90 గంటలు శిథిలాల కిందే.. మృత్యువును జయించిన10 రోజుల శిశువు. | Turkey Earthquake: 10-Day-Old Baby Rescued From Rubble After 90 Hours | Sakshi
Sakshi News home page

అద్భుతం: 90 గంటలు శిథిలాల కిందే.. మృత్యువును జయించిన10 రోజుల చిన్నారి

Published Sat, Feb 11 2023 6:19 PM | Last Updated on Sat, Feb 11 2023 6:55 PM

Turkey Earthquake: 10-Day-Old Baby Rescued From Rubble After 90 Hours - Sakshi

భూకంపం తర్వాత టర్కీ, సిరియాలో దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రకృతి ప్రకోపానికి రెండు దేశాలు చిగురుటాకులా వణికిపోయాయి. వరుస భూకంపాల తర్వాత భవన శిథిలాల గుట్టలు ఆ  భయానక దృశ్యానికి సాక్షాలుగా నిలిచాయి. రోజులు గడుస్తున్న కొద్దీ మరణించిన వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. భూ ప్రళయంలో కన్నుమూసిన వారు ఇప్పటి వరకు 25 వేలు దాటింది.  ఒక్క టర్కీలోనే 20 వేల మంది మరణించినట్లు విపత్తు నిర్వహణ అధికారులు తెలిపారు.

మరోవైపు గడ్డకట్టే చలిలోనూ  సహాయక బృందాలు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు. సహాయక చర్యలతోపాటు శిథిలాల తొలగింపు ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. భీకర భూకంపం సంభవించి 100 గంటలు గడిచిపోయిన శిథిలాల కింద మృతదేహాలు బయటపడుతూనే ఉన్నాయి. ఘోర విపత్తు ద్వారా కూతురిని కోల్పోయిన తండ్రి, తల్లిని కోల్పోయిన చిన్నారులు, తోబుట్టువులు ఇలా పలు చోట్ల హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటికీ కొందరు సజీవంగా బయటపడటం ఊరట కలిగిస్తోంది.

మృత్యుంజయులుగా బయటపడుతున్న చిన్నారులు
తుర్కియేలో శిథిలాలను తొలగిస్తుండగా శుక్రవారం ఒక్కరోజే 100 మందికిపైగా బాధితులు ప్రాణాలతో బయటకు వచ్చారు.  తాజాగా హతయ్‌ ప్రావిన్సులో శిథిలాల కింద మరో మహిళ, నవజాత శిశువు మృత్యంజయులుగా నిలిచారు. భూకంపం సంభవించిన 90 గంటల తర్వాత శిథిలాల నుంచి తల్లితో సహా యాగిజ్‌ ఉలాస్‌ అనే పది రోజుల శిశువును అధికారులు రక్షించారు. 

నాలుగు రోజులపాటు మృత్యువుతో పోరాడి చివరికి మరణాన్ని జయించింది చిన్నారి. అనంతరం దుప్పటిలో చుట్టి హతే ప్రావిన్స్‌లోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లీ, బిడ్డకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అదే హతే ప్రావిన్స్‌లో భూ ప్రళయం చోటుచేసుకున్న 100 గంటల తర్వాత శిథిలాల నుంచి 3 ఏళ్ల జైనెప్ ఎలా పర్లక్ అనే చిన్నారి ప్రాణాలతో బయటపడింది.
చదవండి: Donald Trump: ట్రంప్ ఈజ్ బ్యాక్.. రెండేళ్ల తర్వాత..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement