వాషింగ్టన్: భార్య చెప్పిన విషయం విని కోపంతో ఊగిపోయిన ఓ భర్త ఒక్క డాలర్ కోసం దొంగతనం చేశాడు. తీరా అరెస్టై జైలుకెళ్లాడు. ఈ సంఘటన అమెరికాలోని ఒక్లాహోమా నగరంలో జరిగింది. స్టార్‌బక్స్ అనే కాఫీ స్టోర్ తన భార్యకు రీఫండ్ చేయాల్సిన 1.25 డాలర్లు తిరిగి ఇవ్వలేదనే కోపంతో స్టోర్‌లో చోరీకి పాల్పడ్డాడు. దీంతో పోలీసులు అతడ్ని అరెస్ట్ చేయాల్సి వచ్చింది. అయితే, ఇక్కడే ట్విస్ట్ ఉంది. చోరీ చేసిన వస్తువు విలువ 1.32 డాలర్లు మాత్రమే. ఆ స్టోరీ ఏంటో మనమూ తెలుసుకుందాం..
రిచర్డ్ ఎంగెల్(61) అనే వ్యక్తి తన భార్యతో కలిసి గత ఆదివారం సాయంత్రం ఎడ్‌మోండ్‌లోని ఈస్ట్ మెమోరియల్ రోడ్‌లో ఉన్న స్టార్‌బక్స్ కాఫీ స్టోర్‌కు వెళ్లాడు. ఆ మరుసటి రోజు ఆయన భార్య తిరిగి కాఫీ షాప్‌కి వెళ్లి తనకు రీఫండ్ చేయాల్సిన 1.25 డాలర్లు తిరిగి ఇవ్వాలని కోరింది. అయితే, కాఫీ కొనుగోలు చేసినట్లు రిసిప్ట్ లాంటి ఆధారం లేకుండా రీఫండ్ ఇవ్వడం కుదరదని స్టోర్ సిబ్బంది తెలిపారు. దీంతో ఇంటికి వెళ్లి తన భర్తను తీసుకొచ్చింది ఆమె. ఈ క్రమంలో క్యాషియర్‌తో గొడవ పడ్డాడు ఎంగెల్. తన భార్యకు రావాల్సిన రీఫండ్‌ను ఇవ్వాల్సిందేనని వాధించాడు. క్యాషియర్ అందుకు ఒప్పుకోకపోవడంతో కౌంటర్‌పై ఉన్న టిప్ జార్‌ను పట్టుకుని అక్కడి నుంచి పరుగులు పెట్టాడు ఎంగెల్. అయితే, ఆ టిప్ జార్‌లో కేవలం 1.32 డాలర్లు మాత్రమే ఉండటం గమనార్హం.
ఎంగెల్‌ను అనుసరించిన స్టోర్ సిబ్బంది అతడి కారును ఫోటోలు తీసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కారు నంబర్ ప్లేట్ ఆధారంగా ఎంగెల్ ఇంటికి వెళ్లి చోరీ, దాడి వంటి నేరాల కింద అరెస్ట్ చేశారు పోలీసులు.
ఇదీ చదవండి: దురదృష్టవశాత్తు ఆ ఫ్లైట్‌లో టికెట్ బుక్ చేసుకున్నా..!
Comments
Please login to add a commentAdd a comment