వివాదాస్పద ఆదేశాలిస్తే ఏం చేయాలన్న దానిపై చర్చ
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ఎన్నికయ్యారు. దీంతో అమెరికా రక్షణ శాఖలో కొత్త పరిణామాలు సంభవించబోతున్నాయి. విదేశాల నుంచి సామూహిక వలసలను కఠినంగా అణచివేస్తానని, అక్రమ వలసదార్లపై కచ్చితంగా చర్యలుంటాయని ఎన్నికల ప్రచారంలో ట్రంప్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. వలసలను కట్టడి చేయడానికి సైనిక దళాల సేవలు వాడుకుంటామని చెప్పారు.
దేశంలో తన వ్యతిరేక గళాలపైనా ఆయన విరుచుకుపడే అవకాశం కనిపిస్తోంది. ప్రత్యర్థులకు వేధింపులు తప్పవన్న ప్రచారం సాగుతోంది. దేశంలో చట్టాల పటిష్ట అమలుకు యాక్టివ్–డ్యూటీ దళాలను రంగంలోకి దించుతానని ట్రంప్ చెప్పారు. సైన్యంలో తిష్టవేసిన అవినీతిపరులను ఏరిపారేస్తానని ప్రకటించారు. తన ప్రభుత్వంలో విధే యులకు ప్రాధాన్యం ఇస్తానని అన్నారు. సొ ంత ఇంటి(స్వదేశం) లోని శత్రువులపైకి సైన్యాన్ని పంపిస్తానని చెప్పారు. మరోవైపు తన అవసరాల కోసం సైన్యాన్ని వాడుకోవడంలోనూ ఆయన సిద్ధహస్తుడే. ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడైనప్పుడు ఆయన దుందుడుకు చర్యలను సైనికాధికారులు తీవ్రంగా వ్యతిరేకించారు.
ఫలితంగా వారితో ఆయనకు విభేదాలు ఏర్పడ్డాయి. ఉన్నత స్థానాల్లో ఉన్న కొందరు సైనిక జనరల్స్ బలహీనులు, అసమర్థులు అని ట్రంప్ విమర్శించారు. ఇప్పుడు మరోసారి అధ్యక్షుడిగా ఎన్నిక కావడంతో ఆయన తీరుపై అమెరికా సైన్యంలో చర్చ మొదలైంది. ఒకవేళ ట్రంప్ వివాదాస్పద ఆదేశాలు ఇస్తే ఏం చేయాలి? ఎలా ప్రతిస్పందించాలన్న దానిపై ఇటీవల పెంటగాన్ అధికారులు సమావేశమైన చర్చించుకున్నట్లు తెలిసింది. ఈ భేటీ అనధికారికంగానే జరిగింది. ట్రంప్ ఆదేశాలు అమెరికా ప్రయోజనాలను దెబ్బతీసేలా ఉంటే సున్నితంగా తిరస్కరించడమే మేలని కొందరు అభిప్రాయపడినట్లు సమాచారం. ట్రంప్ మళ్లీ ఎన్నిక కావడం సైన్యంలో చాలామందికి ఇష్టం లేనట్లు తెలుస్తోంది.
చట్టానికే విధేయులం..
అమెరికా అధ్యక్షుడంటే సమస్త సైనిక దళాలకు సుప్రీం కమాండర్. ఆయన ఆదేశాలను అధికారులు అమలు చేయాల్సి ఉంటుంది. కానీ, ట్రంప్‌పై సైన్యంలో స్పష్టమైన విముఖత కనిపిస్తోంది. ట్రంప్ వర్సెస్ అమెరికా మిలటరీ అన్నట్లుగా పరిస్థితి నెలకొంది. ట్రంప్‌తో సైన్యానికి ఉన్న గత అనుభవాలే ఇందుకు కారణం. ఆయన మళ్లీ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత రక్షణశాఖను ప్రక్షాళన చేస్తారని అంచనా వేస్తున్నారు. తన విధేయులకు పెద్దపీట వేయడంతోపాటు తనను వ్యతిరేకించేవారిని లూప్‌లైన్‌లోకి పంపిస్తారని చెబుతున్నారు. అన్ని రకాల ప్రతికూల పరిణామాలకు సిద్ధమవుతున్నామని ట్రంప్ వ్యతిరేక అధికారులు కొందరు వ్యాఖ్యానించారు. అధ్యక్షుడి హోదాలో ఆయన చట్టవిరుద్ధమైన ఆదేశాలు ఇస్తే వ్యతిరేకిస్తామని, ఎదురు తిరుగుతామని కొందరు పేర్కొంటున్నారు. తాము కేవలం చట్టానికి మాత్రమే విధేయులమని, ట్రంప్‌నకు గానీ, ఆయన ఇచ్చే చట్టవిరుద్ధ ఆదేశాలకు గానీ కాదని ఓ అధికారి స్పష్టంచేశారు.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment