![trafficking survivor honored with human rights hero award - Sakshi](/styles/webp/s3/article_images/2023/07/19/rights.gif.webp?itok=rm4d2bQv)
ఇండియన్-అమెరికన్ లేబర్ ట్రాఫికింగ్ సర్వైవర్, యాక్టివిస్ట్ హెరాల్డ్ డిసౌజాను హ్యూమన్ రైట్స్ హీరో అవార్డు- 2023తో సత్కరించారు. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో 17వ వార్షిక అంతర్జాతీయ మానవ హక్కుల యూత్ సమ్మిట్ సందర్భంగా హెరాల్డ్ డిసౌజా ఈ అవార్డు అందుకున్నారు. ఈ ఏడాది సమ్మిట్ మానవ హక్కుల సార్వత్రిక ప్రకటనకు సంబంధించి 75వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. డిసౌజాతో సహా అంతర్జాతీయ వక్తలు, అంతర్జాతీయ ప్రతినిధులు దీనిలో పాల్గొని పలు అంశాలపై చర్చించారు. వర్క్‌షాప్‌లు, ప్రదర్శనలు కూడా నిర్వహించారు. ఈ సంవత్సరం సమానత్వం, గౌరవం, ఐక్యత థీమ్‌తో కార్యక్రమం జరిగింది.
‘ప్రతి బిడ్డకు మానవ హక్కులు తెలియజేయాలి’
డిసౌజా తన ప్రసంగంలో ఈ భూమి మీద పుట్టిన ప్రతి బిడ్డకు మానవ హక్కులకు సంబంధించిన 30 ఆర్టికల్స్ నేర్పించాలని అన్నారు. అవి 1948లో ఐక్యరాజ్యసమితి రూపొందించిన యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అనే పత్రంలో ఉన్నాయి. ఈ కార్యక్రమంలో తన ముందు ప్రేక్షకుల్లో కూర్చున్న ప్రతీ ప్రతినిధి నిజమైన హీరోనే అని డిసౌజా అభివర్ణించారు. మనుషుల అక్రమ రవాణా, తరలింపు నుంచి ప్రాణాలతో బయటపడిన వారిని గుర్తించి, గౌరవించి, అవార్డు ఇచ్చినందుకు యూత్ ఫర్ హ్యూమన్ రైట్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ మేరీ షటిల్‌వర్త్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
మానవ అక్రమ రవాణాదారుని చేతిలో..
డిసౌజా హ్యూమన్ ట్రాఫికర్‌గా యుఎస్‌కి వచ్చారు. 18 నెలలకు పైగా ఆయన మానవ అక్రమ రవాణాదారుని చేతిలో దోపిడీకి గురయ్యారు. తన స్వేచ్ఛను కోల్పోయారు. నేడు ఆయన ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. హెరాల్డ్ డిసౌజా న్యాయవాది, పబ్లిక్ స్పీకర్. అతని చేదు అనుభవం అతనికి జీవితంలో కొత్త లక్ష్యాన్ని, అర్థాన్ని అందించింది. డిసౌజా ఐస్ ఓపెన్ ఇంటర్నేషనల్‌కు సహ-వ్యవస్థాపకుడు. ఈ సంస్థ హ్యూమన్ ట్రాఫికింగ్ నుంచి ప్రాణాలతో బయటపడిన వారి సమాచార పరిశోధనకు సహకరిస్తుంది. బాధితులకు విముక్తి కల్పించేందుకు ప్రయత్నిస్తుంటుంది.
కార్మికుల అక్రమ రవాణాను అంతం చేయడానికి..
అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా 2015లో యునైటెడ్ స్టేట్స్ అడ్వైజరీ కౌన్సిల్ ఆన్ హ్యూమన్ ట్రాఫికింగ్‌లో సభ్యునిగా డిసౌజాను నియమించారు. ట్రాఫికింగ్‌ను పర్యవేక్షించడానికి డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ ఆఫీస్‌కు నిపుణుల సలహాదారుగా కూడా డిసౌజా వ్యవహరించారు. కార్యక్రమంలో పాల్గొన్న అట్లాంటాకు చెందిన స్వచ్ఛంద సంస్థ శారీస్ టు సూట్స్ వ్యవస్థాపకుడు పట్టి త్రిపాఠి మాట్లాడుతూ డిసౌజా తన కుటుంబంతో కలిసి కార్మికుల అక్రమ రవాణాను అంతం చేయడానికి, దీనిపై మరింత అవగాహన పెంచడానికి చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.
భయం నుంచి స్వేచ్ఛకు..
ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి 46 దేశాలకు చెందిన అగ్రశ్రేణి ప్రతినిధులు హాజరయ్యారు. భారతదేశంలోని మంగళూరుకు చెందిన డిసౌజా ప్రస్తుతం ఒహియోలోని సిన్సినాటిలో ఉంటున్నారు. అతని జీవిత అనుభవాలు అతనిని.. బానిసత్వం నుండి క్రియాశీలతకు, బాధ నుంచి ఆనందానికి, భయం నుంచి స్వేచ్ఛకు.. ఇప్పుడు ‘హ్యూమన్ రైట్స్ హీరో అవార్డ్ 2023’అందుకునేందుకు సహకరించాయి.
ఇది కూడా చదవండి: కొడుకు బర్త్‌డేకి తల్లి సర్‌ప్రైజ్.. సిగ్గుతో చచ్చిపోవాలనిపిస్తోందంటూ..
Comments
Please login to add a commentAdd a comment