కీవ్‌లో రష్యా దాడిలో ధ్వంసమైన మిలటరీ వాహనాలు
కీవ్: భారీ కాల్పులు. బాంబు పేలుళ్లు. క్షిపణి దాడులు. చెదురుమదురుగా పడున్న శవాలు. పూర్తిగా, పాక్షికంగా ధ్వంసమైన భవనాలు, కట్టడాలు. బంకర్లలో, భూగర్భ మెట్రో స్టేషన్లలో తలదాచుకుంటున్న వాళ్లు కొందరు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోతున్న వాళ్లు ఎందరో! రష్యా ముట్టడిలో మూడో రోజు శనివారం ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో ఎటు చూసినా ఇవే దృశ్యాలు కనిపించాయి. యుద్ధ విధ్వంసాన్ని కళ్లకు కడుతూ కంటతడి పెట్టిస్తున్నాయి. సైనిక స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నట్టు రష్యా ప్రకటించినా కీవ్‌లో స్కూళ్లు, నివాస భవనాలు తదితరాలపై కూడా భారీగా దాడులు జరుగుతున్నాయి.
కీవ్‌లో రష్యా సైన్యం దాడి అనంతరం పేలని బాంబులను సేకరిస్తున్న ఉక్రెయిన్ సైనికులు
ప్రధాన పోరాటం కీవ్ వద్దే కేంద్రీకృతమైంది. దాన్ని ఆక్రమించేందుకు రష్యా సైన్యం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. శుక్రవారం నాటికే కీవ్ సమీపానికి చొచ్చుకొచ్చిన సేనలు శనివారం మరింతగా ముందుకు కదిలాయి. అవి నగరానికి 30 కిలోమీటర్ల సమీపానికి వచ్చాయని ఇంగ్లండ్ చెప్పింది. శివార్ల సమీపంలో రష్యా, ఉక్రెయిన్ దళాల మధ్య భారీగా కాల్పులు జరుగుతున్నాయి. కీవ్ చుట్టుపక్కల 40 కిలోమీటర్ల పరిధిలో రష్యా దళాలు చిన్న చిన్న యూనిట్లుగా ముందుకు కదులుతూ కన్పించాయి. ప్రధాన సైన్యానికి అవి మార్గాన్ని సుగమం చేస్తున్నాయని, ఆదివారం రష్యా సేనలు పూర్తిస్థాయిలో కీవ్‌పైకి విరుచుకుపడతాయని భావిస్తున్నారు.
రష్యా దాడులతో దెబ్బతిన్న కీవ్‌లోని ఓ బహుళ అంతస్తుల భవనం
ప్రధాన యుద్ధం కీవ్ చుట్టుపక్కలే కేంద్రీకృతమైందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలిదిమిర్ జెలెన్‌స్కీ అన్నారు. రాజధానిని కాపాడుకునేందుకు శక్తియుక్తులన్నీ ధారపోస్తామని ప్రకటించారు. నగరంపైకి బాంబులు, రాకెట్లు క్రమం తప్పకుండా వచ్చి పడుతూనే ఉన్నాయి. వాటి పేలుళ్ల శబ్దాలు సుదూరాల దాకా విన్పిస్తున్నాయి. రాజధానికి కరెంటు సరఫరా చేసే కీలకమైన జల విద్యుత్కేంద్రాన్ని కూడా రష్యా సేనలు ఆక్రమించాయి. నగరంపైకి క్రూయిజ్ మిసైళ్లు క్రమం తప్పకుండా వచ్చి పడుతూనే ఉన్నాయి. యుద్ధంలో ఇప్పటిదాకా 200 మందికి పైగా మరణించారని, 1000 మందికి పైగా గాయపడ్డారని ఉక్రెయిన్ ఆరోగ్య మంత్రి ప్రకటించారు. నగరంలో కర్ఫ్యూను సోమవారం దాకా పొడిగించారు. పౌరులతో సహా వీధుల్లో ఎవరు కన్పించినా శత్రువులుగానే భావిస్తామని నగర మేయర్ పేర్కొన్నారు. మూడువైపుల ముట్టడిలో ఉక్రెయిన్లో చెప్పుకోదగ్గ భూ భాగాన్ని రష్యా ఆక్రమించిందని సమాచారం. ఒకవైపు యుద్ధాన్ని కొనసాగిస్తూనే, మరోవైపు చర్చలకూ సిద్ధమని ప్రకటించిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన అసలు ఉద్దేశాలను మాత్రం బయట పెట్టడం లేదు.
ముట్టడిలో తీర ప్రాంతాలు
కీవ్‌తో పాటు ఉక్రెయిన్ తీర ప్రాంతాలపై కూడా రష్యా దాడి ముమ్మరంగా కొనసాగుతోంది. పశ్చిమాన రొమేనియా సరిహద్దుల వెంబడి నల్ల సముద్రం నుంచి ఒడెసా దాకా, తూర్పున అజోవ్ సముద్రం నుంచి మారిపోల్ రేవు దాకా సైన్యాలు చురుగ్గా కదులుతున్నాయి. వాటిని రష్యా గనక స్వాధీనం చేసుకుంటే ఆర్థికంగా కీలకమైన అన్ని రేవు ప్రాంతాలతో ఉక్రెయిన్‌కు సంబంధాలు తెగిపోతాయి. దాంతో వాటిని కాపాడుకునేందుకు ఉక్రెయిన్ అన్ని ప్రయత్నాలూ చేస్తోంది. మారిపోల్‌లో బ్రిడ్జిల వద్ద సైన్యాలు భారీగా మోహరించాయి. రష్యా నేవీ సముద్రంవైపు నుంచి దాడికి దిగొచ్చన్న అనుమానంతో తీర ప్రాంతాలను ఖాళీ చేయిస్తోంది. తూర్పు ఉక్రెయిన్‌లో ఇప్పటికే చాలావరకు రష్యా దళాల అధీనంలోకి వెళ్లిన వేర్పాటువాద ప్రాంతాలు డొనెట్స్‌క్, లుహాన్స్‌క్‌ల్లో కూడా ఇంకా పోరాటం సాగుతోంది.
కాన్వాయ్‌ని ధ్వంసం చేశాం: ఉక్రెయిన్
కీవ్‌కు తాగునీరు సరఫరా చేసే ఓ కీలక రిజర్వాయర్‌ను లక్ష్యంగా చేసుకుని శనివారం రష్యా ప్రయోగించిన క్షిపణిని కూల్చేసినట్టు ఉక్రెయిన్ పేర్కొంది. దాంతోపాటు నగర సమీపంలో ఓ రష్యా సైనిక కాన్వాయ్‌ని తమ దళాలు ధ్వంసం చేసినట్టు చెప్పింది. రష్యాకు చెందినవిగా చెబుతున్న కాలిపోయిన సైనిక వాహనాలను ఉక్రెయిన్ 101వ బ్రిగేడ్ సైనికులు పరిశీలిస్తున్న ఫుటేజీని విడుదల చేసింది. తూర్పు నుంచి కీవ్‌కు దారితీసే హైవేలన్నింటిపైనా భారీగా చెక్‌పోస్టులు పెట్టి ఉక్రెయిన్ దళాలు పహారా కాస్తున్నాయి. పౌరులు కూడా ఆటోమేటిక్ రైఫిళ్లతో వారికి మద్దతుగా నిలబడ్డారు. ఉక్రెయిన్ సమీపంలో ఎస్–25 ఫైటర్ జెట్లు తక్కువ ఎత్తులో ఎగురుతూ కన్పించాయి. ఎలాంటి చిహ్నాలూ లేని ఈ విమానాలు రష్యావో, ఉక్రెయిన్‌వో నిర్ధారణ కాలేదు.
సరిహద్దుల్లో జనప్రవాహం
ఉక్రెయిన్ పౌరులు లక్షలాదిగా ఇళ్లూ వాకిళ్లూ వదిలి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వలస బాట పట్టారు. ప్రధానంగా దేశ పశ్చిమ ప్రాంతాల వైపు తరలి వెళ్తున్నారు. వీరి సంఖ్య త్వరలో 40 లక్షల దాకా చేరవచ్చన్న ఐరాస అంచనాలు అందరినీ కలవరపెడుతున్నాయి. దాంతో హంగరీ, పోలండ్ తమ సరిహద్దులను ఉక్రేనియన్ల కోసం పూర్తిగా తెరిచేశాయి. పాస్‌పోర్ట్, ఇతర అనుమతి పత్రాలున్నా లేకున్నా తమ దేశాల్లోకి రావచ్చని ప్రకటించాయి. సరిహద్దుల్లో జనప్రవాహం క్రమేపీ పెరుగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే 18–60 ఏళ్ల మధ్య వయసున్న మగవాళ్లను పోనివ్వడం లేదని, సైన్యంలో చేరి రష్యాను ఎదుర్కోవాలని నిర్దేశిస్తున్నారని చెబుతున్నారు.
ఉక్రెయిన్‌కు ట్యాంక్ విధ్వంసక ఆయుధాలు
ఉక్రెయిన్‌ను ఆదుకునేందుకు 400 ట్యాంక్ విధ్వంసక ఆయుధాలను పంపాలని జర్మనీ నిర్ణయించింది. అమెరికా, నాటో పక్షాలు కూడా ఆ దేశానికి శనివారం మరిన్ని ఆయుధాలు పంపాయి. పరిసర దేశాల్లో నాటో దళాల మోహరింపును మరింతగా పెంచాయి. అయితే నేరుగా రష్యా దళాలతో పోరాడే ఉద్దేశమేమీ లేదని పునరుద్ఘాటించాయి. ఆంక్షలను మరింతగా పెంచుతామని స్పష్టం చేశాయి. ఉక్రెయిన్‌కు 60 కోట్ల డాలర్ల తక్షణ సైనిక సాయాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. కార్ల లోడుతో రష్యా వైపు వెళ్తున్న ఓ సరుకుల నౌకను ఫ్రాన్స్ అదుపులోకి తీసుకుంది. మరోవైపు పోలండ్, బల్గేరియా, చెక్ రిపబ్లిక్‌ల విమానాలను నిషేధిస్తున్నట్టు రష్యా ప్రకటించింది.
స్వదేశాన్ని విడిచి వెళ్లే ప్రసక్తే లేదు: జెలెన్‌స్కీ
కీవ్: రష్యా సైన్యం ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను చుట్టుముట్టినా దేశాధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ మాత్రం నిబ్బరంగానే ఉన్నారు. బాంబుల మోతతో రాజధాని నగరం దద్దరిల్లుతున్నప్పటికీ ప్రజల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు. ‘మిమ్మల్ని క్షేమంగా బయటకు తీసుకొస్తాం’ అంటూ అమెరికా ఇచ్చిన ఆఫర్‌ను ఆయన తిరస్కరించారు. స్వదేశాన్ని, తన ప్రజలను వదిలేసి తాను ఎక్కడికీ వెళ్లనని శనివారం తేల్చిచెప్పారు. మనమంతా కలిసికట్టుగా పోరాడుదామని ఉక్రెయిన్ ప్రజలకు పిలుపునిచ్చారు. స్థిరంగా నిలబడి, ప్రత్యర్థితో కలబడుతామని సూచించారు.
మనం సాగించే పోరాటమే మన భవిష్యత్తును, దేశ భవిష్యత్తును నిర్ణయిస్తుందని ఉద్బోధించారు. యుద్ధరంగాన్ని వదిలేసి, ఎక్కడికో పారిపోవడం తనకు ఇష్టం లేదని పేర్కొన్నారు. మరోవైపు జెలెన్‌స్కీ భద్రతపై అమెరికా ఆందోళన వ్యక్తం చేస్తోంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్ ప్రభుత్వాన్ని కూలదోసే ఆలోచనలో ఉన్నట్లు అంచనా వేస్తోంది. అదే జరిగితే జెలెన్‌స్కీ ప్రాణాలకు ముప్పు తప్పదని భావిస్తోంది. అందుకే సురక్షిత ప్రాంతానికి తరలిస్తామని చెబుతున్నా జెలెన్‌స్కీ తిరస్కరిస్తున్నారు. ఆయన ప్రస్తుతం తన అధికారులతో కలిసి రాజధాని కీవ్‌లోనే ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment