బ్రిటన్ క్వీన్ ఎలిజబెత్-2 అంత్యక్రియలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హాజరుకానున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ‘వెళ్లే వివరాలు ఇంకా తెలియవు. కానీ నేను తప్పకుండా వెళ్తాను’ అని శుక్రవారం మీడియాతో పేర్కొన్నారు. రాణి ఎలిజబెత్ అంత్యక్రియల తేదీ ఇప్పటి వరకు నిర్ణయించలేదు. అయితే సెప్టెంబర్ 19న లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ అబ్బేలో ఎలిజబెత్ అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది.
ఒహియోలోని కొలంబస్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో బిడెన్ మీడియాతో మాట్లాడుతూ.. ఎలిజబెత్ కుమారుడు, ప్రస్తుత బ్రిటన్ కింగ్ చార్లెస్-3 తనకు తెలుసని అన్నారు. కానీ ఆయనకు ఎలాంటి కాల్ చేయలేదన్నారు. కాగా బ్రిటన్‌ను 70 ఏళ్లపాటు పాలించిన రాణి ఎలిజబెత్-2 గురువారం బాల్మోరల్ కోటలో తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆమెకు ప్రిన్స్ ఫిలిఫ్‌లా.. రాజరిక అంత్యక్రియలు కాకుండా ప్రభుత్వ లాంఛనలతో ఘనంగా అంత్యక్రియలు నిర్వహించాలని బ్రిటన్ ప్రభుత్వం నిర్ణయించింది.
అంత్యక్రియలు పూర్తయిన తర్వాత ఏడు రోజుల వరకూ రాజ కుటుంబం సంతాప దినాలు పాటిస్తుందని బకింగ్‌హామ్ ప్యాలెస్ శుక్రవారం ప్రకటించింది. అయితే, అంత్యక్రియలను ఎప్పుడు నిర్వహిస్తారన్నది మాత్రం వెల్లడించలేదు. ఎలిజబెత్ మృతితో ఆమె పెద్ద కుమారుడు ప్రిన్స్ చార్లెస్ సింహాసనమెక్కారు. కింగ్ చార్లెస్–3గా ఆయనకు త్వరలో లాంఛనంగా పట్టాభిషేకం జరగనుంది. ఇక ఎలిజబెత్–2 విషయానికొస్తే తండ్రి మరణంతో 1952 ఫిబ్రవరి 6న రాణిగా మారారు. 16 నెలల తర్వాత.. 1953 జూన్ 2న పట్టాభిషక్తురాలయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment