అగ్రరాజ్యం అమెరికాలో మరో తెలుగమ్మాయి ఉషా చిలుకూరి అరుదైన ఘనతను సాధించనున్నారు. ఈ ఏడాది నవంబర్‌లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలకు రిపబ్లికన్, డెమోక్రటిక్‌లు తలపడనున్నాయి. ఈ తరుణంలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా ట్రంప్ ఖారారు కాగా..వైస్ ప్రెసిడెంట్ అభ్యర్ధిగా ఒహాయో రిపబ్లికన్ సెనేటర్, తెలుగింటి అల్లుడు జేడీ వాన్స్ ఎంపికయ్యారు.
మిల్వాకీలో రిపబ్లికన్ పార్టీ ఆఫీస్ వేదికగా ట్రంప్ రిపబ్లికన్ వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్‌గా జేడీ వాన్స్‌ను ప్రకటించారు.జేడీ వాన్స్ భార్యే ఉషా చిలుకూరి వాన్స్. ఈ ఎన్నికల్లో వాన్స్ గెలిస్తే అమెరికాకి ఉషా చిలుకూరి సెకండ్ లేడీ (రెండో మహిళ)గా చరిత్ర సృష్టించనున్నారు. ఈ సందర్భంగా ఉషా చిలుకూరి ఎవరు? ఆమె తల్లిదండ్రులు, భర్త జేడీ వాన్స్ ఎవరు? అనే వివరాల గురించి నెటిజన్లు ఆరా తీస్తున్నారు.
ఎవరీ ఉషా చిలుకూరి?
న్యూయార్క్ టైమ్స్ ప్రకారం..అమెరికాలో స్థిరపడ్డ భారత సంతతికి చెందిన న్యాయవాది ఉషా చిలుకూరి. ఆమె తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఉమ్మడి కృష్ణా జిల్లాలోని పామర్రు వద్ద ఉన్న చిన్న గ్రామమని తెలుస్తోంది. సుధీర్ఘకాలం క్రితం ఆంధ్రప్రదేశ్ నుంచి అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రానికి వెళ్లారు. ఉషా శాన్ డియాగో,కాలిఫోర్నియాలో పెరిగారు.
ఉషా చిలుకూరి ఏం చదువుకున్నారు?
ఉషా చిలుకూరి శాన్ డియాగో, కాలిఫోర్నియాలో విద్యాభ్యాసం పూర్తి చేశారు.ఆమె లింక్డిన్ ప్రొఫైల్ ప్రకారం రాంచో పెనాస్క్విటోస్‌లోని మౌంట్ కార్మెల్ హై స్కూల్‌లో చదివారు.ఆధునిక చరిత్ర ఆమెకు ఇష్టమైన సబ్జెక్ట్. ప్రఖ్యాత యేల్ యూనివర్సిటీలో బీఏ హిస్టరీ పూర్తి చేశారు.ఆ తర్వాత కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీలో డిగ్రీ చదివారు.
యేల్ యూనివర్సిటీలో చదివే సమయంలో యేలే లా జర్నల్,టెక్నాలజీ విభాగానికి ఎగ్జిక్యూటీవ్ డెవలప్‌మెంట్ ఎడిటర్‌గా, మేనేజింగ్ ఎడిటర్‌గా పనిచేశారు.అదే సమయంలో అమెరికా సుప్రీం కోర్టులో కేసుల్ని ఎలా వాదించాలి? కేసులో ఎలాంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలి?కేసుకు సంబంధించి ఎలాంటి ఆధారాల్ని కోర్టులో సబ్మిట్ చేయాలనే అంశాలపై అమెరికా లా యూనివర్సిటీల్లో అనుభవజ్ఞులైన సుప్రీం కోర్టు లాయర్లతో సుప్రీం కోర్టు అడ్వకేసీ క్లినిక్ అనే కోర్సును అందిస్తాయి. ఆ కోర్స్‌లో మీడియా ఫ్రీడమ్ అండ్ ఇన్ఫర్మేషన్ యాక్సెస్ క్లినిక్ అండ్ ఇరాకీ రెఫ్యూజీ అసిస్టెన్స్ ప్రాజెక్ట్‌పై పని చేశారు.
ప్రేమగా మారి.. పెళ్లి పీటల వరకు
2013లో యేల్ యూనివర్సిటీ లా కాలేజీలో ఉషా చిలుకూరి జేడీ వాన్స్‌ను తొలిసారి కలుసుకున్నారు. లా కాలేజీలో జరిగిన ‘సోషల్ డిక్లైన్ ఇన్ వైట్ అమెరికా’ అనే సబ్జెట్‌పై జరిగిన డిస్కషన్ గ్రూప్‌లో ఉషా, వాన్స్‌లు కలిసి పనిచేసినట్లు న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. అప్పుడే వారి పరిచయం ప్రేమగా మారింది. ఇరుకుటుంబసభ్యుల అంగీకారంతో ఉషా చిలుకూరి, జేడీ వాన్స్‌లు ఒక్కటయ్యారు. వారిద్దరి పెళ్లి హిందూ సంప్రదాయ పద్దతిలో జరిగింది.
జేడీ వాన్స్,ఉష దంపతులకు ముగ్గురు పిల్లలు
జేడీ వాన్స్,ఉష దంపతులకు ముగ్గురు పిల్లలు.ఇవాన్,వివేక్ ఇద్దరు కుమారులు కాగా కుమార్తె మిరాబెల్.
ప్రముఖ న్యాయవాదిగా
కాలికేస్తే మెడకి,మెడకేస్తే కాలికేసే సివిల్ లిటిగేషన్ల పరిష్కారంలో ఆమె దిట్ట. ఉషా 2018లో అమెరికా సుప్రీం కోర్ట్‌కు లా క్లర్క్‌గా పని చేయడం కంటే ముందు 2015 నుండి 2017 వరకు శాన్‌ఫ్రాన్సిస్కో, వాషింగ్టన్ డీసీ ఈలోని ముంగేర్, టోల్లెస్ అండ్ ఓల్సన్ ఎల్‌ఎల్‌పీలో న్యాయవాదిగా పనిచేశారు.
రాజకీయాల్లో జేడీ వాన్స్
వాన్స్ రాజకీయాల కంటే ప్రముఖ వ్యాపార వేత్తగా, ఇన్వెస్టర్‌గా పేరు సంపాదించుకున్నారు. 2016లో రాజకీయాల్లోకి వచ్చిన వాన్స్.. 2022లో ఓహియో నుంచి అమెరికా సెనేట్‌కు ఎన్నికయ్యారు. మొదట్లో ట్రంప్ విధానాలను తీవ్రంగా 2016 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపుపై విమర్శలు గుప్పిస్తూ..ఆయనను ఇడియట్, అమెరికా హిట్లర్ అంటూ విమర్శలు గుప్పించారు. చివరకు ఆయనకు వీరవిధేయుల్లో ఒక్కరిగా మారారు.
పుస్తకం కాస్త.. సినిమాగా
ఇక వాన్స్ తనలోని రాజకీయ నాయకుడితో పాటు మంచి రచయిత ఉన్నాడంటూ ‘హిల్‌బిల్లీ ఎలెజీ’తో నిరూపించారు. హిల్‌బిల్లీ ఎలెజీ పుస్తకం ద్వారా సంక్షోభంలో ఉన్నశ్వేతజాతి అమెరికన్ల సంస్కృతి, ఉద్వేగం, వ్యక్తిగతం ఎలా ఉంటుందో కళ్లకు కట్టినట్లుగా చూపించారు. వాన్స్ తన జ్ఞాపకాలు, జీవితంలో ఎదురైన సంఘటనలు, అనుభవాల్ని వివరించారు. పేదరికం, వ్యసనం, అస్థిరతతో అతని కుటుంబం, పోషణ కోసం పోరాటాలు, చివరికి తన ప్రయాణం ఎలా సాగిందో వివరించారు. ఆ పుస్తకం ఎక్కువగా అమ్ముడు పోవడంతో అది సినిమాగా తెరక్కిక్కింది. 2020లో రాన్ హోవార్డ్ దర్శకత్వం వహించారు.
ట్రంప్‌ను అమెరికా అధ్యక్షుడిని చేసిన వాన్స్
అంతేకాదు ఈ పుస్తకం ట్రంప్ తొలిసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించేందుకు దోహదం చేసింది. ముఖ్యంగా ట్రంప్ ప్రచారంలో తన సందేశాన్ని బలంగా గ్రామీణ ప్రాంతాల్లో పేద తెల్లజాతి, అమెరికా ఉద్యోగుల ఓటర్లను ఆకర్షించేలా, తనవైపుకు తిప్పుకునేందుకు సహకరించింది. మధ్య అమెరికాలో సాంస్కృతిక, ఆర్థిక అంశాలను లోతుగా విశ్లేషించేందుకు ఉపయోగపడింది. కాగా, 2016 ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించడంలో ఈ ఓటర్లే కీలకమయ్యారు. జనవరి 6, 2021లో అమెరికా క్యాపిటల్ భవంతిపై ట్రంప్ మద్దతుదారులు జరిపిన దాడిలో ఈయన కీలక పాత్ర పోషించడం గమనార్హం.
జేడీ వాన్స్ విజయంలో
ఉషా తన భర్త జేడీ వాన్స్ విజయంలో ముఖ్యమైన పాత్ర పోషించారు.తరచూ రాజకీయ కార్యక్రమాలకు అతనికి దిశానిర్ధేశం ఇస్తూ మద్దతుగా నిలిచారు. ఆమె 2016,2022లో సెనేట్ ఎన్నికల్లో విజయం సాధించేలా ప్రచారం చేశారు.
సెనేటర్ అంటే
అమెరికాలో ప్రతినిధుల సభను మన లోక్ సభతో పోల్చుకోవచ్చు. సెనేట్‌ను రాజ్య సభగా చెప్పాలి. ఈ రెండింటిని కలిపి వారు అమెరికన్ కాంగ్రెస్‌గా పిలుచుకుంటారు. ప్రతినిధుల సభ బిల్లులను రూపొందిస్తే ఆ చట్టాలను సెనేట్ ఆమోదించవచ్చు లేదా నిరోధించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment