లండన్: ప్రతిష్టాత్మక వింబుల్డన్ సమీపంలోని ఒక ప్రాధమిక పాఠశాల భవనంలోకి ల్యాండ్ రోవర్ కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఏడుగురు చిన్నారులు, ఇద్దరు పెద్దవారు గాయపడినట్టు చెబుతున్నాయి స్థానిక మెట్రోపాలిటన్ పోలీసు వర్గాలు.
మెట్రోపాలిటన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లండన్లోని వింబుల్డన్ దగ్గర క్యాంపు రోడ్డులోని "ద స్టడీ ప్రిపరేటరీ స్కూలు"లోకి ఒక ల్యాండ్ రోవర్ వేగంగా దూసుకెళ్లింది. ఈ పాఠశాల 4-11 ఏళ్ల లోపు బాలికల కోసం ప్రత్యేకించబడినది. బ్రిటీషు కాలమానం ప్రకారం ఉదయం 10 గంటల ప్రాంతంలో పెద్ద శబ్దం చేసుకుంటూ గోల్డ్ కలర్ కార్ స్కూల్‌లోకి దూసుకుని రావడంతో ఏడుగురు చిన్నారులు, ఇద్దరు పెద్దవారు గాయపడ్డారని తెలిపారు.
ఇది ఉగ్రవాద చర్య కాదని స్పష్టం చేసిన మెట్రోపాలిటన్ పోలీసులు ప్రమాద సమాచారం తెలియగానే సంఘటన స్థలానికి కనీసం 20 ఎమర్జెన్సీ ఎయిర్ అంబులెన్స్ లు చేరుకొని గాయపడిన వారికి తక్షణ చికిత్స అందిస్తున్నారని, ప్రమాదానికి కారణమైన మహిళా డ్రైవరును సంఘటన స్థలంలోనే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని తెలిపారు.
ఈ సంఘటన గురించి తెలియగానే లండన్ అధికారులు, నాయకులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సహాయక బృందాలను అప్రమత్తం చేసి ఎప్పటికప్పుడు బాధితుల క్షేమ సమాచారాన్ని తెలుసుకుంటున్నారు.
ఇది కూడా చదవండి: గమ్యానికి చేరువలో పొరపాటు.. ప్రైజ్ మనీ గోవిందా..
Comments
Please login to add a commentAdd a comment