ఇజ్రాయెల్ ఆక్రమిత ఉత్తర వెస్ట్‌బ్యాంక్‌లోని జెనిన్ శరణార్థుల శిబిరం 20 సంవత్సరాల తర్వాత మళ్లీ ప్రపంచవ్యాప్తంగా ప్రముఖంగా వార్తల్లోకి వచి్చంది. జెనిన్ క్యాంప్‌లో ఉగ్రవాదులను ఎరివేయడానికి ఇజ్రాయెల్ సైన్యం చేపట్టిన ఆపరేషన్ ఎట్టకేలకు ముగిసింది. లక్ష్యం నెరవేరిందని ఇజ్రాయెల్ చెబుతోంది. జెనిన్ రెఫ్యూజీ క్యాంప్‌నకు దాదాపు ఏడు దశాబ్దాల కన్నీటి చరిత్ర ఉంది.
ఇజ్రాయెల్ సైన్యం, పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్‌ల మధ్య ఘర్షణలకు ఈ ప్రాంతం వేదికగా మారుతుండడంతో శరణార్థులకు కష్టాలు ఎదురవుతున్నాయి. చెల్లాచెదురై ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. ఇజ్రాయెల్ మిలటరీ ఆపరేషన్ వల్ల గత 3 రోజుల్లో వేలాది మంది జెనిన్ క్యాంప్ విడిచి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో అసలు ఈ క్యాంప్ ఎందుకు ఏర్పాటయ్యిందో, ఇక్కడి పరిస్థితులేమిటో తెలుసుకుందాం..
శరణార్థుల గడ్డ.. మిలిటెంట్ల అడ్డా
అమెరికాతోపాటు పశి్చమ దేశాల అండతో 1948లో యూదుల కోసం ఇజ్రాయెల్ ఆవిర్భవించింది. విస్తీర్ణంలో చిన్నదైనా తన చుట్టుపక్కల దేశాల భూభాగాలను బలప్రయోగంతో ఆక్రమించుకోవడం మొదలుపెట్టింది. ప్రాచీన కాలంలో ఆ ప్రాంతాలన్నీ యూదు రాజ్యంలో అంతర్భాగమేనని వాదించింది. అలా పొరుగు దేశమైన పాలస్తీనాపై కన్నేసింది. ఇజ్రాయెల్ సైన్యం దాడులను తట్టుకోలేక పాలస్తీనా పౌరులు సొంత ఊళ్లు వదిలేసి శరణార్థులుగా మారి వలసబాట పట్టారు.
అంతర్జాతీయ సమాజం ఒత్తిడి మేరకు ఇజ్రాయెల్ ప్రభుత్వం 1950వ దశకంలో పాలస్తీనా శరణార్థుల కోసం వెస్ట్‌బ్యాంక్‌లో పలు శిబిరాలను ఏర్పాటు చేసింది. అందులో ఒకటి జెనిన్ రెఫ్యూజీ క్యాంప్. నిజానికి ఇదొక మురికివాడ అని చెప్పొచ్చు. పేదరికానికి, ఆకలి చావులకు మారుపేరు. పాలస్తీనా మిలిటెంట్లు తమ కార్యకలాపాల కోసం జెనిన్‌ను అడ్డాగా మార్చుకున్నారు. తరచుగా ఇజ్రాయెల్‌పై దాడులకు పాల్పడుతున్నారు. మిలిటెంట్ల చర్య స్వాతంత్య్రం కోసం జరుగుతున్న సాయుధ తిరుగుబాటు అని పాలస్తీనా సానుభూతిపరులు చెబుతుండగా, అది ముమ్మాటికీ ఉగ్రవాదమేనని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. పాలస్తీనియన్ మిలిటెంట్ కమాండ్ సెంటర్లు జెనిన్‌లో ఉన్నాయని అంటోంది.
వేలాది మందికి ఆవాసం
జెనిన్ క్యాంప్ పాలస్తీనా శరణార్థులతో కిక్కిరిసిపోయి కనిపిస్తుంది. ఇక్కడ ప్రస్తుతం 18,000 మంది నివసిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు చెబుతున్నాయి. అసలైన లెక్క ఎంతన్నది తెలియదు. ఐక్యరాజ్యసమితి పాలస్తీనియన్ రెఫ్యూజీ ఏజెన్సీ అందించిన సమాచారం ప్రకారం 14,000 మంది ఉంటున్నారు. 2020 నాటి పాలస్తీనా ప్రభుత్వ అధికారిక గణాంకాల ప్రకారం 12,000 మంది శరణార్థులు నివసిస్తున్నారు.
యుద్ధానికి దారితీసిన ఆత్మాహుతి దాడి
జెనిన్ క్యాంప్‌లో 2002లో జరిగిన ఘర్షణలో 50 మందికిపైగా పాలస్తీనా జాతీయులు, 23 మంది ఇజ్రాయెల్ సైనికులు బలయ్యారు. యూదు సెలవు దినం సందర్భంగా మతపరమైన వేడుక కోసం గుమికూడిన యూదు జాతీయులపై మిలిటెంట్లు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 30 మంది యూదు జాతీయులు మరణించారు. దాంతో మిలిటెంట్ల భరతం పట్టడానికి ఇజ్రాయెల్ సైన్యం వెస్ట్‌బ్యాంక్‌పై విరుచుకుపడింది.
పాలస్తీనాలోకి సైతం సైన్యం అడుగుపెట్టింది. రమల్లా నగరంలో అప్పటి పాలస్తీనా అధినేత యాసర్ ఆరాఫత్ ఇంటిని చుట్టుముట్టింది. ఇజ్రాయెల్ సైనికులు, పాలస్తీనా మిలిటెంట్ల నడుమ కొన్ని రోజులపాటు హోరాహోరీగా యుద్ధంకొనసాగింది. ఇరువైపులా ప్రాణనష్టంతో యుద్ధం ముగిసింది. జెనిన్ క్యాంప్ అప్పటి నుంచి నివురుగప్పిన నిప్పులా మారింది. 20 ఏళ్ల తర్వాత మళ్లీ భారీ సైనిక ఆపరేషన్ జరిగింది. దీనివెనుక పలు కారణాలు కనిపిస్తున్నారు.
మిలిటెంట్ల దుశ్చర్యపై ఆగ్రహావేశాలు
రెండు వారాల క్రితం జెనిన్ క్యాంప్‌లో మిలిటెంట్లు రెచి్చపోయారు. జెనిన్ నుంచి ఇజ్రాయెల్ భూభాగంపైకి రాకెట్ ప్రయోగించారు. దీంతో భారీ పేలుడు చోటుచేసుకుంది. ఏడుగురు ఇజ్రాయెల్ జవాన్లు గాయపడ్డారు. వారిని హెలికాప్టర్లలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మిలిటెంట్ల దుశ్చర్యంపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ప్రభుత్వ చేతగానితనంలోనే ఉగ్రవాదులు రెచి్చపోతున్నారంటూ ఇజ్రాయెల్‌లో ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించాయి.
ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూపై ఒత్తిడి పెరిగింది. దానికితోడు వెస్ట్‌బ్యాంక్‌లోని ఇజ్రాయెల్ సెటిలర్స్‌లో ఎక్కువమంది నెతన్యాహూ మద్దతుదారులే ఉన్నారు. మిలిటెంట్లను కఠినంగా అణచివేయాలంటూ వారు సైతం ఒత్తిడి తెచ్చారు. దాంతో జెనిన్ క్యాంప్‌లో సైనిక ఆపరేషన్‌కు నెతన్యాహూ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశారు. ఈ నెల 3వ తేదీన ఇజ్రాయెల్ సైన్యం రంగంలోకి దిగింది. జెనిన్‌లో శరణార్థుల ఇళ్లలో సోదాలు నిర్వహించింది. ముష్కరుల స్థావరాలుగా భావిస్తున్న ప్రాంతాలపై డ్రోన్లతో దాడులు చేసింది.
ప్రజల దృష్టిని మళ్లించేందుకేనా?
ఇటీవలి కాలంలో బెంజమిన్ నెతన్యాహూ రాజకీయంగా కొంత బలహీనపడ్డారు. ఆయన తీసుకొచ్చిన వివాదాస్పద న్యాయ వ్యవస్థ సంస్కరణ బిల్లుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వెస్ట్‌బ్యాంక్‌లో జెనిన్‌తోపాటు ఇతర ప్రాంతాల్లో సాయుధ ముఠాలు బలం పుంజుకుంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల దృష్టిని మళ్లించాల్సిన అవసరం ఆయనకు ఏర్పడిందని రాజకీయ నిపుణులు అంటున్నారు. అందుకే జెనిన్ క్యాంప్‌లో సైనిక ఆపరేషన్‌కు ఆదేశాలు ఇచ్చారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
-సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment