వెయ్యి మందికి పైగా చైనీయుల వీసాలు రద్దు! | US Cancels Visas For Over 1000 Chinese Nationals Security Risks | Sakshi
Sakshi News home page

వెయ్యి మందికి పైగా వీసాలను రద్దు చేసిన అమెరికా!

Published Thu, Sep 10 2020 9:31 AM | Last Updated on Thu, Sep 10 2020 9:36 AM

US Cancels Visas For Over 1000 Chinese Nationals Security Risks - Sakshi

వాషింగ్టన్‌/బీజింగ్‌: జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా దాదాపు వెయ్యి మందికి పైగా చైనీస్‌ విద్యార్థులు, పరిశోధకుల వీసాలను రద్దు చేసినట్లు అమెరికా హోంల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం బుధవారం వెల్లడించింది. వీరంతా చైనా మిలిటరీతో సంబంధాలు కలిగి ఉండి, అమెరికాకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని డ్రాగన్‌ ఆర్మీకి చేరవేస్తున్నారనే అనుమానంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అంతేగాక బానిస కార్మికుల వెట్టిచాకిరీతో ఉత్పత్తి చేసిన వస్తువులను ఇకపై తమ దేశ మార్కెట్లోకి రాకుండా అడ్డుకుంటామంటూ.. జిన్‌జియాంగ్‌లోని ఉగర్‌ ముస్లింల పట్ల చైనా అనుసరిస్తున్న వైఖరిని ఈ సందర్భంగా ప్రస్తావించింది.(చదవండి: 244 ఏళ్ల స్వాత్రంత్ర్య చరిత్ర: మహిళకు దక్కని అవకాశం!)

ఈ విషయాల గురించి హోంల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం అధికార ప్రతినిధి చాద్‌ వాఫ్‌ మాట్లాడుతూ.. కొంతమంది చైనీయులు కరోనా వైరస్‌ పరిశోధనకు సంబంధించిన సమాచారాన్ని తస్కరించే ప్రయత్నాలు చేస్తూ అమెరికా విద్యా విధానాన్ని కించపరిచే విధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. హాంకాంగ్‌లో ప్రజాస్వామ్య విలువలను కాలరాసేలా వ్యవహరించిన చైనా తీరుకు బదులుగా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మే 29న చేసిన ప్రకటనకు అనుగుణంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. 

ఈ క్రమంలో సెప్టెంబరు 8, 2020 నాటికి సుమారుగా 1000 మంది చైనా జాతీయుల వీసాలను రద్దు చేసినట్లు తెలిపారు. డ్రాగన్‌ దేశ విద్యార్థులు, పరిశోధకుల నుంచి అమెరికా డేటాకు ముప్పు పొంచి ఉన్నందున ఇకపై వారికి తమ దేశంలో ప్రవేశించే అవకాశం ఉండదని స్పష్టం చేశారు. కాగా అమెరికాలో దాదాపు 3.60 లక్షల మంది చైనీయులు విద్యనభ్యసిస్తున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

వీరి ద్వారా అక్కడి కాలేజీలకు పెద్ద మొత్తంలో ఆదాయం చేకూరుతోంది. కాగా గత కొన్ని నెలలుగా అమెరికా- చైనా మధ్య దౌత్యపరమైన, వాణిజ్యపరమైన ఉద్రిక్తతలు తారస్థాయికి చేరిన విషయం తెలిసిందే. కరోనా విషయంలో చైనాపై కన్నెర్రజేసిన ట్రంప్‌.. ప్రపంచ వాణిజ్య ప్రధాన కేంద్రాల్లో ఒకటిగా పేరొందిన హాంకాంగ్‌ను తమ గుప్పిట్లోకి తెచ్చుకున్న డ్రాగన్‌ తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అంతేగాక మైనార్టీల పట్ల చైనా వ్యవహరిస్తున్న వైఖరి పట్ల కూడా అగ్రరాజ్యం ఆగ్రహంగా ఉంది. ఈ క్రమంలో  చైనా యాప్‌ల వాడకం కారణంగా జాతీయ భద్రతకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందంటూ టిక్‌టాక్‌, వీచాట్‌ తదితర యాప్‌లపై అమెరికా కఠిన వైఖరి అవలంబించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement