యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా లెయెన్
బ్రసెల్స్: రష్యాపై ఆంక్షలకు కొనసాగింపుగా యూరోపియన్ యూనియన్ కీలక నిర్ణయం తీసుకుంది. రష్యా నుంచి చమురు దిగుమతులను వచ్చే ఆర్నెల్లలో ఏకంగా 90 శాతం తగ్గించుకునేందుకు యూరప్ దేశాలన్నీ అంగీకరించాయి. మంగళవారం జరిగిన ఈయూ కీలక భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి. ఇతర సరఫరా మార్గాలను వెదుక్కోవడం, వీలైనంత త్వరగా సంప్రదాయేతర ఇంధన వనరులకు మళ్లడం తదితరాల ద్వారా కొరతను అధిగమించాలని నిర్ణయించాయి.
ఈ నిర్ణయంతో రష్యా నుంచి సముద్ర మార్గాన జరిగే యూరప్‌కు ఇంధన సరఫరా పూర్తిగా నిలిచిపోనుంది. హంగరీ వంటి మధ్య, తూర్పు యూరప్ దేశాలకు పైప్‌లైన్ ద్వారా జరుగుతున్న సరఫరాలు మాత్రం కొనసాగుతాయి. తాజా నిర్ణయానికి ఈయూ త్వరలో తుది రూపు ఇవ్వనుంది. దీంతోపాటు రష్యాలోని మరో అతి పెద్ద బ్యాంకుపైనా, ఆ దేశ మీడియాపైనా ఈయూ ఆంక్షలు విధించింది.
యూరప్ తన చమురు అవసరాల్లో 25 శాతం, గ్యాస్ అవసరాల్లో ఏకంగా 40 శాతం రష్యాపైనే ఆధారపడ్డ విషయం తెలిసిందే. అందుకే ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి దిగినప్పటి నుంచీ ఆ దేశం నుంచి చమురు, గ్యాస్ దిగుమతుల్ని పూర్తిగా నిలిపేయాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నా చాలా యూరప్ దేశాలు సమ్మతించలేదు. ఈ నేపథ్యంలో తాజా నిర్ణయం విశేషమనే చెప్పాలి.
అయితే తమ ఇంధన భద్రతకు హామీ ఇస్తేనే నిషేధానికి మద్దతిస్తామని రష్యా నుంచి 60 శాతానికి పైగా చమురు దిగుమతి చేసుకుంటున్న హంగరీ ప్రకటించింది. ఈయూ నిర్ణయాన్ని రష్యా తేలిగ్గా తీసుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు డిమాండ్‌కు కొదవ లేదని, ఇతర దిగుమతిదారులను చూసుకుంటామని చెప్పింది. బల్గేరియా, పోలండ్, ఫిన్లండ్‌లకు చమురు ఎగుమతులను రష్యా ఇప్పటికే నిలిపేసింది.
డెన్మార్క్‌కు కూడా మంగళవారం నుంచి సరఫరాలు ఆపేస్తున్నట్టు రష్యా ప్రభుత్వ రంగ ఇంధన దిగ్గజం గజ్‌ప్రోమ్ ప్రకటించింది. తమ పట్ల విద్వేషమే ఏకైక ప్రాతిపదికగా ఈయూ ఈ నిర్ణయం తీసుకుందని రష్యా మాజీ అధ్యక్షుడు మెద్వదెవ్ దుయ్యబట్టారు. మరోవైపు ఉక్రెయిన్ నుంచి ఆహార ఎగుమతులు ఆగిపోవడంపై ఆఫ్రికన్ యూనియన్ ఆందోళన వెలిబుచ్చింది. ఆఫ్రికా దేశాలు తీవ్ర కొరతతో అల్లాడుతున్నాయని యూనియన్ చీఫ్, సెనెగల్ అధ్యక్షుడు మెకీ సల్ చెప్పారు. పశ్చిమ దేశాల మొండి వైఖరే ఇందుకు కారణమని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఆరోపించారు. ఉక్రెయిన్ తన తీర జలాలను మందుపాతరలతో నింపేసిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment