సనా: యెమెన్ దేశంలో పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని స్థానికులకు తలో 7 డాలర్లమేర ఉచిత నగదు పంపిణీ కార్యక్రమం చివరకు ఘోర విషాదంతో ముగిసింది. వందల సంఖ్యలో జనం తరలిరావడం, వారిని అదుపుచేసేందుకు సాయుధ హౌతీ తిరుగుబాటుదారులు గాల్లోకి కాల్పులు జరపడం, ఆ తూటాలు తగిలి విద్యుత్ తీగల వద్ద పేలిన శబ్దాలతో భయపడిన పేదజనం పరుగెత్తారు. దీంతో హఠాత్తుగా తొక్కిసలాట చోటుచేసుకుంది.
యెమెన్ రాజధాని సనా సిటీలోని ఓ పాఠశాల ఆవరణలో జరిగిన ఈ తొక్కిసలాటలో చిన్నారులు, మహిళలుసహా 78 మంది ప్రాణాలుకోల్పోయారు.73 మంది గాయపడ్డారు. 13 మంది పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని ఈ ప్రాంతాన్ని పాలిస్తున్న హౌతీ తిరుగుబాటుదారులు తెలిపారు. ఓల్డ్‌సిటీ పరిధిలోని బాబ్ అల్–యెమెన్ ప్రాంతంలోని మయీన్ స్కూల్‌లో బుధవారం అర్ధరాత్రివేళ ఈ ఘోరం సంభవించింది. నగదు పంపిణీ కార్యక్రమం నిర్వహణలో విఫలమవడంతో దాతలైన ఇద్దరు స్థానిక వ్యాపారవేత్తలను అరెస్ట్‌చేశామని హౌతీ రెబల్స్ నేతృత్వంలోని అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది.
దారుణ మానవ విపత్తు
2014లో యెమెన్ ఉత్తర ప్రాంతంపై పట్టు కోల్పోయిన హౌతీ తిరుగుబాటుదారులు ఆ తర్వాతి ఏడాదే దేశ రాజధానిని తమ వశంచేసుకుని ఆ ప్రాంతాన్ని పాలిస్తున్నారు. అదే ఏడాది గత ప్రభుత్వాన్ని పునరుద్ధరించేందుకు సౌదీ అరేబియా నేతృత్వంలోని కూటమి ప్రయత్నించినా ఇంతవరకూ సాధ్యపడలేదు. ఆ ఆగ్రహమే పలు మలుపులు తిరిగి నాటి నుంచి సౌదీ అరేబియా, ఇరాన్‌ల మధ్య శత్రుత్వాన్ని కొనసాగింది. ఇన్నాళ్లలో అక్కడి ఘర్షణల్లో 1,50,000 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.
పెద్ద సంఖ్యలో పౌరులు, సైనికులను పొట్టనబెట్టుకున్న ఈ సంఘర్షణ ప్రపంచంలోనే అత్యంత దారుణ మానవసంక్షోభాల్లో ఒకటిగా నిలిచింది. 2.1 కోట్ల దేశజనాభాలో మూడింట రెండొంతుల మంది పేదలు అంతర్జాతీయ సాయంకోసం అర్రులుచాస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment