వసతులు లేని కాటేజ్‌.. ఆ ప్రత్యేకత ఉందని కోట్లు పలుకుతోంది! | Viral: Off Grid Cottage No Electricity Water Supply Internet Goes On Sale For Rs 5 Crore | Sakshi
Sakshi News home page

వసతులు లేని కాటేజ్‌.. ఆ ప్రత్యేకత ఉందని కోట్లు పలుకుతోంది!

Published Sun, Sep 5 2021 7:20 PM | Last Updated on Sun, Sep 5 2021 7:59 PM

Viral: Off Grid Cottage No Electricity Water Supply Internet Goes On Sale For Rs 5 Crore - Sakshi

ఇల్లు కొనే ముందు కనీస సౌకర్యాలు ఉన్నాయా లేదా అని చూసి కాస్త ఎక్కువైనా కొంటాం. అదే వసతులు సరిగా లేకపోతే ధర తక్కువ ఉన్నా అటు వైపు కన్నెత్తి కూడా చూడం. అయితే వసతులు లేని ఓ కాటేజ్‌ మాత్రం భారీగా ధర పలుకుతోందట. ఎందుకో ఓ సారి చూసేద్దాం. వివరాల్లో​కి వెళితే.. బ్రిటన్‌లోని డేవాన్‌ సముద్రం ఒడ్డున ఈ ఆఫ్‌ గ్రిడ్‌ హౌస్‌ ఉంది. ఈ కాటేజ్‌కు కరెంట్‌ లేదు. నీటి సరఫరా లేదు. ఇంటర్నెట్‌ కూడా ఉండదు.

అయినప్పటికీ దాని ధర మాత్రం రూ.5.56 కోట్లట. అదేంటి కనీస వసతులు ఏవీ లేకపోయినా ఇంత రేటు ఎందుకు అనుకుంటున్నారా? దీనికి ఓ ప్రత్యేకత ఉంది. అదేంటంటే.. నీలి సముద్రం కొండపై ఉన్న కుటీరానికి కొన్ని అడుగుల దూరంలో ఉంది. ప్రకృతి ప్రేమికులకు ఈ ఇల్లు ఎంతగానో నచ్చుతుంది. ఈ కాటేజ్‌ నేషనల్‌ ట్రస్ట్‌ యాజమాన్యంలోని మన్సాండ్ బీచ్‌పైన ఉన్న రిమోట్‌ గేట్‌అవేలో ఉంది. ప్రకృతితో మమేకమై ప్రశాంతమైన జీవనాన్ని గడపాలనుకునే వారికి ఈ కాటేజ్‌ ఎంతగానో ఆకట్టుకుంటుంది.

అందుకే అంత పెద్ద మొత్తంలో వెచ్చించి ఆ కాటేజ్‌ను కొనుగోలు చేయడానికి ముందుకొస్తున్నారంట. ఈ కాటేజ్‌లో రెండు పెద్ద బెడ్‌ రూమ్‌లు, పైన గడ్డితో చేసిన గది ఉంది. ఇందులో లాంజ్‌, డైనింగ్‌ రూం, ఫ్రంట్‌ అండ్ బ్యాక్‌ వరండా, రెండు గెస్ట్‌ బెడ్‌రూంలు, పవర్‌రూం, వంట గది ఉందంట. దీనిని 1,345 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. వర్షపు నీటిని నిల్వ చేసి తాగునీటిగా మార్చే సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ కాటేజ్‌కు వెళ్లేందుకు బీచ్‌ నుంచి రోడ్డు ఉందని, కారు పార్కింగ్‌ నుంచి 15 నిమిషాల్లో నడిచి చేరుకోవచ్చునని దీని ఆస్తి విక్రేత మిచెల్‌ స్టీవెన్స్‌ తెలిపారు.

చదవండి: ఇడ్లీ, దోశ పిండితో మొదలెట్టి.. వేల కోట్ల కంపెనీకి సీఈఓ


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement