అమెరికాలోని మేరీల్యాండ్ ప్రాంతం.. నవంబర్ 29 ఆదివారం.. సమయం రాత్రి 10 గంటలు.. ఒక అపార్ట్‌మెంట్‌లో హన్నా వివేరెట్ అనే మహిళ తన ఇంట్లో సీరియస్‌గా డ్యాన్స్ చేస్తూ వీడియో తీసుకుంటూ ఎంజాయ్ మూడ్‌లో ఉంది. ఇంతలో ముందు రూమ్‌లో ఎవరో డోర్ తీసినట్లు అలికిడి వినిపించింది.వెంటనే హన్నా తాను ఉన్న రూమ్ డోర్ ఓపెన్ చేసి చూడగానే.. ఎదురుగా ఒక మనిషి చేతులను జేబులో పెట్టుకొని కోపంగా చూస్తూ నిలబడ్డాడు.
అంతే ఒక్కసారిగా షాక్‌కు గురైన హన్నా భయాందోళనతో మ్యూజిక్ ఆఫ్ చేసి.. ఏయ్ ఎవరు నువ్వు.. లోపలికి ఎందుకొచ్చావు.. బయటికి వెళ్లిపో అంటూ గట్టిగట్టిగా అరిచింది. అయినా ఆ మనిషి ఆమెను పట్టించుకోకుండా లోపలికి రావడానికి ప్రయత్నించాడు. దీంతో అప్రమత్తమైన హన్నా తననేం చేయొద్దు అని గట్టిగట్టిగా అరుస్తూ చేతికందినదాన్ని అతని మీదకు విసరడంతో అతను అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత హన్నా 911 నెంబర్‌కు కాల్ చేసి పోలీసులకు విషయాన్ని చెప్పింది. పోలీసులు అక్కడికి చేరుకొని మహిళ చెప్పిన ఆధారాల ప్రకారం నిందితుడిని అదుపులోకి తీసుకొని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇదీ ఇక్కడ జరిగిన విషయం. అసలు ఆ వ్యక్తి ఎవరు.. తన ఇంటికి ఎందుకు వచ్చాడనేది హన్నానే స్వయంగా వీడియోనూ షేర్ చేస్తూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో చెప్పుకొచ్చారు.
'నా జీవితంలో ఇది మరిచిపోలేని రోజు. ఈరోజు నా ఇంటికి వచ్చిన వ్యక్తిని మా పక్క వీదిలో చాలా సార్లు చూశాను. అతని పేరు ఏంజెల్ మోసెస్ రోడ్రిగేజ్. అతని ముఖం నాకు బాగా గుర్తు. నన్ను తరచుగా ఫాలో అయ్యేవాడు. కానీ నాకున్న భయంతో ఒక్కసారి కూడా అతన్ని... ఎవరు నువ్వు అని ఎదురు ప్రశ్నించలేదు. కొన్నిసార్లు నా పక్కనుంచే వెళుతూ నన్ను ఇబ్బందులకు గురి చేసేవాడు. ఇదే విషయమై పోలీసులకు చెప్పాలని భావించాను.. కానీ అతను మళ్లీ నాకు కనిపించకపోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడని అనుకున్నా. కానీ ఇలా మా ఇంట్లో ప్రత్యక్షమవుతాడని మాత్రం ఊహించలేదు. కచ్చితంగా అతను నన్ను ఏదైనా చేసే ఉద్దేశంతోనే వచ్చాడని భావించా.
అంతేకాదు.. అతను వెళ్తూ స్పానిష్ భాషలో ఎవరికి ఏదో చెబుతున్నట్లుగా అనిపించింది. నాకు తెలిసి అతనితో పాటు తన స్నేహితులు కూడా వచ్చి ఉంటారు. ఆ అగంతకుడు ఇంట్లోకి ప్రవేశించే ముందు ముఖం కనిపించకుండా ఉండేందుకు డోర్ ముందు ఉన్న క్రిస్టమస్ లైటింగ్ వైర్‌ను తెంచేశాడు. కానీ రూమ్‌లో ఉన్న వెలుతురుకు అతని ముఖం స్పష్టంగా కనపడింది. దీంతో 911కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశానంటూ' చెప్పుకొచ్చింది. ప్రస్తుతం హన్నా వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరోపక్క అనుమతి లేకుండా ఇంట్లోకి ప్రవేశించడమే కాకుండా ఇంటి వస్తువులను నాశనం చేసినందుకు ఏంజెల్‌పై పోలీసులు థర్డ్‌డిగ్రీ ఉపయోగించారు.
Comments
Please login to add a commentAdd a comment