సుమీలోని ఓ బంకర్‌లో తలదాచుకున్న భారతీయులు
కీవ్: ఉక్రెయిన్ యుద్ధభూమి నుంచి భారత విద్యార్థుల్ని వెనక్కి తీసుకువచ్చే ‘ఆపరేషన్ గంగ’ ఆఖరి దశలో సంక్లిష్టంగా మారింది. రష్యా ఫిరంగులు నిప్పులు కక్కుతుండటంతో సుమీ నగరంలో చిక్కుకుపోయిన 700 మందిని తీసుకురావడం సమస్యగా మారింది. ఉక్రెయిన్‌లో మారియుపోల్, వోల్నోవాఖ నగరాల్లో పౌరులను సజావుగా ఖాళీ చేయించడానికి మానవతా దృక్పథంతో కాల్పులకు కాస్త విరామం ప్రకటిస్తున్నట్టు రష్యా శనివారం ప్రకటించింది. దాంతో సుమీలో చిక్కుకున్న మన విద్యార్థుల్ని వెనక్కి తీసుకురావచ్చని కీవ్‌లోని భారత రాయబార కార్యాలయం భావించింది.
కానీ, రష్యా మాట తప్పి ఎడతెరిపి లేకుండా క్షిపణి, బాంబు దాడులకు దిగడంతో పరిస్థితి మొదటికొచ్చింది. తూర్పు ఉక్రెయిన్‌లో చిక్కిన విద్యార్థుల్ని సరిహద్దులకు చేర్చాలంటే మారియుపోల్, వోల్నోవాఖ నుంచే తీసుకురావాలి. కానీ, అక్కడ రష్యా బాంబుల వర్షం కురిపిస్తోంది. ఖర్కీవ్ సమీపంలోని పిసోచిన్, సుమీ నుంచి విద్యార్థుల్ని తీసుకురావడానికి సురక్షిత మార్గాలేవీ అందుబాటులో లేవు. రష్యాకు ఈశాన్యంగా ఉన్న సుమీ పరిసరాల్లో భీకరమైన దాడులు కొనసాగుతున్నాయి. పైగా రవాణా సాధనాలేవీ లేకపోవడం మరో సమస్యగా ఉంది. దాడులు ఆగిన తర్వాతే విద్యార్థుల తరలింపు సాధ్యమయ్యే అవకాశం కనిపిస్తోంది.
చిన్న హోటల్ గది నుంచి
ఆపరేషన్ గంగ కోసం హంగరీ రాజధాని బుడాపెస్ట్‌లో ఒక హోటల్ గదిలో చిన్న కంట్రోల్ రూమ్ పెట్టి నడిపించారు. భారత రాయబార కార్యాలయంలోని మెరికల్లాంటి యువ ఐఎఫ్‌ఎస్ అధికారులు ఆపరేషన్ చేపట్టారు. 150 మందికి పైగా వలెంటీర్లను నియమించుకొని భారతీయ విద్యార్థులు ఎక్కడెక్కడున్నారో సమాచారం సేకరించారు.
ఆపరేషన్ గంగ విజయవంతం: మోదీ
ప్రపంచవ్యాప్తంగా భారత్ ప్రతిష్ట ఎంతో పెరిగిందని ప్రధాని మోదీ అన్నారు. కాబట్టే మన పౌరులను ఉక్రెయిన్ నుంచి వేగంగా తీసుకొచ్చి ‘ఆపరేషన్ గంగ’ను విజయవంతం చేశామన్నారు. ఈ విషయంలో చాలా పెద్ద దేశాలు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయన్నారు. ఆదివారం పుణెలోని సింబయాసిస్ వర్సిటీ గోల్డెన్ జూబ్లీ వేడుకలను ప్రారంభించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
నేడు భారత్‌కు హరజోత్ సింగ్
ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో కొద్ది రోజుల క్రితం రష్యా దాడుల్లో గాయపడిన భారత విద్యార్థి హరజోత్ సింగ్ సోమవారం స్వదేశానికి రానున్నాడు. ఈ విషయాన్ని పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి వి.కె.సింగ్ చెప్పారు.
24 గంటల్లో 2,500 మంది రాక..
గత 24 గంటల్లో 13 విమానాలు 2,500 మంది విద్యార్థుల్ని ఉక్రెయిన్ నుంచి భారత్‌కు చేర్చాయి. ‘ఆపరేషన్ గంగ’లో భాగంగా ఇప్పటిదాకా 76 విమానాల్లో 15,920 మంది విద్యార్థులు క్షేమంగా తిరిగివచ్చారు. వచ్చే 24 గంటల్లో మరో 13 భారత వైమానిక దళ విమానాలు ఉక్రెయిన్ నుంచి విద్యార్థులతో బయల్దేరతాయి. ఉక్రెయిన్‌కు విమానాల రాకపోకలపై నిషేధం ఉండటంతో రుమేనియా, పోలండ్, హంగరి, స్లొవేకియా, మాల్డోవాల నుంచి విద్యార్థులను భారత్ వెనక్కు తీసుకొస్తోంది. హంగరీ నుంచి ఆఖరి విడతగా 13 విమానాలు రానున్నాయి. అందుకే హంగరీ సరిహద్దులకు చేరుకోవాలనుకునే విద్యార్థులంతా త్వరగా రావాలని భారత రాయబార కార్యాలయం సూచించింది. సోమవారం బుడాపెస్ట్ నుంచి ఐదు, సుకేవా నుంచి రెండు, బుఖారెస్ట్ నుంచి ఒక విమానంలో మరో 1,500 మందిని తీసుకు రానున్నారు.
Comments
Please login to add a commentAdd a comment