మంటలు పుట్టిస్తాయ్
లిథియం-అయాన్ బ్యాటరీలతో జాగ్రత్త
ఉప్పునీటి ముంపుతో విద్యుత్ షార్ట్ సర్క్యూట్లు
హరికేన్ ‘మిల్టన్’తో మరో ముప్పు
“టిక్.. టిక్.. టిక్..” అంటూ నిశ్శబ్దంగా ఆడుతున్న టైంబాంబులు అవి! ఆదమరిస్తే ఏ క్షణమైనా అంటుకోవచ్చు. కన్ను మూసి తెరిచేంతలో ఉవ్వెత్తున మంటలు చెలరేగవచ్చు. విధ్వంసం సృష్టించవచ్చు. ప్రాణాలు తీయవచ్చు. ఆస్తినష్టం కలిగించవచ్చు. ఇంతకీ ఏమిటవి అంటారా? కాలుష్యం కలిగించకుండా పర్యావరణానికి ఎంతో మేలు చేస్తున్నాయని మనం ఎంతో గొప్పగా చెబుతున్న ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీ). అమెరికాలో తాజాగా విరుచుకుపడుతున్న హరికేన్ ‘మిల్టన్’ మరో ఉపద్రవాన్ని మోసుకొస్తోంది. ఈవీలు, హైబ్రిడ్ వాహనాలు వంటి రీఛార్జి బ్యాటరీ ఆధారిత ఇంధనాన్ని వాడే వస్తువాహనాలతో ప్రస్తుతం అమెరికన్లకు ముప్పు పొంచివుంది.
ఇదంతా వాటిలోని లిథియం-అయాన్ బ్యాటరీలతోనే. ఎలక్ట్రిక్ కార్లు మాత్రమే కాకుండా రీఛార్జి బ్యాటరీల శక్తితో పనిచేసే స్కూటర్లు, బైకులు, హోవర్ బోర్డులు, వీల్ ఛైర్లు, లాన్ మూవర్స్, గోల్ఫ్ కార్లు, బొమ్మలతోనూ ఇకపై అప్రమత్తంగా మెలగక తప్పదు. హరికేన్ ‘మిల్టన్’ ఉప్పునీటి వరద ముంపు బారినపడిన ఈవీలను అగ్నికీలలు చుట్టుముట్టే అవకాశముంది. హరికేన్ల ప్రభావంతో 15 అడుగుల లోతుతో ఉప్పునీటి వరద నీరు చేరుకునే తీరప్రాంతాలు అమెరికాలో చాలా ఉన్నాయి.
కొద్ది రోజుల క్రితం హరికేన్ ‘హెలెన్’ వచ్చిపోయాక అమెరికాలో పలు చోట్ల లిథియం-అయాన్ బ్యాటరీలు వేడెక్కి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ల కారణంగా 48 ఎలక్ట్రిక్ వస్తువాహనాలు మంటల్లో కాలి బూడిదయ్యాయి. ఫ్లోరిడాలోని ఓ ఇంటి గ్యారేజీలో నిలిపివుంచిన టెస్లా కారు ఇటీవలి ‘హెలెన్’ ప్రభావపు ఉప్పునీటి ముంపు కారణంగా మంటల్లో ఆహుతి కావటంతో ఆ ఇంట్లోని వారు భయంతో బయటకు పరుగులు తీశారు. గతంలో 2022లో సంభవించిన హరికేన్ ‘ఇయాన్’ సందర్భంగానూ అమెరికాలో పలు ఈవీలు అగ్నికి ఆహుతయ్యాయి.
తొలుత వేడి... తర్వాత మంటలు!
ఈవీల్లో లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ లోపల సెల్స్, జ్వలించే స్వభావం గల విద్యుద్వాహక ద్రావణి ఉంటాయి. ఉప్పునీరు విద్యుద్వాహకం. ఈ-బైకులతో పోలిస్తే ఎలక్ట్రిక్ వాహనాలు లేదా ప్లగ్-ఇన్ హైబ్రిడ్ వాహనాల్లో వెయ్యి రెట్లు ఎక్కువగా సెల్స్ (చిన్న ఘటాలు) ఉంటాయి. ఎక్కువ సెల్స్ ఉండే హై ఎనర్జీ బ్యాటరీలు విఫలమయ్యే అవకాశాలు మరింత అధికం. సాధారణ వర్షపు నీటితో లేదా నదుల మంచినీటితో తలెత్తే ముంపుతో ఈవీలకు పెద్దగా నష్టం ఉండదు. కానీ ఎక్కువ కాలం... అంటే కొన్ని గంటలు లేదా ఒకట్రెండు రోజులపాటు ఉప్పునీటిలో వాహనాలు మునిగితే మాత్రం ఉప్పు వల్ల ఈవీ ‘బ్యాటరీ ప్యాక్’ దెబ్బతింటుంది.
ఉప్పునీటికి ‘తినివేసే’ (కరోజన్) లక్షణం ఉంది. బ్యాటరీ లోపలికి ఉప్పునీరు చేరాక విద్యుద్ఘటాల్లోని ధనాత్మక, రుణాత్మక టెర్మినల్స్ మధ్య కరెంటు ప్రవహించి షార్ట్ సర్క్యూట్లు సంభవిస్తాయి. ఫలితంగా వేడి పుడుతుంది. విద్యుద్ఘటాలను వేరు చేసే ప్లాస్టిక్ లైనింగ్ ఈ వేడికి కరిగిపోతుంది. దాంతో వేడి ఓ శృంఖల చర్యలాగా (థర్మల్ రన్ అవే) ఒక విద్యుద్ఘటం నుంచి మరో విద్యుద్ఘటానికి ప్రసరించి మరిన్ని షార్ట్ సర్క్యూట్లతో విపరీతంగా వేడిని పుట్టిస్తుంది. అలా చివరికి అగ్గి రాజుకుని వాహనాలు బుగ్గి అవుతాయి.
ఎత్తైన ప్రదేశాలకు తరలించాలి
హరికేన్లు తీరం దాటడానికి మునుపే ప్రజలు అప్రమత్తమై తమ ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈవీలు తుపాన్ల ఉప్పునీటిలో తడవకుండా, వరద ముంపులో నానకుండా వాటిని ఎత్తైన, సురక్షిత ప్రదేశాల్లో భద్రంగా పార్క్ చేయాలి. ఇంటికి కనీసం 50 అడుగుల దూరం అవతల వాటిని పార్క్ చేయడం వల్ల రిస్క్ తగ్గుతుంది. తుపాన్లు/హరికేన్లు దాటిపోయాక రీ-స్టార్ట్ చేయడానికి ముందు బ్యాటరీ వాహనాలను ఖాళీ ప్రదేశాలకు తరలించాలి.
వాటిని మెకానిక్ సాయంతో అన్ని రకాలుగా పరీక్షించాకే పునర్వినియోగంలోకి తేవాలి. వరద నీటిలో మునిగిన వాహనాలను పరీక్షించకుండా నేరుగా కరెంటు ప్లగ్గులో వైరు పెట్టి వాటిని రీఛార్జి చేయడానికి ఉపక్రమించరాదు. ఆ వాహనాలను ఇళ్లలోనే ఉంచి రీ-స్టార్ట్ చేస్తే లిథియం-అయాన్ బ్యాటరీలు వేడెక్కి, మంటలు అంటుకుని గృహాలు సైతం అగ్నిప్రమాదాల బారినపడవచ్చు. హరికేన్ ‘మిల్టన్’ నేపథ్యంలో ఈవీల వినియోగదారులకు పలు హెచ్చరికలు చేస్తూ ఫ్లోరిడా ఫైర్ మార్షల్ జిమ్మీ పాట్రోనిస్ ఓ ప్రకటన విడుదల చేశారు.
- జమ్ముల శ్రీకాంత్
(Courtesy: The New York Times, The Washington Post, CBS News, Business Insider)
Comments
Please login to add a commentAdd a comment