రష్యాది ఉగ్రవాదమంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ తూర్పారబట్టారు. నానాటికీ పాశవికంగా ప్రవర్తిస్తోందని, యుద్ధోన్మాదంతో పేట్రేగిపోతోందని దుయ్యబట్టారు. ఖర్కీవ్‌లో సెంట్రల్ ఫ్రీడం స్క్వేర్ భవనంపై మిసైల్ దాడి చేసిన తీరు యుద్ధం నేరానికి ఏమాత్రం తీసిపోదన్నారు. రష్యా పైశాచికత్వాన్ని ‘‘ఎవరూ మర్చిపోలేరు. ఎవరూ క్షమించబోరు’’ అన్నారు. తర్వాత యూరోపియన్ పార్లమెంటును ఉద్దేశించి ఆయన భావోద్వేగపూరితంగా మాట్లాడారు.
‘‘మేం శాయశక్తులా పోరాడుతున్నాం. ఈ పోరాట పటిమ ద్వారా మేమేంటో అందరికీ చూపిస్తున్నాం. తోటి యూరప్ దేశాలతో సమానులుగా నిలవాలన్నది మా ఉద్దేశం. మడమ తిప్పని పోరాటంతో దాన్నిప్పటికే రుజువు చేసుకున్నామని భావిస్తున్నాం’’ అన్నారు. ఇప్పటికైనా పోరాటంలో తమతో మరింతగా కలిసి రావాలని యూరప్ దేశాలకు విజ్ఞప్తి చేశారు.
ఈయూలో చేర్చుకోవాలన్న తమ విజ్ఞప్తిపై తక్షణం నిర్ణయం తీసుకోవాలని కోరారు. చర్చల్లో ఏ విషయంలోనూ తాము వెనక్కు తగ్గబోమని స్పష్టం చేశారు. ఒకవైపు ప్రాణాంతక ఆయుధాలతో యుద్ధానికి దిగి, మరోవైపు సర్దుకుపొమ్మనడం ఏం న్యాయమని ప్రశ్నించారు.
తగ్గేదే లేదు: రష్యా
ప్రపంచమంతా దుమ్మెత్తిపోస్తున్నా రష్యా మాత్రం తగ్గేదే లేదంటోంది. తమ లక్ష్యాలను సాధించేదాకా వెనకడుగు వేసేది లేదని రష్యా రక్షణ మంత్రి మంగళవారం పునరుద్ఘాటించారు. యూరప్ తమపై ఆర్థిక యుద్ధానికి దిగుతోందని ఆంక్షలనుద్దేశించి ఆయన దుయ్యబట్టారు. అది నిజమైన యుద్ధంగా మారినా ఆశ్చర్యం లేదంటూ వాటిని హెచ్చరించారు.
విధ్వంసం మధ్యే సేవలు...
చుట్టూ బాంబులు, క్షిపణుల మోతలు హోరెత్తిపోతున్నా ఉక్రెయిన్ వైద్య సిబ్బంది మాత్రం వెరుపు లేకుండా విధులు నిర్వర్తిస్తున్నారు. ఖర్కీవ్‌లోని ఓ ఆస్పత్రిలో ప్రసూతి వార్డును తాత్కాలికంగా బాంబ్‌షెల్టర్‌గా మార్చారు. గర్భిణులను, నవజాత శిశువులను జాగ్రత్తగా అందులోకి చేర్చి కంటికి రెప్పలా చూసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment