అంకారా: మిడిల్ ఈస్ట్ కంట్రీ టర్కీ.. అధికారికంగా తన పేరు మార్చుకుంది. టర్కీ కాస్త ఇక నుంచి ‘తుర్కియె’గా మారనుంది. ఇక నుంచి కొత్త పేరుతో తమను గుర్తించాలని ఐక్యరాజ్య సమితికి టర్కీ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతిపాదన పంపారు. ఆ వెంటనే ఐరాస అంగీకారం చెబుతూ.. ఈ విషయాన్ని ప్రకటించింది.
దేశం గుర్తింపులో మార్పులుచేసే ‘‘రీబ్రాండింగ్’’ను.. కిందటి ఏడాది అధ్యక్షుడు రెచప్ టయ్యప్ ఎర్దోవాన్ మొదలుపెట్టారు. ఇందులో భాగంగా దేశం పేరును మార్చాలంటూ ప్రముఖ అంతర్జాతీయ సంస్థలను అక్కడి ప్రభుత్వ అధికారులు ఆశ్రయిస్తున్నారు. ఎర్దోగాన్ సైతం తమ దేశం పేరును తుర్కియె (Türkiye)గా ఉచ్చరించాలని ప్రపంచ దేశాలను కోరుతున్నారు. తుర్కుల సంస్కృతి, సంప్రదాయాలు, నాగరికత, విలువలకు తుర్కియా అనే పదం చక్కగా నప్పుతుందని ఎర్దోవాన్ చెబుతూ వస్తున్నారు. గత ఏడాది పేరును మారుస్తున్నట్లు టర్కీ ప్రకటించిన వెంటనే ప్రభుత్వ మీడియా సంస్థ టీఆర్‌టీలో వెంటనే మార్పులు చేశారు.
టర్కీ (turkey)గా ఉన్న దేశం పేరును తుర్కియె(Türkiye)గా మార్చుకున్నట్లు.. ఐక్యరాజ్య సమితికి పంపిన లేఖలో పేర్కొన్నారు. కొత్త పేరును అధికారికంగా గుర్తించాలని ఐక్యరాజ్య సమితిని కోరారు టర్కీ విదేశాంగ మంత్రి. తమ దేశం పేరును మార్చాలని టర్కీ పెట్టుకున్న అభ్యర్థనకు ఐరాస అంగీకారం తెలిపింది. దీంతో టర్కీ అనే పేరు ఇక చరిత్ర కానుంది.
కారణం ఇదే..
టర్కీ అనేది ఒక పక్షి పేరు. అంతేకాదు.. ఫెయిల్యూర్, మూర్ఖుడు, సిల్లీ ఫెలో అనే ఇంగ్లిష్ అర్థాలు కూడా ఉన్నాయి. అందుకే ఈ పేరు మార్చాలని ఎప్పటి నుంచో ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుందని టీఆర్‌టీ చెబుతోంది. గత జనవరిలో ‘హలో తుర్కియా’ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. రీబ్రాండింగ్ ప్రక్రియలో భాగంగా.. ఇక నుంచి ఆ దేశం నుంచి ఎగుమతి అయ్యే ప్రాడక్టులపై ‘మేడ్ ఇన్ తుర్కియె’ మారుస్తారు. దేశం కొత్త పేరును విస్తృతంగా ప్రాచుర్యంలోకి తీసుకురావాలని అక్కడి ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది.
మిశ్రమ స్పందన
దేశం పేరును మార్చడంపై అక్కడి ప్రజల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. వచ్చే ఏడాది ఎన్నికలు జరుగుతుండటంతో ఆర్థిక సంక్షోభం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఎర్దోవాన్ ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. జనాలు కూడా తమ పరిస్థితి పట్టించుకోకుండా.. ఇలా పేర్లు మారుస్తున్న ప్రభుత్వంపై మండిపడుతున్నారు.
ఇదిలా ఉంటే.. దేశాలు ఇలా పేర్లు మార్చుకోవడం కొత్తేమీ కాదు. 2020లో డచ్ ప్రభుత్వం హోలాండ్ అనే పేరును ఇకపై వాడబోమని నెదర్లాండ్స్, ఐరాసకు తెలిపింది. అంతకుముందు మాసిడోనియా కూడా గ్రీస్‌తో ఉన్న గొడవల నేపథ్యంలో.. నార్త్ మాసిడోనియాగా పేరు మార్చుకుంది. గతంలో పర్షియా ఇరాన్ అయ్యింది. అలాగే.. సియామ్ కాస్త థాయ్‌లాండ్ అయ్యింది. ఇలా ఎన్నో దేశాలు పేర్లు మార్చుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment