లండన్: తమ అనుకూల నేతను ఉక్రెయిన్ అధినేతగా చేసేందుకు రష్యా కుట్రలు పన్నుతోందని బ్రిటన్ ప్రభుత్వం తీవ్రమైన ఆరోపణలు చేసింది. ఇందులో భాగంగా ఉక్రెయిన్ మాజీ ఎంపీ యెవెహెన్ మురయేవ్‌ను రష్యా ఎంచుకొని ప్రోత్సహిస్తోందని యూకే విదేశీ వ్యవహరాలు, కామన్‌వెల్త్ కార్యాలయం (ఎఫ్‌సీడీఓ) శనివారం ప్రకటించింది. ఈ మేరకు తమకు ఇంటెలిజెన్స్ సమాచారం ఉందని, ఇలాంటి ప్రయత్నాలకు రష్యా భారీ మూల్యం చెల్లించుకోవాల్సివస్తుందని హెచ్చరించింది.
ఉక్రెయిన్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు రష్యా కుట్రలు పన్నుతున్నట్లు వెలుగులోకి వచ్చిందని యూకే విదేశాంగ సెక్రటరీ లిజ్ ట్రస్ చెప్పారు. రష్యా వెనక్కు తగ్గాలని, ఇలాంటి కుట్రలు మానుకొని ప్రజాస్వామ్య మార్గం అవలంబించాలని కోరారు. ఉక్రెయిన్‌పై రష్యా ఎలాంటి మిలటరీ చర్యలు చేపట్టినా తాము, తమ మిత్ర దేశాలు ఊరుకోమన్నారు. ఇటీవల కాలంలో ఉక్రెయిన్ స్వాధీనం చేసకునే ఉద్దేశంతో రష్యా సరిహద్దులోకి లక్షమంది సైనికులను తరలించిందన్న వార్తలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌పై యుద్ధం చేసి ఆక్రమించుకునే బదులు, తమకు అనుకూల నేత చేతిలో ఉక్రెయిన్ ప్రభుత్వం ఉంటే మంచిదని రష్యా భావిస్తోన్నట్లు ఎఫ్‌సీడీఓ తెలిపింది. యెవెహెన్ మాత్రమే కాకుండా పలువురు ఉక్రెయిన్ రాజకీయనేతలకు రష్యాతో సంబంధాలున్నట్లు తెలిపింది. 2015 నుంచి ఉక్రెయిన్‌లో బ్రిటన్ సేనలు సాయంగా ఉంటున్నాయి. బ్రిటన్ ఆరోపణలను రష్యా ఖండించింది. బ్రిటన్ ఆధ్వర్యంలో నాటో కూటమి సాగించే తప్పుడు ప్రచారంలో ఇదంతా భాగమని రష్యా విదేశాంగ శాఖ ఆరోపించింది.
(చదవండి: ఇది పూర్తిగా మనసును కదిలించే విషాదం: భారతీయుల మృతిపై కెనడా ప్రధాని)
Comments
Please login to add a commentAdd a comment