Russians are leaving as of now to rethink their strategy: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ముగిసిపోలేదా?. 38వ రోజు కూడా ఇంకా కొన్ని చోట్ల దాడులు కొనసాగుతున్నాయి మరి. కొన్ని నగరాల్లో బలగాలను మాత్రమే తగ్గిస్తామని చెప్పిన రష్యా.. ఆ మాటనూ నిలబెట్టుకుంటోంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ నుంచి రష్యా దళాలు వెనక్కుమళ్లించినట్లు ఉపగ్రహ చిత్రాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో యుద్ధం ముగిసిందని ఉక్రెయిన్ బలగాలు ఊపిరి పీల్చుకుంటున్నాయి. ఈ తరుణంలో.. ఉక్రెయిన్ సైన్యాధికారి ఒకరు.. కీలక వ్యాఖ్యలు చేశారు.
యుద్ధం ముగిసిపోలేదని, భవిష్యత్తుల్లో మరిన్ని యుద్ధాలు చేయాల్సి రావొచ్చని భద్రతాధికారి ఒలెక్సీ డానీలోవ్ అంటున్నారు. యుద్ధం ముగిసిందని వేడుకలు చేసుకోవడానికి ఇది తరుణం కాదు. అది తొందరపాటు చర్యే అవుతుంది. యుద్ధం భయం ఇంకా పోలేదు. అలాగే భవిష్యత్తులో మరిన్ని యుద్ధాలు చేయాల్సి రావొచ్చు అని పేర్కొన్నారాయన. ఉక్రెయిన్‌ను నాశనం చేయాలనే పుతిన్ ఆకాంక్ష ఇంకా పూర్తి కాలేదు. ఈ గ్యాప్‌లో సైన్యాన్ని పునఃసమీకరించుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి, ఎవరూ తొందరపడి సంబురాలు చేసుకోవద్దని వ్యాఖ్యానించారాయన.
ఇదిలా ఉంటే.. కీవ్ నగరానికి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న హోస్టోమెల్‌లోని ఆంటోనోవ్ విమానాశ్రయం నుంచి మాస్కో దళాలు వెనక్కిమళ్లాయని డానిలోవ్ ప్రకటించారు.
వ్యూహం మారుతుందేమో!: జెలెన్‌స్కీ
తమ వ్యూహాన్ని మార్చుకుని దాడి చేసేందుకే రష్యన్లు వెనక్కుమళ్లారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అంటున్నారు. వాళ్లకు విజయం కావాలి. మే 9వ తేదీ( నాజీ జర్మనీపై తమ విజయానికి గుర్తుగా ఆరోజు రష్యా ‘విక్టరీ డే’ పేరుతో దేశవ్యాప్తంగా సంబురాలు జరుపుతుంటుంది) వాళ్లకు ఎంతో కీలకం. అందుకు ఇంకా సమయం ఉంది. ఆలోపు ఏదైనా జరగొచ్చు. కాబట్టి మనం ముందు ముందు తీవ్ర పరిస్థితులను ఎదుర్కొవాల్సి రావొచ్చు అని జాతిని, సైన్యాన్ని ఉద్దేశించి ప్రసంగించాడు జెలెన్‌స్కీ. అంతేకాదు రష్యా బలగాలు ఉక్రెయిన్ రాజధాని వెలుపల భారీ విధ్వంసాన్ని సృష్టించాయన్నారు.
ఉక్రెయిన్ భూభాగాన్ని శ్మశానంగా మార్చి వెళ్తున్నారని ఆవేదనగా చెప్పారు. మళ్లీ యథాతధంగా మన జీవితానికి రావడం దాదాపు అసాధ్యం. ఇక దాడులు జరగవు అనే భరోసా వచ్చేంతవరకు మనం జాగ్రత్తగా ఉండాల్సిందేనని చెప్పారు.
(చదవండి: చెర్నోబిల్‌ను వీడిన రష్యా ఆర్మీ)
Comments
Please login to add a commentAdd a comment