ఓక్లహామా సిటీలో మంచుమయమైన రహదారి
డల్లాస్: అమెరికా దక్షిణాది రాష్ట్రాలు, ముఖ్యంగా టెక్సాస్ మంచు పంజా బారినపడి గజగజలాడుతోంది. తీవ్రంగా వీస్తున్న మంచు తుఫాను గాలుల ధాటికి టెక్సాస్‌లో పవర్ ఎమర్జెన్సీ విధించాల్సి వచ్చింది. ఇప్పటికే రాష్ట్రం నుంచి పలు విమానాలను రద్దు చేశారు. డల్లాస్, హూస్టన్ నగరాలల్లో ఉష్ణోగ్రతలు మైనస్‌ల్లోకి పడిపోయాయి. హిమపాతం సమయంలో ఇతర ప్రమాదాలు నివారించేందుకు టెక్సాస్ విద్యుత్ శాఖ(ఎర్కాట్) పలు ప్రాంతాల్లో కరెంటు కోతలను ఆరంభించింది.
ప్రజలు సురక్షితంగా ఉండడమే ప్రధానమని, ఈ సమయంలో విద్యుత్ వాడకం తగ్గించేందుకే కోతలు విధిస్తున్నామని తెలిపింది. విద్యుత్ సరఫరా వ్యవస్థ పూర్తిగా స్తంభించకుండా ఉండేందుకే ఈ కోతలని తెలిపింది. కోతల కారణంగా దాదాపు 23 లక్షల మంది ప్రభావితమయ్యారని వెబ్‌సైట్లు పేర్కొన్నాయి. రాష్ట్రంలోని పలు నగరాల్లో కరెంటు కోతలు, ట్రాఫిక్ కష్టాలపై అధికారులు ప్రజలను సమాయత్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని 254 కౌంటీలకు గవర్నర్ గ్రెగ్ అబాట్ డిజాస్టర్ డిక్లరేషన్ జారీ చేశారు. ఎక్కడికక్కడ నేషనల్ గార్డ్ యూనిట్లను సమాయత్తం చేశారు. టెక్సాస్‌లో ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు అధ్యక్షుడు జోబైడెన్ ఆదివారం రాత్రి ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment