ఇస్తాంబుల్: టర్కీ, గ్రీస్ దేశాల్లో శుక్రవారం సంభవించిన భారీ భూకంపం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. టర్కీ పశ్చిమ తీరం, గ్రీస్ ద్వీపం సామోస్‌ల మధ్య ఏజియన్ సముద్రంలో సంభవించిన పెను భూకంపం ధాటికి రెండు దేశాల్లోని తీర ప్రాంత నగరాలు, పట్టణాలు చిగురుటాకుల్లా వణికాయి. ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు పెట్టారు. భారీగా దూసుకొచ్చిన రాకాసి అలలు తీరప్రాంతాలను ముంచెత్తాయి. ఇక్కడి విషాదాన్ని కళ్లకి కట్టే వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ‘ప్రే ఫర్ టర్కీ’ పేరుతో పోస్ట్ చేసిన ఈ వీడియోలు అక్కడి విధ్వంసాన్ని కళ్లకి కడుతున్నాయి. ఇక టర్కీ ఏజీయన్ సిటీ ఇజ్మీర్‌లో అపార నష్టం వాటిల్లింది. ఇక్కడ సుమారు 30 లక్షల మంది నివాసం ఉంటున్నారు. ఈ నగరం ఎత్తైన అపార్ట్‌మెంట్లను కలిగి ఉంది.
ఓ సీసీటీవీ వీడియోలో భూకంపం ధాటికి ఓ రెస్టారెంట్ కిచెన్ కంపించడం.. సిబ్బంది భయంతో బయటకు పరుగులు తీయడం చూడవచ్చు. అలానే ఇజ్మీర్ సమీపంలోని ఒక పట్టణంలోకి సముద్రపు ఉప్పెన నీరు దూసుకువచ్చింది. వీధులన్ని జలమయమయ్యాయి. బహుళ అంతస్థుల భవనాలు క్షణాల్లో కుప్పకూలిపోయాయి. ఆ ప్రాంతాల్లో దటమైన తెల్లటి పొగ రావడం వీడియోలో చూడవచ్చు. ఈ భూకంపం కారణంగా టర్కీ, గ్రీస్‌ల్లో మొత్తం 14 మంది మరణించారు. టర్కీలో 12 మంది చనిపోయారని, అందులో ఒకరు నీళ్లలో మునిగి చనిపోయారని, 419 మంది గాయపడ్డారని అధికారులు ప్రకటించారు. సామోస్ ద్వీపంలో గోడ కూలి ఒక యువతి, ఒక యువకుడు చనిపోయారని అధికారులు వెల్లడించారు. (చదవండి: టర్కీ, గ్రీస్‌లో భారీ భూకంపం)
ఇక ప్రపంచవ్యాప్తంగా తీవ్ర నష్టం కలిగించిన భూకంపాల్లో కొన్ని టర్కీ, గ్రీస్‌లో సంభవించాయి. వీటిలో 1999లో 7.4 తీవ్రతతో టర్కీ వాయువ్య దిశలో సంభవించిన భూకంపం ఒకటి. ఈ ఘటనలో ఇస్తాంబుల్‌లో 1000 మంది సహా 17 వేల మందికి పైగా మరణించారు. గ్రీస్‌లో 2017లో భయంకరమైన భూకంపం నమోదయ్యింది. సమోస్ సమీపంలో సంభవించిన ఈ భూకంపంలో ఇద్దరు మరణించారు.
Comments
Please login to add a commentAdd a comment