వాషింగ్టన్: అమెరికాలో సుదీర్ఘకాలంగా గ్రీన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న లక్షలాది మంది భారతీయుల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డుల మంజూరులో దేశాల కోటాను ఎత్తివేస్తూ రూపొందించిన బిల్లుకి అమెరికా సెనేట్ బుధవారం ఏకగ్రీవంగా ఆమోద ముద్ర వేసింది. ఏటా మంజూరు చేసే గ్రీన్ కార్డుల్లో ఒక్కో దేశానికి 7 శాతం మాత్రమే ఇవ్వాలన్న పరిమితిని ఎత్తి వేస్తూ తీసుకువచ్చిన ఫెయిర్‌నెస్ ఫర్ హై స్కిల్డ్ ఇమి గ్రెంట్స్ యాక్ట్‌ని సెనేట్ ఆమోదించింది.
అమెరికాకు వెళ్లే విదేశీయుల్లో అధిక సంఖ్యలో భారతీయులు ఉండడం, గ్రీన్ కార్డు కోసం భారీ సంఖ్యలో దరఖాస్తు చేసుకోవడంతో వారికి ఏళ్లకి ఏళ్లు ఎదురు చూపులు తప్పడం లేదు. ఇప్పుడు ఈ బిల్లుని కొన్ని సవరణలతో సెనేట్ ఆమోదించడంతో ఇది తిరిగి ప్రతినిధుల సభలో ఆమోదం పొందాల్సి ఉంది. ప్రతినిధుల సభ కూడా ఆమోదించాక అధ్యక్షుడు సంతకం చేస్తే చట్ట రూపం దాలుస్తుంది. అమెరికాలో ఏటా లక్షా 40 వేల మందికి గ్రీన్ కార్డులు జారీ చేస్తారు. ఏప్రిల్ నాటికి గ్రీన్‌కార్డు కోసం ఎదురు చూస్తున్న భారతీయులు 8 లక్షల మందికి పైనే.
చైనాకు ఎదురు దెబ్బ తగిలేలా సవరణలు
గత ఏడాది జూలై 10న ఎస్386 బిల్లుని హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఆమోదించింది. అయితే ప్రతినిధుల సభ ఆమోదించిన బిల్లుకు చైనా మిలటరీతోనూ, కమ్యూనిస్టు పార్టీకి చెందిన వ్యక్తుల్ని ఈ చట్టం నుంచి మినహాయిస్తూ సవరణలు చేసి సెనేట్ ఆమోద ముద్ర వేసింది. ఈ సవరణలు చైనా నుంచి వచ్చిన వారికి ప్రతికూలంగా మారాయి. అమెరికాకు వచ్చిన చైనా విద్యార్థుల్లో అత్యధికులు కమ్యూనిస్టు పార్టీకి అనుబంధంగా పని చేసేవారే. అందుకే ప్రతినిధుల సభ ఈ బిల్లుని ఆమోదిస్తుందా అన్నది వేచి చూడాల్సిందేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment