ఇంకా వ్యాక్సిన్‌ తీసుకోలేదా.. ఈ విషయం తెలుసుకోండి | UK Health Agency study On Corona Vaccination | Sakshi
Sakshi News home page

కరోనా వ్యాక్సిన్‌ తీసుకోలేదా.. ఇది తెలుసుకోండి

Published Thu, Feb 17 2022 6:38 PM | Last Updated on Thu, Feb 17 2022 7:06 PM

UK Health Agency study On Corona Vaccination - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌ వైరస్‌ సోకి కోలుకుని అస్సలు టీకాలు తీసుకోని వారిలో దీర్ఘకాలం పాటు కరోనా సమస్యలు, లక్షణాలు కొనసాగుతున్నట్టు వెల్లడైంది. రెండు లేదా ఒక డోసైనా వ్యాక్సిన్‌ తీసుకోని వారితో పోలిస్తే.. తీసుకున్న వారిలో 50 శాతం తక్కువగా లాంగ్‌ కోవిడ్‌ సమస్యలు ఉన్నట్టు తెలుస్తోంది. శరీరంలోని అన్ని అవయవాలు, వ్యవస్థలపై కరోనా దీర్ఘకాలిక ప్రభావాలు ఉంటాయని, కొన్ని సందర్భాల్లో ఇవి తీవ్రస్థాయికి కూడా చేరుకోవచ్చునని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో), ఇతర నిపుణుల తాజా హెచ్చరికల నేపథ్యంలో ఈ అంశాలకు ప్రాధాన్యత ఏర్పడింది.

స్వల్ప లక్షణాలతో మైల్డ్‌గానే కరోనా సోకి తగ్గిపోయినా.. ఆ తర్వాత అనారోగ్య సమస్యలు, పోస్ట్‌ కోవిడ్‌ చిక్కులతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావొచ్చునని మరికొన్ని అధ్యయనాలు ఇప్పటికే సూచించాయి. ఈ క్రమంలోనే టీకాలు తీసుకున్న వారిలో లాంగ్‌ కోవిడ్‌ సమస్యలు తక్కువగా ఉన్నట్టు, వ్యాక్సిన్లు తీసుకోని వారిని సమస్యలు వెంటాడుతున్నట్టు యునైటెడ్‌ కింగ్‌డమ్‌ హెల్త్‌ సెక్యూరిటీ ఏజెన్సీ (యూకే హెచ్‌ఎస్‌ఏ) తేల్చింది. వివిధ సంస్థలు నిర్వహించిన దాదాపు 15 అంతర్జాతీయ  అధ్యయనాలను పరిశీలించి ఈ విషయాన్ని వెల్లడించింది.  

టీకాలతో త్వరగా రికవరీ..

ఫైజర్, బయో ఎన్‌టెక్, ఆస్ట్రాజెనికా, మోడెర్నా రెండు వ్యాక్సిన్లు లేదా జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ సింగిల్‌ డోస్‌ టీకా వేసుకున్న వారిలో, వ్యాక్సిన్‌ తీసుకోని వారికంటే 50 శాతం తక్కువగా లాంగ్‌ కోవిడ్‌ లక్షణాలు ఉంటున్నాయని యూకే హెచ్‌ఎస్‌ఏ పేర్కొంది. టీకాలు వేయించుకున్న వారు త్వరగా కోలుకుంటున్నట్టుగా కూడా వెల్లడించింది. పూర్తిస్థాయిలో వ్యాక్సిన్లు తీసుకున్న వారికి మంచి ప్రయోజనాలు కలుగుతున్నట్టుగా తేలిందని సంస్థకు చెందిన డాక్టర్‌ మేరి రామ్‌సే తెలిపారు. ‘కోవిడ్‌ సోకాక వ్యాక్సినేషన్‌ ద్వారా సీరియస్‌ లక్షణాల నుంచి రక్షణ లభిస్తుంది.దీర్ఘకాలిక ప్రభావాలు, లక్షణాలు కూడా తగ్గుతాయి. చాలామందికి లాంగ్‌కోవిడ్‌ లక్షణాలు తక్కువ కాలమే ఉండడమే కాకుండా త్వరలోనే పరిష్కారమౌతాయి. కొందరిలో మాత్రమే ఈ లక్షణాలు తీవ్రంగా మారి రోజువారీ జీవనాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది..’ అని ఆమె చెప్పారు. కరోనా సోకాక నాలుగు వారాల తర్వాత కూడా అసాధారణ, అనూహ్య లక్షణాలుంటే వైద్యులను సంప్రదించాలని ఆమె సూచించారు.

యూకే హెచ్‌ఎస్‌ఏ పరిశీలన ప్రకారం..

- లాంగ్‌ కోవిడ్‌లో ఎక్కువగా అలసట, 
- ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు, కీళ్లు, కండరాల నొప్పులు, తదితరాలు కొనసాగుతుంటాయి.
- యూకే జనాభాలో 2 శాతం మంది దాకా దీర్ఘకాలిక కరోనా లక్షణాలు, సమస్యలతో బాధపడుతున్నారు
- వ్యాక్సిన్లు తీసుకున్న వారు 28 రోజుల పాటు కోవిడ్‌ లక్షణాలు కలిగి ఉన్నారు
- పోస్ట్‌ కరోనా లక్షణాలపై టీకాలు బాగా పనిచేస్తున్నాయి. 60 ఏళ్లు పైబడిన వారిలో వీటి ప్రభావం అత్యధికం కాగా 19–35 ఏళ్ల మధ్యలోని వారిపై తక్కువగా ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement