జగిత్యాల: జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లలో సహకార సంఘాలు యాసంగి సీజన్‌లో రూ.607.52 కోట్ల ధాన్యాన్ని కొనుగోలు చేశాయి. రాష్ట్రంలోనే సహకార సంఘాల ద్వారా అత్యధికంగా ధాన్యం కొనుగోలు చేసిన జిల్లా జగిత్యాల కావడం విశేషం.
ఒకప్పుడు రైతులకు పంట రుణాలు ఇవ్వడం, తీసుకోవడానికే పరిమితమైన సహకార సంఘాలు, ఇప్పుడు ధాన్యం కొనుగోలు చేస్తూ కమీషన్ రూపంలో మంచి అదాయాన్ని ఆర్జిస్తున్నాయి. అంతేకాకుండా సహకార సంఘంలోని సభ్యులైన రైతులకు ఇబ్బందులు కలుగకుండా, ఎక్కడికక్కడే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తూ ధాన్యం కొనుగోలు చేస్తున్నారు.
252 కొనుగోలు కేంద్రాలు
జిల్లాలోని సహకార సంఘాల ద్వారా గ్రామాల్లో 252 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లాలో 306 గ్రామ పంచాయతీలుండగా చిన్న గ్రామాలను మినహాయించి, అన్ని గ్రామ పంచాయతీల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు.
కొనుగోలు కేంద్రం పరిధిలోని రైతుల ధాన్యాన్ని ప్రభుత్వ మద్దతు ధర క్వింటాల్‌కు రూ.2.060 చొప్పున కొనుగోలు చేసి, రైస్‌మిల్లులకు పంపించారు. జిల్లా సహకార అధికారుల పర్యవేక్షణలో సహకార సంఘం చైర్మన్లు, డైరెక్టర్లు ఆయా గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలను రోజూ పర్యవేక్షించి, కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూశారు.
29.49 లక్షల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు
యాసంగి సీజన్‌లో వరిపంట సాగులో ఎలాంటి ఆంక్షలు లేకపోవడంతో, రైతులు ఎక్కువగా దొడ్డురకం వరిని సాగుచేశారు. దీంతో అనుకున్న స్థాయిలో జిల్లాలో ధాన్యం ఉత్పత్తి అయ్యింది. ప్రభుత్వం గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయడంతో, రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు మహిళా సంఘాల కంటే ముందే గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేశారు. యాసంగిలో 39,025 మంది రైతుల నుంచి, రూ 607.52 కోట్ల విలువ గల 29.49 లక్షల క్వింటాళ్లను కొనుగోలు చేశారు.
రూ.9.43 కోట్ల కమీషన్
వరి ధాన్యం కొనుగోలు చేసినందుకు సివిల్ సప్లై సంస్థ సహకార సంఘాలకు క్వింటాల్‌కు రూ.32 కమీషన్ ఇస్తుంది. ఇలా జిల్లాలోని సహకార సంఘాలకు రూ. 9.43 కోట్ల కమీషన్ రానుంది. సహకార సంఘం పరిధిలో కొనుగోలు కేంద్రాలు ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేసి, పెద్ద మొత్తంలో ధాన్యం కొనుగోలు చేస్తే ఆ మేరకు కమీషన్ డబ్బులు వస్తాయి.
దీంతో సహకార సంఘాలు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుకు చేసేందుకు పోటీపడ్డాయి. కొనుగోలు సీజన్ పూర్తికాగానే, కమీషన్ డబ్బులు అందించాల్సిన సివిల్ సప్లై సంస్థ తాత్సారరంతో ప్రతి సంఘానికి ఇవ్వాల్సిన డబ్బులు పెండింగ్‌లో ఉంటున్నాయి. ధాన్యం కొనుగోలు కమీషన్ డబ్బులతో మరిన్ని వ్యాపారాలు చేసేందుకు సహకార సంఘాలు ముందుకొస్తున్నాయి. ఇప్పటికే ఎరువులు, విత్తనాలు, పురుగుమందుల వ్యాపారంలో ఉన్న సంఘాలు, పెట్రోల్ బంక్‌లు ఏర్పాటు చేస్తున్నాయి.
గ్రామాల్లో సూపర్ మార్కెట్లు ఏర్పాటు చేసేందుకు, కూలీల శ్రమను తగ్గించేందుకు ఆధునిక పరికరాలు కొనుగోలు చేసి, రైతులకు అద్దెకిచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. రైతుల ధాన్యం నిల్వ చేసేందుకు, ఎరువుల బస్తాల నిల్వకోసం గోదాంలు నిర్మిస్తున్నారు. పంట రుణాలే కాకుండా వాహన, బంగారం తాకట్టు రుణాలు, విదేశీ విద్యా రుణాలు కూడా ఇస్తున్నారు.
మంచి ఆదాయం
వరి ధాన్యం కొనుగోళ్లు సహకార సంఘాలకు వరంగా మారాయి. గతంలో ఎలాంటి ఆదాయం లేక సహకార సంఘాలు మూతపడే పరిస్థితి నెలకొంది. మా సహకార సంఘం పరిధిలోనే దాదాపు 10 వరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, మంచి అదాయం సంపాదించాం. – మహిపాల్ రెడ్డి, సహకార సంఘం చైర్మన్,
ధాన్యం కొనుగోళ్లలో పోటీ
సహకార సంఘాలు ధాన్యం కొనుగోలు చేసేందుకు పోటీపడుతున్నాయి. కొన్ని సంఘాలు ఆ సంఘాల పరిధిలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, ఐకెపీకి పోటీగా కొనుగోలు చేస్తున్నాయి. కమీషన్‌లో వచ్చిన డబ్బులను సంఘం సభ్యులు చర్చించి, వ్యాపారాలు చేసేందుకు ఉపయోగిస్తున్నారు. –రామానుజాచారి, జిల్లా సహకార అధికారి, జగిత్యాల
ధాన్యం కొనుగోళ్ల వివరాలు
మండలం కొనుగోలు చేసిన ధాన్యం.. బీర్‌పూర్ 71,328, బుగ్గారం 70,207, ధర్మపురి 2,57,371, గొల్లపల్లి 2,26,217, ఇబ్రహీంపట్నం 1,27,659, జగిత్యాల రూరల్ 1,03,154, జగిత్యాల అర్బన్ 44,074, కథలాపూర్ 2,27,888, కొడిమ్యాల 1,34,717, కోరుట్ల 1,79,902, మల్లాపూర్ 1,35,886, మల్యాల 1,59,621, మేడిపల్లి 2,16,537, మెట్‌పల్లి 2,29,731, పెగడపల్లి 2,46,720, రాయికల్ 1,40,624, సారంగాపూర్ 1,01,727, వెల్గటూర్ 2,75,769.
Comments
Please login to add a commentAdd a comment