క్షణాల్లో మాయమైతివా బిడ్డా.. | Sakshi
Sakshi News home page

క్షణాల్లో మాయమైతివా బిడ్డా..

Published Fri, Jul 21 2023 1:42 AM

- - Sakshi

గొల్లపల్లి(ధర్మపురి): ‘క్షణాల్లో మాయమైతివా బిడ్డా’అంటూ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. అప్పటి వరకు బాగానే ఉన్న యువకుడు కళ్లముందే కుప్పకూలడం, ఆపై ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. స్థానికుల వివరాలు.. గొల్లపల్లి మండలం గుంజపడుగు గ్రామానికి చెందిన ఓరుగంటి సరోజన– మల్లేశం దంపతులకు అరుణ్‌(18), కూతురు అక్షిత సంతానం. అరుణ్‌ జగిత్యాల ఎస్‌కేఎన్‌ఆర్‌ కళాశాలో డిగ్రీ రెండో సంవత్సరం, కూతురు గురుకుల కళాశాలలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు.

వ్యవసాయ కూలీ పనులు చేసుకునే దంపతులు పిల్లలను ఉన్నంతలో చదివిస్తున్నారు. అరుణ్‌ గురువారం మధ్యాహ్నం మినరల్‌ వాటర్‌ తీసుకొచ్చేందుకు వెళ్లాడు. నీటిని క్యాన్‌లో పడుతున్న క్రమంలో అక్కడే ఒక్కసారిగా కళ్లు తిరిగి కింద పడిపోయాడు. మరోసారి బలవంతంగా లేచి నిలుచునే క్రమంలో మళ్లీ కుప్పకూలాడు. క్షణాల్లో కుప్పకూలడం, ఆపై ప్రాణాలు పోవడంతో స్థానికులు షాక్‌కు గురయ్యారు.

అయినా ఆందోళనలో ఉన్న స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం జగిత్యాల ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి, కిందపడిపోవడంతో శ్వాస ఆగి చనిపోయాడని ధ్రువీకరించారు. చేతికి అందివచ్చిన కొడుకు చనిపోవడంతో కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించగా, వారిని ఆపడం ఎవరితరం కాలేదు.

Advertisement
 
Advertisement
 
Advertisement