ఫైల్ ఫోటో
పన్ను నొప్పే కదా అని తేలిగ్గా తీసుకోకండి. పంటిలో ఏర్పడిన చిన్న ఇన్‌ఫెక్షన్‌ను నియంత్రించక పోవడంతో ఒక మహిళ ప్రాణాపాయ స్థితిలో 5 నెలల పాటు ఆసుపత్రిలో గడపాల్సి వచ్చింది. రెండుసార్లు గుండె ఆగిపోయి ప్రాణం పోయినంత పనైంది. దాదాపు 30 కిలోల బరువును కోల్పోయింది. నమ్మలేకపోతున్నారా! ఇది నిజం.
తూర్పు యార్క్‌షైర్‌లోని స్నైత్‌కు చెందిన రెబెక్కా డాల్టన్ (30)కు గత ఏడాది డిసెంబరులో జ్ఞాన దంతంలో చీముగడ్డ ఏర్పడింది. యాంటీబయాటిక్స్ ఇచ్చిన డాక్టరు దాన్ని తొలగించాల్సిన అవసరం ఉందని చెప్పారు. అయితే ఆ సమయంలో ఆమె నిండు గర్భిణీ కావడంతో పట్టించుకోలేదు. దీంతో మార్చి నెలలో మళ్లీ తిరగబెట్టింది. సమస్య తీవ్రమై ఇన్‌ఫెక్షన్ మెదడు దాకా పాకిపోయింది. ఫలితంగా మతిమరుపు సమస్య ఉత్పన్నమైంది. అంతేకాదు నడవడానికి కూడా ఇబ్బంది పడటంతో ఆమె తిరిగి వైద్యులను సంప్రదించారు. దీంతో పరీక్షలు నిర్వహించిన వైద్యులు, మెదడు, గుండె, కాలేయంలో బాక్టీరియా గడ్డలను గుర్తించారు. వెంటనే మెరుగైన చికిత్స కోసం ఆమెకు హల్ రాయల్ వైద్యశాలలోని న్యూరోలాజికల్ విభాగానికి తరలించారు. ఐదు నెలలు ఆసుపత్రిలో చికిత్స తర్వాత, రెబెక్కా కోలుకుని గత వారం డిశ్చార్జ్ అయ్యారు.
ఈ సంఘటన తన జీవితాన్నే మార్చేసిందనీ, 30 ఏళ్ల వయసులో కనీసం టాబ్లెట్ కూడా తీసుకోలేని స్థితిలో ఒకరి మీద ఆధారపడటం తనను షాక్‌కు గురిచేసిందని రెబెక్కా తన బాధలను గుర్తు చేసుకున్నారు. 30 కిలోల కంటే ఎక్కువ బరువు కోల్పోయాననీ, ఇప్పటికీ తన పని తాను చేసుకోలేకపోతున్నానని వాపోయారు. ఈ ఉదంతం జీవితంపై తన దృక్పథాన్నే మార్చేసిందని చెప్పుకొచ్చారు. సో... బీకేర్‌ఫుల్. యాంటిబయోటిక్స్ వాడాం కదా..నొప్పి పోయిందిలే అనే నిర్లక్ష్యం అసలు వద్దు..ఎందుకంటే చాలాసార్లు పరిస్థితి చేయిదాటి పోయేంతవరకు ప్రమాదాన్ని గుర్తించలేని పరిస్థితి రావచ్చు. అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. మరోవైపు ఆమెకు కచ్చితంగా కరోనా వస్తుందని భయపడిపోయానని రెబెక్కా తల్లి తెలిపారు. అదృష్టవశాత్తూ కోవిడ్-19 పరీక్షల్లో నెగిటివ్ రావడం సంతోషం కలిగించిందన్నారు.
కాగా గతంలో యుకెకు చెందిన ఆడమ్ మార్టిన్ కూడా దాదాపు ఇదే సమస్యతో ప్రాణాపాయం నుంచి బైటపడ్డారు. పళ్లలో పాప్ కార్న్ ఇరుక్కోవడంతో అది గమ్ ఇన్ఫెక్షన్‌కు దారి తీసింది. అది కాస్తా దంతాల నుంచి గుండె వరకు వ్యాపించడంతో వైద్యులు ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి గుండెల్లో ఒక కవాటాన్ని తొలగించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment