
కీవ్: ఉక్రెయిన్, రష్యా మధ్య భీకర పోరు నడుస్తోంది. ఇరు దేశాల సైనికులు తగ్గేదేలే అన‍్నట్టుగా తమ పోరాట పటిమను చూపిస్తున్నారు. కాగా, రష్యా తాము చర్చలకు సిద్దమంటూనే మరోవైపు దాడులను కొనసాగిస్తోంది. ఇదిలా ఉండగా ఉక్రెయిన్‌తో చర్చల కోసం బెలారస్‌లోని గోమెల్‌కు తాము ఓ బృందాన్ని పంపిస్తామంటూ రష్యా ప్రకటన చేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ రష్యాతో చర్చలకు తాము కూడా సిద్ధంగా ఉన్నామన్నారు. కానీ, చర్చలకు బెలారస్ ఆమోదయోగ్యం కాదని.. అక్కడి నుంచే రష్యా దాడులను పాల్పడిందంటూ ఆరోపించారు. ఈ నేపథ్యంలో యుద్ద వాతావరణం లేని ప్రాంతంలో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. వార్సా, ఇస్తాంబుల్, బాకు ప్రాంతాల్లో ఏ చోట చర్చలు జరిపినా తాను అక్కడికి వచ్చేందుకు సిద్దంగా ఉన్నానని ప్రకటించారు.
అంతకు ముందకు జెలెన్ స్కీ.. యుద్దం విషయంలో రష్యా మాట తప్పిందని ఆరోపించారు. ఉక్రెయిన్ ప్రజల ఇళ్లపై రష్యా సైన‍్యం దాడులకు పాల్పడిందని విమర‍్శించారు. ఈ దాడుల్లో సామాన్య ప్రజలు మృతి చెందారని, గాయపడిన వారిని ఆసుపత్రులకు తీసుకువెళ్తున్న అంబులెన్స్‌లపైన కూడా సైనిక దాడులు జరిగినట్టు వెల్లడించారు. ఈ దాడుల్లో తీవ్రంగా ఆస్తి నష్టం జరిగిందన్నారు.