చదువు కోసం, బ్రతుకు తెరువు కోసం... ఉక్రెయిన్ వెళ్ళిన భారతీయ బాటసారులు అత్యధికులు ఎట్టకేలకు క్షేమంగా ఇంటి ముఖం పడుతున్నారు. భయానక, బీభత్స దృశ్యాలెన్నో చూస్తున్న వేళ... యుద్ధక్షేత్రం నుంచి వందల సంఖ్యలో మనవాళ్ళు క్షేమంగా తిరిగి వస్తుండడం ఒకింత ఊరట. ముఖ్యంగా బాంబుల వర్షంలో బయటపడే మార్గం లేని సుమీ నగర భారతీయ విద్యార్థుల సంగతి. అక్కడ మూడు హాస్టళ్ళలో ఉన్న దాదాపు 700 మంది విద్యార్థులు మంగళవారం సురక్షిత మార్గంలో ముందుగా 175 కి.మీ.ల దూరంలో మధ్య ఉక్రెయిన్‌లోని పోల్టావాకు 12 బస్సుల్లో బయలుదేరారు. అలా ‘ఆపరేషన్ గంగ’ అతి క్లిష్టమైన ఘట్టానికి చేరింది.
నిజానికి, సోమవారమే ఈ పని జరగాల్సింది. కానీ, కాల్పుల విరమణకు అంగీకరించినట్టే అంగీకరించి, ఇరుపక్షాలూ అందుకు కట్టుబడలేదు. దాంతో, భద్రతా కారణాల రీత్యా తరలింపు సాధ్యం కాలేదు. బస్సెక్కిన విద్యార్థులను సైతం సోమవారం మళ్ళీ హాస్టళ్ళకు వెనక్కి పంపేయాల్సి వచ్చిందంటే, సుమీలో పరిస్థితి ఎలా ఉందో ఊహించవచ్చు. చివరకు ఐరాస భద్రతా మండలిలో భారత్ అసంతృప్తిని వ్యక్తం చేసి, దౌత్యపరంగా ఒత్తిడి పెంచడం ఫలితాన్నిచ్చింది. రష్యా, ఉక్రెయిన్ నేతలిద్దరికీ భారత ప్రధాని సోమవారం ఫోన్ చేసి, విద్యార్థుల తరలింపునకు సహకరించాలని కోరిన సంగతీ ప్రస్తావించాక ఎట్టకేలకు విద్యార్థుల నిరీక్షణకు తెర పడింది. మొత్తానికి, గత రెండు వారాల్లో 22500 మంది భారతీయులు ఉక్రెయిన్ నుంచి బయటపడితే, అందులో 16 వేల పైమంది ‘ఆపరే షన్ గంగ’లో భాగంగా ప్రభుత్వ విమానాల్లో వెనక్కి వచ్చారు. ఇలా ఉండగా, బుధవారం ఉక్రె యిన్‌లో బాధిత నగరాలు ఆరింటిలో 12 గంటల కాల్పుల విరమణకు రష్యా, ఉక్రెయిన్‌లు అంగీకరించడం చిన్న సాంత్వన. కీవ్, ఖార్కివ్, మారియాపోల్‌ల నుంచి పౌరులు తరలిపోయేం దుకు మానవీయ కారిడార్లకు అంగీకారం కుదిరింది. శరణార్థుల సంక్షోభం మాటెలా ఉన్నా, మానవతా కారిడార్లతో వేలమంది ప్రాణాలతో సురక్షిత ప్రాంతాలకు పోవడానికి వీలు కలిగింది.
యుద్ధం మొదలయ్యాక 20 లక్షల మంది ఉక్రెయిన్‌ను వదిలిపోయారు. ఒక్క మంగళవారమే 7 వేల మందిని సుమీ నుంచి తరలించారు. ఈశాన్య ఉక్రెయిన్‌లో, రష్యా సరిహద్దుకు 60 కి.మీ.ల దూరంలోనే ఉంటుంది సుమీ నగరం. పశ్చిమ సరిహద్దుకు వెయ్యి కి.మీల దూరంలోని ఖార్కివ్ కన్నా, తూర్పు సరిహద్దు దగ్గరి సుమీ నుంచి ఆగని కాల్పుల మధ్య తరలింపు సంక్లిష్టమైంది. అక్కడి సుమీ స్టేట్ యూనివర్సిటీలోని వైద్య కళాశాలల్లో దాదాపు 700 మంది భారతీయ విద్యార్థులు చదువుతున్నారు. సంక్లిష్ట యుద్ధ క్షేత్రంలో నడిమధ్యన ఉన్న సుమీలో హాస్టళ్ళలోని బంకర్ల నుంచి బయటకొస్తే – ఎటు నుంచి ఏ క్షిపణి తాకుతుందో తెలియని పరిస్థితుల్లో, తిండీ నీళ్ళు కూడా కరవై, గడ్డ కట్టే చలిలో అవస్థ పడ్డారు. కాలినడకన కూడా పోలేని పరిస్థితుల్లో, వారికి ధైర్యం చెబుతూ, వారందరి తరలింపు కోసం చివరి దాకా శ్రమించిన ప్రభుత్వం సహా ప్రతి ఒక్కరినీ అభినందించాలి.
1986 జనవరిలో దక్షిణ యెమెన్‌లో అంతర్యుద్ధం చెలరేగినప్పుడు బ్రిటన్, రష్యా, ఫ్రాన్స్ దేశీయులకు భిన్నంగా 850 మంది భారతీయులు తమ తరలింపు కోసం రోజులకొద్దీ వేచిచూశారు. భారత ప్రభుత్వం చివరకు ఓ వాణిజ్య నౌకను ఒప్పించి, మనవాళ్ళను స్వదేశానికి తేగలిగింది. 30 ఏళ్ళ తర్వాత 2015 ఏప్రిల్‌లో యెమెన్‌లో మళ్ళీ సంక్షోభం తలెత్తినప్పుడు ‘ఆపరేషన్ రాహత్’ ద్వారా 5 వేల మంది భారతీయులనూ, 41 దేశాలకు చెందిన వెయ్యి మంది పౌరులనూ భారత సర్కారు సురక్షితంగా తరలించింది. ఆ తర్వాత ఏడేళ్ళకు ఇప్పుడు మళ్ళీ ఉక్రెయిన్‌లో క్లిష్టమైన తరలింపు ప్రక్రియలో తలమునకలైంది. పాకిస్తానీ, బంగ్లాదేశీ, నేపాలీయులను సైతం రక్షించి, వారి మనసు గెలిచింది. ఏపీ ప్రభుత్వ ప్రతినిధులు ప్రత్యేకంగా ఉక్రెయిన్ వెళ్ళి, మన వాళ్ళ తరలింపు ప్రక్రియకు తోడ్పడడం విశేషం. సాధారణంగా ఇలాంటి తరలింపులకు ప్రచారార్భాటం లేని దౌత్య నీతి అవసరం. కారణాలేమైనా ఈసారి ‘ఆపరేషన్ గంగ’ పేరుతో మోడీ సర్కార్ చేపట్టిన తరలింపు ప్రక్రియ విమానాల్లో మంత్రుల హడావిడికీ, ఎన్నికల సభల్లో ప్రసంగాలకీ తావివ్వడం విచిత్రం.
ఇవాళ ప్రపంచమంతటా ప్రవాస భారతీయుల సంఖ్య గణనీయంగా పెరిగింది. దాదాపు 1.33 కోట్ల ౖపైగా భారతీయులు విదేశాల్లో ఉన్నారు. ఏటా 2 కోట్ల మంది అంతర్జాతీయ ప్రయాణాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడైనా ఉక్రెయిన్ లాంటి విపత్కర పరిస్థితులు ఎదురైతే, అక్కడి మన దేశస్థులను సకాలంలో రక్షించుకోవడానికి వీలుగా ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక రూపొందించు కోవడం అవసరం. అందుకు తగ్గట్టు సామర్థ్యాన్ని విస్తరించుకోవడం కీలకం. 1950ల నుంచి ఇప్పటి దాకా మన దేశం ఇలా 30కి పైగా తరలింపు ప్రక్రియలను నడిపింది. చరిత్రలోని అపారమైన ఆ అనుభవాన్నీ, అనుసరించిన పద్ధతులనూ, నేర్చుకున్న పాఠాలనూ కలబోసి వాటిని వ్యవస్థీకృతం చేయాలి. దౌత్య సిబ్బందికి కూడా విపత్కర పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలనే దానిపై ముందుగా ప్రత్యేక శిక్షణనివ్వాలి. యుద్ధక్షేత్రాల్లో పనిచేయాల్సి వస్తే ఉపకరించేలా విదేశాంగ సర్వీసు శిక్షణార్థు లకు ఆర్మీ, లేదంటే పోలీసులతో శిక్షణనిప్పించవచ్చు. అలా చేస్తే, దాహం వేసినప్పుడు బావి తవ్వడం కాకుండా రాబోయే విపత్తులకు ముందుగానే సిద్ధమై ఉంటాం. సాధన, సన్నద్ధత ఉంటే... ఏ సమస్య నుంచైనా సులభంగా బయటపడగలమని వేరే చెప్పనక్కర లేదు. ఉక్రెయిన్‌లో గాలిలో కలసిపోయిన అమాయక భారతీయ విద్యార్థి ప్రాణాలు ఆ సంగతిని గుర్తు చేస్తూనే ఉంటాయి!
సంక్లిష్టమైన సవాలు
Published Thu, Mar 10 2022 12:56 AM | Last Updated on Thu, Mar 10 2022 12:56 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment