిగమించేందుకు విమానాన్ని మూడు నిమిషాల్లోనే 15 వేల అడుగుల మేర దించాల్సి వచ్చినట్లు పిడ్మాంట్ ఎయిర్‌లైన్స్ సంస్థ ఫాక్స్ న్యూస్‌కు తెలిపింది. నార్త్ కరొలినాలోని చార్లొట్టె నుంచి ఫ్లోరిడాలోని గైన్స్‌విల్లెకు వెళ్తున్న పిడ్మాంట్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో ఈ నెల 10వ తేదీన ఈ ఘటన చోటుచేసుకుంది.
చివరికి గమ్యస్థానానికి చేరుకుని సురక్షితంగా ల్యాండయింది. ‘టేకాఫ్ తీసుకున్న 43 నిమిషాల తర్వాత 29 వేల అడుగుల ఎత్తులో ఉండగా విమానంలో సమస్య మొదలైంది. క్యాబిన్‌లో పీడనం అకస్మాత్తుగా తగ్గిపోవడంతో ప్రయాణికులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారు. ఆరు నిమిషాల వ్యవధిలోనే మొత్తం 18,600 అడుగులు కిందికి దిగింది’అని ఫ్లైట్‌అవేర్ డేటా విడుదల చేసింది.
ఘటనపై హారిసన్ హోవ్ అనే ప్రయాణికుడు సోషల్ మీడియా ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. ‘కాలుతున్న వాసన, పెద్ద శబ్దం, చెవుల్లో హోరు’తో గగుర్పాటు కలిగించిందని పేర్కొన్నారు. కేబిన్‌లో కాలుతున్న వాసన, పెద్ద శబ్దాలు రావడంతో ప్రయాణికులు హాహాకారాలు చేశారు. ఊపిరాడక కొందరు ప్రయాణికులు ఆక్సిజన్ మాసు్కలతో గాలి పీల్చుకుంటున్న ఫొటోను హారిసన్ షేర్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment